వాడపల్లి వెంకన్నా...నీ వాడిని నేనయ్యా...!
వాడపల్లి సీటు..మహా స్వీటు
ఈఓ సీటుకు ఆఫర్ ధర రూ.30 లక్షలు
దేవాదాయంలో బది‘లీలలు’
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
దేవాదాయశాఖలో బదిలీలు జాతరను తలపిస్తున్నాయి. ఆదాయం ఎక్కువ ... ఖర్చు తక్కువ ఉన్న దేవస్థానాల కోసం పలువురు సిగపట్లుపడుతున్నారు. అర్హత లేకున్నా అందలమెక్కాలనే వారి సంఖ్య అధికంగా ఉండటంతో పలు ఆలయాల్లో పోస్టులకు డిమాండ్ పెరిగింది. డిమాండ్ ఉన్న పోస్టింగుల కోసం లక్షలు కుమ్మరించేందుకు సైతం వెనుకాడటం లేదు. అన్ని శాఖల మాదిరిగానే దేవాదాయ శాఖలో పలు క్యాడర్ల ఉద్యోగుల బదిలీ కౌన్సెలింగ్‌కు తెరలేచింది. ఈ శాఖలో బదిలీల ప్రక్రియను ఈ నెల 25లోపు (గురువారం) పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలో ప్రధానంగా అన్నవరం సత్యదేవుడు, లోవ తలుపులమ్మ తల్లి దేవస్థానం, కోనసీమలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు ప్రముఖమైనవి. అన్నవరం దేవస్థానం జాయింట్ కమిషనర్ స్థాయి కాగా, మిగిలినవి గ్రేడ్–1 దేవస్థానాల పరిధిలో ఉన్నాయి. వీటిలో వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు సుదూర ప్రాంతాల్లో సైతం ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.
.
ఆదాయం పెరగడంతో పెరిగిన అత్యాశ...
ఒకప్పుడు వాడపల్లి వెంకన్న వార్షిక ఆదాయం రూ.75 లక్షలు. అదే ఇప్పుడు మూ.3 కోట్లు పైమాటే. ఏడు వారాలు (శనివారాలు) ప్రదక్షిణలు ప్రారంభమయ్యాక భక్తుల రాక విపరీతంగా పెరిగిపోయి విస్తృతమైన ప్రచారంలోకి వచ్చింది. ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ కావడంతో వాడపల్లి ఆలయ ఈఓ పోస్టుపై చాలా మంది కన్నేశారు. అందుకే జిల్లాలో ఇప్పుడు వాడపల్లి వెంకన్న ఈఓ సీటు బాగా హాట్‌గా మారింది. ఈ ఆలయానికి అసిస్టెంట్ కమిషనర్ హోదా ఇవ్వాలి. కానీ ఇప్పటికీ గ్రేడ్–1 హోదాతోనే కొనసాగుతోంది. వాడపల్లి వెంకన్న ఆలయానికి ఇన్‌ఛార్జి ఈఓగా పనిచేస్తున్న బీహెచ్‌వీ రమణమూర్తిæ గ్రేడ్–2 అధికారి. వాస్తవానికి ఆయన గ్రేడ్ స్థాయికి కొత్తపేట మండలం వానపల్లి పళ్లాలమ్మ ఆలయానికి ఈఓగా పని చేయాలి. ఏడాది క్రితం నుంచి ఈయన వాడపల్లి దేవాలయానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
.
మేమేం తక్కువ తిన్నామా...
వాడపల్లి ఈఓగా ఇక ముందు కూడా కొనసాగాలని ఇన్చార్జిగా పనిచేస్తున్న రమణమూర్తి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గ్రేడ్–1 ఆలయానికి గ్రేడ్–2 ఈఓ ఇన్ఛార్జిగా పని చేస్తున్నప్పుడు తమకెందుకు అవకాశం ఇవ్వరని గ్రేడ్–1 ఈఓలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధానంగా మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, కృష్ణా జిల్లా మచిలీపట్నం, ర్యాలి జగన్మోహిని, పెద్దాపురం మహారాణి సత్రం తదితర ఈఓలు వాడపల్లిలో పోస్టింగ్ కోసం కుస్తీపడుతున్నారు. కోరుకున్న పోస్టింగుల కోసం ఈఓలు పశ్చిమ గోదావరి జిల్లా బాటపట్టారు. ఒక ఆమాత్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు చేయని ప్రయత్నమంటూ లేదు. కోనసీమలో గోదావరి ఒడ్డున పనిచేస్తున్న ఒక ఈఓ రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్మెంట్కు దగ్గర్లో వాడపల్లిలో చేస్తే నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చునని రాజకీయ పలుకుబడిని వినియోగిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆ పోస్టు కోసం ఆ ఈఓ పెట్టిన ఆఫర్ రేటు రూ.30 లక్షలు. వాడపల్లి ఈఓగా స్థాయి లేకున్నా ఆదాయ, వ్యయాలపై అవగాహన ఉన్న మరొక అధికారి రాజమహేంద్రవరంలో కమళ దళానికి చెందిన ఒక మహిళ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు ఆ మహిళా నేతకు అడ్వాన్సుగా రూ.5 లక్షలు విలువైన ఆభరణం సమర్పించుకున్నారని ఆ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది.
.
తలుపులమ్మ తలుపూ తుడుతున్నారు...
వాడపల్లి దేవస్థానం ఈఓ పోస్టు పరిస్థితి ఈ రకంగా ఉండగా, లోవ తలుపులమ్మ ఈఓను అక్కడి నుంచి పంపించేసేందుకు అధికార పార్టీ నేతలు చాలా పట్టుదలగా ఉన్నారు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి అయిన చంద్రశేఖర్ పాలనాపరంగా ముక్కుసూటిగా వ్యవహరిస్తుండటంతో ఆమాత్యుని సోదరుడికి కంటగింపుగా మారింది. లోవ దేవస్థానంలో అధికార దుర్వినియోగం, అవినీతి కుంభ కోణాలను సాక్ష్యాధారాలతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించగా ఈఓ స్పందించి శాఖాపరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. అవినీతి ఉద్యోగుల కొమ్ముకాసేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నాలకు ససేమిరా అనడంతో ఈఓను సాగనంపే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన లోవ ఈఓగా వచ్చి పూర్తిగా ఏడాది కూడా కానేలేదు. ఒకేచోట ఐదేళ్లుగా పనిచేస్తున్న ఒకటి, రెండు ఈఓ పోస్టులను బదిలీ కౌన్సెలింగ్ జాబితాలో చూపించ లేదని తెలిసింది. అయినవిల్లి, రాజమహేంద్రవరం చందా సత్రం ఈఓ పోస్టులు కమిషనర్‌కు వెళ్లిన బదిలీ కౌన్సెలింగ్ జాబితాలో లేకుండా చేశారంటున్నారు. ఈ పరిస్థితుల్లో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు బదిలీ కౌన్సెలింగ్‌ను చిత్తశుద్ధితో నిర్వహిస్తే తప్ప ఈ ఆలయాలను ఎవరూ కాపాడలేరు.