మిస్టర్ వరల్డ్‌గా హైదరాబాదీ
- పురుషుల మోడలింగ్ ప్రపంచంలో భారత్‌కు తొలి టైటిల్
- ఫైనల్లో 46 మందితో పోటీలో నెగ్గిన రోహిత్
- భారతీయుల అభిమానమే గెలిపించింది..: రోహిత్
సాక్షి, హైదరాబాద్: మిస్టర్ వరల్డ్ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయుడు.. అదీ మన హైదరాబాదీ విజేతగా నిలిచాడు. మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన ఫైనల్స్‌లో 46 దేశాలకు చెందిన ఫైనలిస్ట్‌లతో పోటీపడి.. రోహిత్ ఖండేల్వాల్ (26) మిస్టర్ వరల్డ్-2016 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల మోడలింగ్ ప్రపంచంలో ఇప్పటిదాకా భారత్‌కు దక్కిన మిస్టర్ వరల్డ్ టైటిల్ ఇదే కావడం విశేషం. అవార్డుతో పాటు 50 వేల అమెరికన్ డాలర్ల నగదు బహుమతి రోహిత్ అందుకున్నాడు. మిస్టర్ వరల్డ్-2014 టైటిల్ విజేత నిక్లస్ పెడెర్సన్.. రోహిత్‌కు టైటిల్‌ను అందజేశారు. ప్యూర్టో రికోకు చెందిన ఫెర్నాండో అల్వరేజ్ (21), మెక్సికోకు చెందిన ఎస్పార్జా రామిరెజ్ (26) వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచారు.
రో‘హిట్’ జర్నీ సాగిందిలా..
హైదరాబాద్‌లోని అరోరా డిగ్రీ కాలేజీలో రోహిత్ చదువుకున్నాడు. తండ్రి రాజ్‌కుమార్ ఖండేల్వాల్. ఈ కుర్రాడికి చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలంటే పిచ్చి. డిగ్రీ పూర్తి చేశాక స్పైస్‌జెట్‌లో గ్రౌండ్ స్టాఫ్‌లో పనిచేసి, అనంతరం డెల్ కంప్యూటర్స్‌లో టెక్నికల్ సపోర్ట్ అసిస్టెంట్‌గా చేశాడు. రెండేళ్ల క్రితం ఎంబీఏ చేయడానికి ముంబై వెళ్లాడు. అప్పు డే మోడలింగ్ రంగానికి చేరువయ్యాడు. ఇందుకోసం 85 కిలోలకు పైగా బరువు నుంచి ఆర్నెల్ల్లలోనే 15 కిలోలు తగ్గాడు. టీవీ కమర్షియల్స్, యాడ్స్, ర్యాంప్ షోలతో మోడలింగ్ కెరీర్ ప్రారంభించి తలుపు తట్టిన ప్రతి అవకాశాన్ని అందుకున్నాడు. హైదరాబాద్‌లో ఉండగా నుక్తాంగన్ చైల్డ్ ఎంపవర్మెంట్, బ్లైండ్ పీపుల్ వెల్ఫేర్.. తదితర సంస్థలతో పనిచేశాడు.పర్సనాల్టీ డెవలప్మెంట్ సెషన్స్ నిర్వహించాడు. వి చానల్ తదితర టీవీ కార్యక్రమాలు చేశాడు.
బాలీవుడ్లో యే హై ఆషికిలో చేసిన వీర్ పాత్ర, ప్యార్తునే క్యా కియాలో చేసిన శ్రీధర్ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టాయి. మిస్టర్ ఇండియా యాడ్ చూసి ఆడిషన్స్‌కి వెళ్లి, ప్రిపరేషన్స్‌కి ఒక్క నెల మాత్రమే ఉన్నా.. అప్పటికప్పుడు టాలెంట్ రౌండ్ కోసం ఫ్రెండ్ దగ్గర మ్యూజిక్ నేర్చుకుని.. గ్రౌండ్లో 20 లీటర్ల వాటర్ క్యాన్ మోస్తూ 20 రౌండ్లు కొట్టడం వంటి కఠినమైన వర్కవుట్స్ చేశాడు. మిస్టర్ ఇండియా టైటిల్‌తో పాటు మిస్టర్ యాక్టివ్, బెస్ట్ యాక్టర్, మిస్టర్ ఫొటోజెనిక్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. అదే ఊపులో మిస్టర్ వరల్డ్ టైటిల్‌కు గురిపెట్టాడు. జూలై 17 నుం చి 19 వరకు సౌత్ లండన్‌లో జరిగిన పోటీ లో రాణించి భారత్‌కు పురుషుల గ్లామర్ ప్రపంచంలో ఫస్ట్ టైటిల్‌ను అందించాడు.
నమ్మలేకపోతున్నా: రోహిత్
‘మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలవడం ఇంకా నమ్మలేకపోతున్నాను. చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చి, ప్రోత్సహించిన మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు కృతజ్ఞతలు. నా కుటుంబం, స్నేహితులు మద్దతుతోనే ఇది సాధ్యమైంది’ అని రోహిత్ అన్నాడు. భారతీయులు చూపించిన అభిమానమే తనను టైటిల్ గెలిచేలా చేసిందని చెప్పాడు. కాగా, మిస్టర్ వరల్డ్ మల్టీమీడియా అవార్డు, మిస్టర్ వరల్డ్ టాలెంట్, మోబ్స్టార్ పీపుల్స్ చాయిస్ అవార్డ్స్, మిస్టర్ వరల్డ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ల్లోనూ పాల్గొన్న రోహిత్.. మిస్టర్ వరల్డ్ మల్టీమీడియా అవార్డును గెలుచుకున్నాడు.