రెండు ఎలక్ట్రానిక్ క్లస్టర్లకు ఓకే
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా రెండు ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ల(ఈఎంసీ)ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరో 8 క్లస్టర్లకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. డిజిటల్ ఇండియా విజన్‌లో భాగంగా దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి పోత్సాహం అందించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. మంగళవారమిక్కడ రాష్ట్రాల ఐటీ మంత్రులు, కార్యదర్శులతో డిజిటల్ ఇండియాపై తొలి సమావేశం సందర్భంగా ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే తమ ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియా విజన్ ఉద్దేశమన్నారు. కాగా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ(డైట్‌వై) తుది ఆమోదం పొందిన రెండు క్టస్లర్లు కూడా మధ్య ప్రదేశ్‌లోనే ఏర్పాటు కానున్నాయని... సూత్రప్రాయ ఆమోదం పొందిన వాటిలో రెండు తెలంగాణలో.. తమిళనాడు, కేరళ, ఒడిశా, రాజస్థాన్‌లో చెరొకటి చొప్పున ఉన్నట్లు ప్రసాద్ వెల్లడించారు. కర్ణాటకలోని బ్రౌన్‌ఫీల్డ్ ఈఎంసీ(ఇప్పటికే ఉన్నదాని విస్తరణ) కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మరోపక్క, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో చెరొక ఈఎంసీ ఏర్పాటుకు సంబంధించి సూత్రప్రాయ ఆమోదం కోసం డైట్‌వై సిఫార్సు చేసినట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
కాగా, సవరించిన ప్రత్యేక ప్యాకేజీ పథకం(ఎం-సిప్స్) అమలు చేసేందుకు 51 ఈఎంసీలను డైట్‌వై గుర్తించి.. నోటిఫై చేసింది. ఈ నోటిఫైడ్ క్లస్టర్లలోని ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్(ఈఎస్డీఎం) యూనిట్లకు ఎం-సిప్స్ కింద లభించే ప్రయోజనాలు లభిస్తాయి. నోటిఫై చేసిన ఈఎంసీల్లో హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్రలో ఏడు చొప్పున; రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లలో ఆరు చొప్పున; ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, కేరళ, మధ్య ప్రదేశ్లలో మూడేసి; కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో రెండేసి; పుదుచ్చేరి, పంజాబ్, తెలంగాణ, తమిళనాడుల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.