వికలాంగులకు ఉపశమనంగా... డిజేబిలిటీస్ వెల్ఫేర్ బోర్డ్
లీగల్ కౌన్సెలింగ్
నేను డిగ్రీ చదువుకున్నాను. నాకు చిన్నప్పటి నుండి వినికిడి సమస్య ఉంది. పూర్తిగా చెవుడు లేకున్నా, సరిగ్గా వినిపించదు. అతి బిగ్గరగా మాట్లాడితేనే వినిపిస్తుంది. మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అతికష్టం మీద చదివించారు. నా సమస్య తెలిసినా ఆర్థిక ఇబ్బందుల వల్ల డాక్టర్లను సంప్రదించలేదు. చిన్నా చితకా లోకల్ డాక్టర్ల దగ్గర (ఆర్ఎంపీ) మందులు తీసుకున్నా నా సమస్య తగ్గక పోగా, ఇపుడు ఇంకా ఎక్కువైంది. తెలిసినవారు వికలాంగులకు ఉద్యోగంలో రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. దానికి సంబంధించి చట్టం ఉందన్నారు. దయచేసి తెలియజేయగలరు.
- గట్టయ్య, నిజామాబాద్
ఆర్థిక బాధలో ఉండీ మిమ్మల్ని చదివించినందుకు మీ తల్లిదండ్రులను అభినందించాలి. కానీ మీరు కనీసం సిటీలోని గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటే బాగుండేది. మీకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్న మాట నిజమే. దానికి పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 1995 (పి.డబ్ల్యూ.డి) అంటారు. ఈ చట్టం ప్రకారం అంధులకు, దృష్టి లోపం ఉన్నవారికి, కుష్టువ్యాధి నుండి కోలుకుంటున్న వారికి, చెవిటి వారికి, శారీరక వైకల్యం ఉన్నవారికి, మెంటల్ రిటార్డేషన్ ఉన్నవారికి, మెంటల్ ఇల్నెస్ ఉన్నవారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. కాకుంటే మీకు ఎంత శాతం డిజేబిలిటీ ఉన్నదో దానికి సంబంధిత డాక్టర్లు నిర్ణయించాక 40 శాతం పైగా డిజేబిలిటీ ఉంటే మీకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ‘డిజేబిలిటీస్ వెల్ఫేర్ బోర్డ్’ వారిని సంప్రదించండి.
మేడమ్, చట్టాలు కేవలం మహిళలకేనా? భార్యాబాధితుల మాటేంటి? మా వివాహమై మూడు సంవత్సరాలైంది. మా సంసారం మూణ్ణాళ్ల ముచ్చటలాగే ఉంది. అమ్మాయి సంప్రదాయబద్దంగా ఉందని, ఇంటి పనులు చక్కదిద్దుకుంటే చాలని పెళ్లి చేసుకున్నా. మీరు నమ్మండి; నమ్మకపోండి పైసా కట్నం తీసుకోలేదు. మా వివాహమయ్యే నాటికే మామగారు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. పెళ్లి ఖర్చులకు కూడా ఆశించకుండా వివాహం చేసుకున్నా. ఏం చెప్పమంటారు, చిన్న విషయాలకు కూడా నన్ను నానా తిట్లు తిట్టడం మొదలెట్టింది. పెళ్లికి మా వాళ్లు తెచ్చిన చీరలు నచ్చలేదని నోటికొచ్చినట్లు తిట్టింది. కొత్త కదా అని సర్దుకున్నాను. నా ఫ్రెండ్స్ కొత్తకాపురం చూడ్డానికి వస్తే నన్ను కల్చర్ లేదని, వట్టి ఏబ్రాసి గాడ్నని, భార్యను కనీసం హనీమూన్కైనా తీసుకెళ్లలేదని వాళ్లందరి ముందు నన్ను అవమానించింది. విమానాల్లో హనీమూన్లకు తీసుకెళ్లే స్థోమత నాకు లేదని చెబితే నన్నూ, నా వాళ్లనూ తీవ్రంగా దూషించింది. అప్పటి వరకూ సంపాదించిన సొమ్ము లెక్క చెప్పమని గొడవలు ప్రారంభించింది. వంట రాదంటే నేనే చేయడం ప్రారంభించా. చూసి నేర్చుకోమని బుజ్జగించా. నేను చేసిన వంట బాగాలేదని నా ముఖాన ప్లేట్ విసిరికొట్టింది. ఇవి చెప్పాలంటే పెద్ద వాల్యూమ్ అవుతుంది. అత్త మామగార్లను అడిగితే ఒకే అమ్మాయని గారంగా పెంచామని, చిన్నప్పటి నుంచి కాస్త దూకుడెక్కువని, సర్దుకు పొమ్మని చెప్పారు. చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేశాను. లాభం లేదు. మొన్న బస్టాండ్లో నా ఫిమేల్ కొలీగ్తో మాట్లాడుతుంటే పబ్లిగ్గా నాపై, ఆమెపై చేయి చేసుకుంది. నాకు మరణమే శరణ్యమా?
- కృష్ణ, అమలాపురం
మీ వేదన నాకు అర్థమైంది. ఒక విషయం... చట్టాలు కేవలం మహిళలకే కాదు, అవి అందరికీ వర్తిస్తాయి. కాకుంటే కొన్ని సాంఘిక దురాచారాల నుండి మహిళలను కాపాడాలని కొన్ని చట్టాలు వచ్చాయి. మీ విషయంలో అన్ని ప్రయత్నాలు ముగిశాయని అంటున్నారు. ఇక మీకు విడాకులే శరణ్యమని అనుకుంటున్నా, మీరు వర్ణించిన బాధలు ఒకవేళ నిజమైతే, అవన్నీ ‘క్రూర ప్రవర్తన’ కిందకు వస్తాయి. హిందూ వివాహ చట్టంలోని 13వ సెక్షన్ ప్రకారం అలాంటి క్రూర ప్రవర్తన ఎవరు ఎవరి పట్ల చూపినా, విడాకులకు సహేతుకమైన కారణమౌతుంది. న్యాయవాదిని సంప్రదించండి.
నమస్తే ఆంటీ. నేనొక మైనర్ బాలుణ్ణి. నా వయస్సు 11 సం॥6వ తరగతి చదువుతున్నాను. మా తాతయ్య మీకు రాయమంటే రాస్తున్నాను. నేను మా నానమ్మ తాతయ్య దగ్గర చిన్నప్పటి నుంచి పెరుగుతున్నా. 3వ తరగతి నుండీ వీరి వద్దనే ఉంటున్నా. నన్ను మంచి స్కూల్లో చదివిస్తున్నారు. మా తాతగారు రిటైర్డ్ హెడ్మాస్టారు. మా అమ్మానాన్నలు నిత్యం పోట్లాడుకునేవారు. ఎప్పుడూ గొడవలే గొడవలు. అందువల్ల తాతగారు నన్ను తెచ్చుకున్నారు. మా అమ్మయితే నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఒకటే గొడవలు. మా ముందే అమ్మా నాన్నలు కొట్టుకునేవారు. ఇప్పుడేమో వాళ్లు విడాకులకు అప్లై చేశారని తెలిసింది. అమ్మ నా కస్టడీ కోసం కేసు వేసిందంట. నాన్న నన్ను కోర్టుకు రావాలని చెప్పారు. నాన్నేమో నేను తన దగ్గరే ఉండాలంటున్నాడు. నాకు ఇద్దరి దగ్గర ఉండటం ఇష్టం లేదు. నన్ను తాతయ్య, నాన్నమ్మ బాగా చూసుకుంటున్నారు. జడ్జిగారు నాతో మాట్లాడతారని తెలిసింది. భయంగా ఉంది. నా మనసులో మాట చెప్పవచ్చా?
- రవిచంద్ర, హైదరాబాద్
భార్యాభర్తల మధ్య అగాథాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో నీ ఉత్తరం చదివాక ఇంకా బాగా అర్థమైది. పిల్లలకు అంటే మైనర్లకు తండ్రి సహజ సంరక్షకుడు, అతని తర్వాత తల్లి. లేదా పిల్లలు ఎవరి దగ్గర ఆనందంగా, పెరుగుతారో ఎవరి దగ్గర వారి భవిష్యత్ బాగుంటుందో వారికే కస్టడీ ఇస్తారు. కాకుంటే పిల్లల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇరువురి దగ్గర పిల్లలు ఉండలేరని భావిస్తే మూడోవారికి కస్టడీ ఇస్తారు. జడ్జిగారు మిమ్మల్ని తమ ఛాంబర్లోకి పిలిచి అడుగుతారు. అక్కడ వారికి నీ మనస్సులో ఏముందో నిర్భయంగా చెప్పవచ్చు.
పిల్లల ఇష్టాలను, వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకొని, మీ తాతయ్య/నానమ్మల పరిస్థితులు విచారించి, వారి వద్ద నీకు అన్ని రకాల అభివృద్ధి ఉంటుందని కోర్టు వారు భావిస్తే తప్పకుండా నిన్ను వారి దగ్గరే ఉంచుతారు. మీ అమ్మా/ నాన్నలు అప్పుడప్పుడూ వచ్చిపోయే ఏర్పాటును ఆమోదిస్తారు. భయపడవద్దు బాబూ, తప్పకుండా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే నీవు హైస్కూల్ విద్యార్థివి. ఆలోచనా శక్తి ఉంటుంది. దానిని కోర్టు వారు గమనించి నిర్ణయం తీసుకుంటారు.
- ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్