సక్సెస్ స్కూళ్లలో ఇక పూర్తిగా ఇంగ్లిష్ మీడియం
విద్యార్థులకు బోధనపై ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతంలో ఏర్పాటు చేసిన సక్సెస్ స్కూళ్లను ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయి ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలుగా మార్పుచేశారు. ఇప్పటి వరకూ సమాంతరంగా తెలుగు, ఆంగ్ల మాధ్యమ తరగతులతో నడుస్తున్న ఈ స్కూళ్లన్నీ ఇక నుంచి పూర్తిస్థాయి ఇంగ్లిషుమీడియం పాఠశాలలుగా కొనసాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో 3,428 సక్సెస్ స్కూళ్లు ఉన్నాయి. 2014-15 విద్యా సంవత్సరంలో సక్సెస్ స్కూళ్లలో చేరిన విద్యార్థుల్లో 31.36 శాతం మంది ఇంగ్లిషు మీడియంలో చేరినవారే.
సక్సెస్ స్కూళ్లలోని ప్రస్తుత తెలుగు మాధ్యమిక విద్యార్థులను (9, 10 మినహాయించి) రెండు కి లోమీటర్ల లోపు దూరంలో ఉన్న ఇతర హైస్కూళ్లలోకి మార్పు చేయనున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ స్కూళ్లలో కేవలం ఆంగ్లమాధ్యమ విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని పదో తరగతి వర కూ అందులోనే కొనసాగించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే ఈ స్కూళ్లలో ఇప్పటికే తొమ్మిది, పదో తరగతి చదువుతున్న తెలుగు మాధ్యమం విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు వారిని అక్కడే యథాతథంగా అవే మాధ్యమాల్లో కొనసాగించాలని సూచించింది.
టీచర్ల నియామకం ఇలా
ఈ స్కూళ్లలో ఆంగ్లమాధ్యమంలో బోధించడానికి ఉత్సుకత చూపే టీచర్లను గుర్తించి నియామకం చేసే బాధ్యతను జిల్లా విద్యాధికారులకు అప్పగించారు. వీరికి వేసవి తదితర సెలవుల కాలంలో ఆంగ్ల మాధ్యమంలో నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
దశలవారీగా పరీక్షల విధానంలో మార్పులు: ఆంగ్ల మాధ్యమికాలుగా ప్రారంభమవుతున్న ఈ స్కూళ్లలో దశలవారీగా పరీక్షల విధానాన్ని మార్చుకుంటూ వెళ్లనున్నారు.