చేసే పనిని ప్రేమించండి: సత్య
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో ప్రజ్ఞా సామర్థ్యం(ఐక్యూ-ఇంటెలిజెంట్ కోషెంట్) కంటే.. చేసే పనిపై అమితాసక్తి(ఈక్యూ-ఎమోషనల్ కోషెంట్)దే పైచేయి అవుతుందని విద్యార్థులకు సత్య నాదెళ్ల ఉద్బోధించారు. ‘విద్యార్థులు తాము ఎంచుకున్న మార్గం.. పని.. ఏదైనా అత్యంత ఇష్టపూర్వకంగా చేయడం చాలా ముఖ్యం. పనిని ప్రేమించాలి. అప్పుడు అది ఎంతటి కష్టమైనదైనా అత్యంత సులువైనదిగా మారిపోతుంది.
అదేవిధంగా ఎలాంటి ఉన్నతమైన స్థానాలకు వెళ్లినా కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మానొద్దు’ అని సత్య చెప్పారు. భారత్ పర్యటనలో భాగంగా మంగళవారమిక్కడ దేశవ్యాప్తంగా 35 వేల మంది విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. 20 రాష్ట్రాలు.. 300 నగరాల్లో 750కి పైగా ప్రాంతాల నుంచి విద్యార్థులు సత్యతో లైవ్ సంభాషణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కూడా హాజరయ్యారు.
అద్భుత అనుభూతి...
భారత్లోని యువతరంతో మాట్లాడటం నిజంగా అద్భుత అనుభూతిగా సత్య అభివర్ణించారు. ‘ప్రతిరోజునూ మీ జీవితంలో చివరిరోజుగానే భావించి ముందుకెళ్లాలి. అయితే, జీవితకాలంపాటు గుర్తుండిపోయేలాగానే ఏదైనా నేర్చుకోవాలి’ అన్న మహాత్మా గాంధీ మాటలను విద్యార్థులకు సత్య గుర్తు చేశారు. దేశంలోని యువతలో ఉన్న శక్తి, ఆశావహ దృక్పథాన్ని చూస్తుంటే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతోందని పేర్కొన్నారు.
‘ఈ ప్రపంచాన్ని మార్చాలని భావిస్తున్నారా.. మీ ముందు అపారమైన అవకాశాలున్నాయి. వినూత్నమైన ఆలోచనలతో ముందుకెళ్తే భవిష్యత్తును మార్చడం సాధ్యమే. మొబైల్ ఫస్ట్.. క్లౌడ్ ఫస్ట్ అనే వినూత్న ఆలోచన అటువంటిదే. మొబైల్ అనేది ఒక డివైజ్(పరికరం) కాదు.. ఇప్పుడు వ్యక్తే మొబైల్గా మారుతున్నాడు’ అని సత్య వ్యాఖ్యానించారు. కాగా, చిన్నతనంలో తన ఆలోచనల గురించి చెబుతూ.. ‘ముంబైని దాటి వెళ్తానని నేను అనుకోలేదు.
అయితే, చివరకు వాషింగ్టన్లో అడుగుపెట్టాను. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశా. ఇదేమీ ఆషామాషీ ప్రస్థానం కాదు. నా జీవితంలో... నేను ఎంచుకున్న దారిలో... నా అభిరులు, నన్ను నేను మలచుకున్నతీరే ఈ స్థానానికి(మైక్రోసాఫ్ట్ సీఈఓగా) నన్ను చేర్చింది’ అని సత్య విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు.