రూ. 3-4 లక్షలకే రెనో చిన్నకారు.. క్విడ్
⇒ క్విడ్ కారుతో ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లోకి
⇒ ధరరూ.3-4 లక్షల రేంజ్లో
⇒ సెప్టెంబర్-అక్టోబర్ కల్లా అందుబాటులోకి
చెన్నై: ఫ్రాన్స్‌కు చెందిన రెనో కంపెనీ ఎంట్రీ లెవెల్ కార్ల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. చూడటానికి ఎస్‌యూవీలా ఉండే చిన్న కారు ‘క్విడ్’ను బుధవారం ఆవిష్కరించింది. మారుతీ సుజుకీ ఆల్టో(రూ.2.83 లోల నుంచి రూ.3.4 లక్షలు), హ్యుందాయ్ ఇయాన్ (రూ.3.09 లక్షల నుంచి రూ.4.22 లక్షలు)లకు ఈ క్విడ్ కారు గట్టిపోటీనివ్వగలదని రెనో గ్రూప్ చైర్మన్, సీఈఓ కార్లోస్ గోన్ తెలిపారు.
ఈ కారు ధర రూ. 3లక్షల నుంచి రూ.4 లక్షల రేంజ్లో ఉండొచ్చని పేర్కొన్నారు. దసరా, దీపావళి పండుగల(సెప్టెంబర్-నవంబర్ కల్లా) సీజన్‌కల్లా ఈ కారును మార్కెట్లోకి తెస్తామని తెలిపారు. రూ.3,000 కోట్ల పెట్టుబడులతో ఈ కారును డెవలప్ చేశామని వివరించారు.. మినీ డస్టర్‌లా ఉండే ఈ క్విడ్ కారును 800 సీసీ ఇంజిన్‌తో రూపొందించామని ఈ సెగ్మెంట్లోనే అత్యుత్తమ మైలేజీనిస్తుందని పేర్కొన్నారు. భారత్‌లోనూ, అంతర్జాతీయంగానూ రెనో నుంచి అత్యంత చౌకగా లభ్యమవుతున్న కారు ఇదే.
క్విడ్ కీలకం...
భారత కార్ల మార్కెట్లో ప్రస్తుతం తమ వాటా 1.5 శాతమని కార్లోస్ చెప్పారు. 5 శాతం మార్కెట్ వాటా సాధించడం లక్ష్యమని, క్విడ్ కారుతో దానిని సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లోనే కాకుండా ఇతర వృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా తమ అమ్మకాల వృద్ధికి క్విడ్ కీలకం కానున్నదని వివరించారు. క్విడ్ తయారీలో 98 శాతం వరకూ స్థానిక విడిభాగాలనే వినియోగించామని పేర్కొన్నారు.
ఈ కొత్త కారును భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతులు చేయాలని యోచిస్తున్నామని చెప్పారు. ఫ్రాన్స్, జపాన్, భారత్‌ల నైపుణ్యాలు మేళవించి ఈ కారును తయారు చేశామని తెలిపారు. నాలుగేళ్లలో చైనా, అమెరికా, జపాన్ల తర్వాత నాలుగో అతి పెద్ద కార్ల మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ కంపెనీ ఎస్యూవీ డస్టర్, ఎంపీవీ లాడ్జీ, పల్స్, ఫ్లూయెన్స్ కొలియోస్, స్కేలా... మొత్తం ఆరు మోడళ్లను విక్రయిస్తోందని పేర్కొన్నారు.
ప్రత్యేకతలు...
రెనో డిజైన్ చేసిన కొత్త కామన్ మాడ్యుల్ ఫ్యామిలి(సీఎంఎఫ్-ఏ) ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును రూపొం దించారు. చూడటానికి మినీ డస్టర్‌లాగా కనిపించే ఈ కారులో బ్లూ టూత్ కనెక్టివిటీ ఉన్న 6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ నావిగేషన్, డిజిటల్ స్పీడో మీటర్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్(ఆప్షనల్), 800 సీసీ, 3- సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ వంటి ప్రత్యేకతలున్నాయి.
డస్టర్, లాడ్జీ కారుల్లో మాదిరే ఇంటీరియర్ డిజైన్ ఈ కారులో ఉంది. ఈ సెగ్మెంట్ కార్లలో విశాలమైన లెగ్‌రూమ్ ఉన్న కారు ఇదేనని కంపెనీ పేర్కొంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఫీచరున్న వేరియంట్‌నూ కంపెనీ అందించనున్నది. ఈ కారులో ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు.