environmental balance
-
Earth Overshoot Day 2024: ఆగస్టు1 నాటికే.. అన్నీ వాడేశాం!
భూగోళం ప్రకృతి వనరులను పునరుత్పత్తి చేసుకోగలిగే వేగం కంటే.. ప్రకృతి వనరులను మనుషులు అధిక వేగంతో వాడుకుంటూ ఉండటం వల్ల ఈ ఏడాదంతా వాడుకోవాల్సిన వనరులు ఆగస్టు1 నాటికే పూర్తిగా వాడేసుకున్నట్లు గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ చెబుతోంది. అంటే.. రేపటి (ఆగస్టు 2) నుంచి మనం పీల్చే గాలి, తాగే నీరూ, వాడే వనరులన్నీ ప్రకృతికి పెనుభారమే! అది తెలియజెప్పేదే ‘ఎర్త్ ఓవర్ షూట్ డే’.ఒక విధంగా చెప్పాలంటే.. మనుషులు భూగ్రహంపై పర్యావరణ వ్యవస్థలు పునరుత్పత్తి చేయగల దానికంటే 1.7 రెట్లు వేగంగా ప్రకృతివనరులను ఖర్చు చేస్తున్నారని 2024 ఎర్త్ ఓవర్ షూట్ డే సూచిస్తోంది. ఈ పర్యావరణ లోటు ఎంత ఎక్కువగా ఉంటే.. అడవుల నిర్మూలన, నేలకోత, జీవవైవిధ్య నష్టం అంత వేగంగా జరుగుతున్నట్లు లెక్క.419 పిపిఎంకి పెరిగిన సీఓ2..భూవాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత 2023 నాటికి 419.3 పార్ట్స్ పర్ మిలియన్(పిపిఎం) స్థాయికి పెరిగింది. 2022 – 2023 మధ్యలో 2.8 పిపిఎం పెరిగింది. ఏడాదికి 2 పిపిఎం కన్నా ఎక్కువగా పెరగటం వరుసగా ఇది 12వ సంవత్సరం. ఈ సాంద్రత వల్లే భూ తాపం పెరిగిపోతోంది. ఫలితంగా పర్యావరణం గతి తప్పి.. వాతావరణం మార్పులకు లోనవుతోంది.ఎవరు లెక్కిస్తున్నారు?కెనడాలోని యోర్క్ యూనివర్సిటీ ‘ఎకలాజికల్ ఫుట్‌ప్రింట్ ఇనీషియేటివ్’ కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి పునరుత్పత్తి సామర్థ్యాన్ని, ఏయే దేశాల్లో ప్రకృతి వనరుల వాడకం ఏ తీరులో ఉంటోందో లెక్కగడుతోంది. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ఈ గణాంకాలు అందుబాటులో ఉన్నాయి. 1971లో ప్రపంచ పర్యావరణ బడ్జెట్ డిసెంబర్ ఆఖరి రోజుల వరకు సరిపోతూ ఉండేది. 1973 నుంచి లోటు పెరుగుతూ వచ్చింది. 1997 అక్టోబర్ వరకు ఉండేది. ఆ తర్వాత మరింత వేగంగా పెరుగుతూ 2024 ఆగస్టు 1 నాటికే పర్యావరణ వనరుల ఖాతా ఖాళీ అయే స్థితికి చేరింది.పర్యావరణ పాదముద్ర.. ఎంతమేరకు ప్రకృతి వనరులు వాడుతూ ఉంటే అంత పర్యావరణ పాదముద్ర (ఎకలాజికల్ ఫుట్‌ప్రింట్) ఉంటుందన్నమాట. ఇది ప్రతి మనిషికి, ప్రతి దేశానికీ వేర్వేరుగా ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అమెరికన్లలా ప్రకృతి వనరులు వాడితే 5 భూగోళాలు అవసరం అవుతాయి. అయితే ఆ విధంగా చూసుకుంటే మాత్రం ప్రకృతి వనరుల వాడకంలో భారతీయులు పొదుపరులేనని చెప్పాల్సి ఉంటుంది. ప్రపంచంలో అందరూ మనలా ఉండగలిగితే 30% వనరులు మిగిలే ఉంటాయి.మీ పర్యావరణ పాదముద్ర ఎంత?దైనందిన జీవితంలో మనం చేసే ప్రతిపనికీ ప్రకృతి వనరులు ఎంతోకొంత ఖర్చవుతూనే ఉంటాయి. మనం చేసే పనులు, తినే ఆహారం, వాడే వాహన ఇంధనం, ధరించే వస్త్రాలు.. ఇలాంటివన్నీ మన పర్యావరణ పాదముద్ర స్థాయిని నిర్ణయిస్తాయి.జీవన శైలిని మార్చుకొని సహజ వనరుల వాడకాన్ని తగ్గించుకుంటూ ప్రకృతి పరిరక్షణకు దోహదం చేయొచ్చు.. భూతలమ్మీద వాతావరణంలో కర్బన ఉద్గారాలను పెంపొందించే పనులు తగ్గించే పనులను చేపట్టగలిగితే ఆ మేరకు.. ఎర్త్ ఓవర్ షూట్ డేని వెనక్కి జరపగలం! ఏటేటా పెరిగిపోతున్న పర్యావరణ అప్పు భారాన్ని ఆ మేరకు తగ్గించుకోగలుగుతాం. అయితే, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో.. స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) ఎలాగైనా ఏటా పెరగాల్సిందే అనే మానవాళి ధోరణితో.. ఇదెంత వరకు సాధ్యం అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!ఇవి చదవండి: వీడియో: ఆకతాయిల ఓవరాక్షన్.. వరద నీటిలో మహిళపై వేధింపులు! -
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
నెల్లూరు(బృందావనం): ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజినల్ మేనేజర్ బీవీ శివయ్య పేర్కొన్నారు. సామాజిక సేవలో భాగంగా నెల్లూరు పీపుల్స్ ఫ్రంట్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సంయుక్తంగా మనుమసిద్ధినగర్‌లో మంగళవారం మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. వాతావరణ సమతుల్యత లోపించిన కారణంగా ప్రస్తుతం ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని చెప్పారు. దాదాపు 200 మొక్కలు నాటారు. మూలాపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ శాఖ మేనేజర్ వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్లు దువ్వూరు శరత్చంద్ర, పెనుబల్లి చంద్రారెడ్డి, నెల్లూరు పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్ఆచారి, రియాజ్, కోశాధికారి పెంచలరాజా, సభ్యులు సమద్, హరీష్‌సింగ్, మధు, కార్తీక్, బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.