ఆ ఫేక్ షాట్‌తో బిత్తరపోయిన కీపర్, ఫీల్డర్
బ్యాట్స్‌మన్ ఏ షాట్ ఆడుతాడో.. కొంత ముందుగానే పసిగట్టి అందుకు తగ్గట్టు కీపర్, ఫీల్డర్ తమ దిశను మార్చుకుంటున్నారు. బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి తమను దాటి తప్పించుకోకుండా ఈ జాగ్రత్త తీసుకుంటారు. కానీ ఓ అనూహ్య ఫేక్ షాట్‌తో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మిస్బావుల్ హక్ ఇంగ్లండ్ వికెట్ కీపర్, స్లిప్ ఫీల్డర్‌ను బోల్తా కొట్టించాడు.
2015లో యూఏఈలో పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఓ టెస్టు మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మిస్బా అనూహ్యరీతిలో వికెట్ కీపర్‌ను, స్లిప్ ఫీల్డర్‌ను బురిడీ కొట్టించాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో బంతి గింగిరాలు తిరుగుతూ మిస్బాపైకి వచ్చింది. దీంతో స్వీప్ షాట్ కొట్టేందుకు సిద్ధమైనట్టు మిస్బా పోజు ఇచ్చాడు. బ్యాట్స్‌మన్ మూవ్‌మెంట్‌ను బట్టి అతను స్వీప్ షాట్ కొడతాడని భావించిన స్లిప్ ఫీల్డర్ జేమ్స్ అండర్సన్ లేగ్సైడ్కు మారాడు. కీపర్ జాస్ బట్లర్ కూడా ముందుజాగ్రత్తగా కొద్దిగా లెగ్‌సైడ్‌కు జరిగాడు. ఇంతలో మిస్బా బంతి గమనాన్ని పసిగట్టి.. మెరుపువేగంతో దానిని లేట్ కట్ చేశాడు. దాంతో స్లిప్‌లో క్యాచ్ అవ్వాల్సిన బంతి.. అక్కడ ఎవరూ లేకపోవడంతో బౌండరీ దిశగా దూసుకుపోయింది. బౌండరీ లైన్ వద్ద బంతిని ఫీల్డర్ ఆపాడు. లేకుంటే ఫోర్ అయ్యేదే. ఈ సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.