‘ఎస్మా’త్ జాగ్రత్త!
నేడు స్వచ్ఛ హైదరాబాద్
అందరూ పాల్గొనాల్సిందే
సిటీబ్యూరో: ప్రజారోగ్యాన్ని కాపాడే క్రమంలో అవసరమైతే ‘ఎస్మా’ ప్రయోగిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. కార్మికుల సమ్మె కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా రెండో శనివారమైనప్పటికీ నేడు జీహెచ్ఎంసీ పని చేస్తుందని, ఉద్యోగులంతా విధిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి బదులుగా మరో రోజు సెలవుగా ప్రకటిస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది అందరూ విధుల్లో పాల్గొనాలని కోరారు. అవసరమైతే ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించే అవకాశం ఉందని హెచ్చరించారు. పారిశుద్ధ్య విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం సాయంత్రం స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్తో కలిసి సర్కిల్ కార్యాలయాల సూపర్వైజరీ అధికారులతో కమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివీ...
శనివారం నుంచి విధులకు హాజరయ్యే ఔట్సోర్సింగ్ డ్రైవర్లకు రెట్టింపు వేతనం.
రెగ్యులర్ డ్రైవర్లకు అదనంగా రూ.100 చెల్లింపు.
శనివారం ఉదయం కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్ల వరకు ఉన్నతాధికారులందరూ విధిగా స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొనాలి.
విధులకు హాజరయ్యే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల హాజరు నమోదు.
అన్ని వాహనాలు విధిగా రిపోర్ట్ చేయాలి. విధులకు హాజరు కాని వాహనాల కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు.
{పధాన వీధుల్లోని డస్ట్బిన్లన్నీ ఖాళీ చేయాలి.
పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికులంతా విధుల్లో ఉండాలి.
విధులకు రండి..
కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున సమ్మెలో ఉన్న కార్మికులంతా వెంటనే విధులకు హాజరు కావాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హోం మంత్రి సమక్షంలో జీహెచ్ఎంసీలోని ప్రధాన కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో ఈ నెలాఖరులోగా ప్రభుత్వం విధాన ప్రకటన చేస్తుందని ప్రకటించారన్నారు. రంజాన్, బోనాలు, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.