సినిమాలకు ఇంగ్లిష్ టైటిల్స్ పెడితే సబ్సిడీ కట్!
తిరువనంతపురం: భారతదేశంలో చిత్ర పరిశ్రమలకు ఇంగ్లిష్ టైటిల్స్ తో ఏదో తెలియని సంబంధం. దేశంలో ఉన్న సినీ పరిశ్రమల్లో ఇంగ్లిష్ టైటిల్స్ వాసన లేకుండా సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. ప్రతీ రాష్ట్రంలో మాతృభాషను బ్రతికించుకోవడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నా.. సినిమా టైటిల్స్ విషయంలో మాత్రం నామమాత్రంగానే వ్యవహరిస్తున్నాయి. అయితే ఇక నుంచి మాతృభాషను సాధ్యమైనంతవరకూ బ్రతికించుకోవడానికి కేరళ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
మాతృభాషలో సినిమా టైటిల్స్ పెట్టిన చిత్రాలకు మాత్రమే సబ్సిడీ వర్తింప చేయడానికి సన్నద్ధమైంది. దీంతో పాటు ఇంగ్లిష్ టైటిల్స్ కు చెక్ పెట్టేందుకు కూడా నడుంబిగించింది. ఇక నుంచి మలయాళ చిత్ర సీమలో ఏ చిత్రానికైనా ఇంగ్లిష్ టైటిల్స్ పెడితే మాత్రం సబ్సిడీ ఉండదని తెలియజేసింది. ఇందుకోసం దర్శకుడు ఆదూర్ గోపాల్ క్రిష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మాతృభాషలోని తెరకెక్కించే సినిమాలకు సంబంధించి విధివిధానాలను పరిశీలించి.. అందుకు తగిన సహకారం అందిస్తుంది. చిత్ర పరిశ్రమలో సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని పర్యవేక్షించి తగిన సూచనలు చేస్తుంది.