మెక్సికోకు దీక్షిత
ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నీకి ఎంపిక
మహబూబాబాద్ : అమెరికాలోని మెక్సికోలో ఈ నెల 13 నుంచి 17 వరకు జరిగే ప్రపంచ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ మెగా టోర్నీకి భారతదేశం తరఫున మానుకోట పట్టణానికి చెందిన ఎర్ర దీక్షిత ఎంపికైంది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆదివారం జరిగిన ఆలిండియా యూనివర్సిటీ సెలక్షన్స్ ట్రయల్స్ 58 కిలోల విభాగంలో దీక్షిత స్నాచ్‌లో 80 క్లీన్, జర్క్‌లో 102 మొత్తం 182 కిలోల బరువు ఎత్తి టోర్నీకి ఎంపికైంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని హకీంపేట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ పొందుతూ నిజాం కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ క్రీడాకారిణి అవార్డుతో పాటు సన్మానం పొందింది. గతంలో దీక్షిత భారతదేశం తరుపున అనేక దేశాల్లో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బంగారు, రజత, కాంస్య పతకాలను సాధించింది. దీక్షిత ఎంపిక పట్ల తల్లిదండ్రులతో పాటు మేనమామ అచ్చ శ్రీనివాస్, సోదరుడు రాజశేఖర్, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్, ఆర్డీఓ జి.భాస్కర్‌రావు, కౌన్సిలర్ రంగన్న తదితరులు హర్షం వ్యక్తం చేశారు.