బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు
సాక్షి, హైదరాబాద్: గత బడ్జెట్ సమావేశాల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని, బ్రాహ్మణుల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎనిమిది నెలలవుతున్నా కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బ్రాహ్మణులను మోసగించడమేనని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
వార్షిక బడ్జెట్లో కేటాయించిన రూ.100 కోట్లను వెంటనే విడుదల చేయాలని, అర్చకుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల విద్య, వ్యాపార అభివృద్ధికి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలకు నిధులను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఎంతమాత్రం సరికాదన్నారు.