ఆధునిక పరిజ్ఞానంతో వైద్య సేవలు: దత్తాత్రేయ
హైదరాబాద్: ఆధునిక పరిజ్ఞానంతో కార్మిక కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలసి హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాలలో టెలిమెడిసిన్ ప్రాజెక్ట్, సర్జికల్ స్కిల్స్ ల్యాబ్, ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెలి మెడిసిన్ విధానంతో కార్మికులకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. సమయం ఆదా కావడంతోపాటు దూర ప్రాంత నివాసితులకు సకాలంలో వైద్యసేవలు పొందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఒడిశా రాష్ట్ర ఉపాధికల్పన శాఖ సాయంతో టెలిమెడిసిన్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇలాజ్ హెల్త్‌కేర్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా జీడిమెట్ల, రామచంద్రాపురం మరికొన్ని డిస్పెన్సరీలను టెలి మెడిసిన్‌కు అనుసంధానం చేస్తున్నామని వివరించారు. మంత్రి నాయిని మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటగా ఈఎస్ఐ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో టెలిమెడిసిన్ ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తేవడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డెరైక్టర్ దేవికారాణి, ఆసుపత్రి డీన్ శ్రీనివాస్, ఓటెట్ ట్రస్ట్ ఎండీ కె.ఎన్.భగత్ తదితరులు పాల్గొన్నారు.