ఇక 'ఆపరేషన్ స్మైల్'
బెంగళూరులో ప్రయోగాత్మకంగా చేపట్టిన పోలీసులు
భిక్షాటన నుంచి చిన్నారులను దూరం చేసే దిశగా
ఒకే రోజు '164' మంది చిన్నారులకు విముక్తి
మెట్రోనగరి బెంగళూరులో ట్రాఫిక్ జంజాటం, కాలుష్యం ఇవన్నీ ఎంత సర్వసాధారణమో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన కూడా అంతే సాధారణం. ముఖ్యంగా చిన్నారులను తీసుకుని భిక్షాటన సాగించే మహిళలు, చిన్నతనంలోనే భిక్షాటన దిశగా మళ్లిన చిన్నారుల సంఖ్య కూడా ఎక్కువే. ఎక్కడో అనాధలుగా దొరికిన పిల్లలను బలవంతంగా భిక్షాటన రొంపిలోకి దింపే వారు, ఇంకా చేతిలో బిడ్డతో భిక్షాటననే ఓ వ్యాపారంగా మార్చేసుకున్న వారు ఇలా ఒక్కొక్కరి వెనక ఒక్కో కథ, ఈ కథలన్నింటి వెనక మౌనంగా తమ బాల్యాన్ని కోల్పోతోంది మాత్రం చిన్నారులే. ఇలాంటి చిన్నారుల జీవితాల్లో తిరిగి నవ్వుల వసంతాన్ని తీసుకు వచ్చేందుకు పోలీసు శాఖ ప్రయోగాత్మకంగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ ఆదేశాల మేరకు ప్రారంభమైన ఈ కార్యక్రమం పేరే 'ఆపరేషన్ స్మైల్' నగర పోలీస్ కమీషనర్ మేఘరిక్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ అదనపు పోలీస్ కమిషనర్ పి.హరిశేఖరన్ ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం సాయంత్రం నుంచి ఆపరేషన్ స్మైల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం మొత్తం నాలుగు టీమ్‌లను పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో మొదటిదైన సర్వేలైన్స్ టీమ్‌లో నగరంలో చిన్నారుల సంరక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల్లోని కార్యకర్తలు, ఇతర వలంటీర్లు ఉంటారు. ఇక రెండోదైన రెస్క్యూటీమ్లో మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీసులతో పాటు (మహిళా పోలీసులతో కలిపి) స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులుంటారు. ఇక మూడోదైన ఇంటరాగేషన్, ఇన్ఫర్మేషన్ టీమ్‌లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ) అధికారి, సీపీఓ, సోషల్ వర్కర్, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ అధికారితో పాటు మహిళా పోలీసు ఉంటారు. ఇక చివరిదైన రిహాబిలిటేషన్ టీమ్‌లో సీడబ్యూసీ అధికారితో పాటు వైద్యాధికారి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, భిక్షాటన నుంచి బయటకు తీసుకు వచ్చిన పిల్లలు, మహిళలకు ఆశ్రయం ఇచ్చే సంస్థ ప్రతనిధులు భాగస్వాములై ఉంటారు. గురువారం సాయంత్రం నుంచే ఈ బృందాలన్నీ తమ పనిని ప్రారంభించాయి. గురువారం సాయంత్రం నగరంలోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సౌత్-ఈస్ట్, నార్త్-ఈస్ట్, సెంట్రల్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఏకకాలంలో 'ఆపరేషన్ స్మైల్'ను పోలీసులు చేపట్టారు. మొత్తం 237 మహిళా భిక్షుకులను ఈ రొంపి నుంచి బయటకు లాగారు. ఇందులో '164' మంది చిన్నారులుండడం గమనార్హం.
ఉపాధి మార్గాల కల్పన దిశగా.....
ఇక 'ఆపరేషన్ స్మైల్' ద్వారా రక్షించిన చిన్నారులు, మహిళలకు నగరంలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆశ్రయం కల్పించేందు కు ముందుకొచ్చాయి. ఇక వీరితో చిన్నారు లు, మహిళల రక్షణ విషయాలపై పర్యవేక్షణకు గాను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్స్ ఈ పర్యవేక్షణ బా ధ్యతలను నిర్వర్తించనున్నాయి. ఇప్పటి వర కు భిక్షాటనలో గడిపిన మహిళలకు ఇతర ఉపాధి మార్గాలను చూపడంతో పాటు చిన్నారులకు విద్యాభ్యాసాన్ని అందించే దిశగా స్వచ్ఛంద సంస్థలు పనిచేయనున్నాయి.