జవాన్ల కుమార్తెలకు రెండు శాతం సీట్లు
ముంబై: రక్షణ రంగంలో పనిచేస్తున్న జవాన్ల కుమార్తెల కోసం తమ విద్యాసంస్థల్లో రెండు శాతం సీట్లు కేటాయించినట్లు రాష్ట్రంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ప్రవరా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రకటించింది.
ఈ సందర్భంగా ఆ ట్రస్ట్ చైర్మన్ అశోక్ విఖే పాటిల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మన దేశ రక్షణకు అహర్నిశలు కృషిచేస్తున్న జవాన్లకు కృతజ్ఞతాభావంగా తమ విద్యాసంస్థల్లో రెండు శాతం సీట్లను కేటాయించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.
తన తండ్రి, పార్లమెంట్ డిఫెన్స్ కమిటీకి ఐదేళ్లపాటు చైర్మన్‌గా పనిచేసిన మాజీ కేంద్ర మంత్రి బాలాసాహెబ్ విఖే పాటిల్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల స్థాయినుంచి ప్రొఫషనల్ కోర్సుల వరకు సుమారు 125 సంస్థలు నడుస్తున్నాయని, వాటిలో సుమారు 40 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అశోక్ తెలిపారు.
కాగా, మాజీ ఎయిర్‌చీఫ్ పీవీ నాయక్ ఆధ్వర్యంలో ఆర్మీకి సంబంధించి అడ్మిషన్లు చేపడతామని తెలిపారు. తమ విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందిన బాలికలకు విద్యాభ్యాసానికి, హాస్టల్‌కు సంబంధించి ఎటువంటి రుసుం తీసుకోబోమని, అన్ని సౌకర్యాలు ఉచితంగా అందజేస్తామని స్పష్టం చేశారు.