ఎంసెట్ 2ను రద్దు విరమించుకోవాలి
గజ్వేల్‌రూరల్ : ప్రభుత్వం ఎంసెట్2ను రద్దు చేస్తున్నట్లు విరమించుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కామల్ల భూమయ్యయాదవ్ పేర్కొన్నారు. శనివారం గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్2ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం ప్రభుత్వ అసమర్ధతను తెలియజేస్తుందన్నారు. ఎంసెట్2 రద్దు ద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంసెట్ పరీక్షల సమయాల్లో నిమిషం ఆలస్యమైనా అనుమతించమని చెప్పిన ప్రభుత్వం... పరీక్షలపై కట్టుదిట్టంగా నిర్వహించే విషయంపై ఎందుకు లేదని ప్రశ్నించారు.
లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించి... దానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేయాలని, అంతేగాకుండా ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణరావు, చైర్మన్ పాపిరెడ్డిలను సస్పెండ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హన్మంతరెడ్డి, భాస్కర్‌రెడ్డి, సాయి, వినోద్, జాన్సన్, అశోక్, మల్లేశం పాల్గొన్నారు.