నేను రంగంలో ఉండి ఉంటేనా?
పట్నా: బాలీవుడ్ నటుడు, బీజేపీ లోక్ సభ సభ్యుడు శత్రుఘ్న సిన్హా సోషల్ మీడియాలో మరోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పార్టీ ఘోర పరాజయానికి నేతలందరూ బాధ్యత వహించాలంటూ ఆయన ట్విట్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘోర పరాజయం బీజేపీలో పెద్ద దుమారాన్నే రాజేసింది. ఓటమిని సమీక్షించాల్సిందే అంటూ ఒక వైపు పార్టీ అగ్రనేతలు సన్నాయి నొక్కులు నొక్కుతుంటే.... మరోవైపు పార్టీ నేతలు, ఎంపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.
పార్టీ కురు వృద్దుడు అద్వానీ సహా మిగిలిన అగ్రనేతల వ్యాఖ్యలపై శత్రుఘ్న సిన్హా స్పందిస్తూ ట్విట్ చేశారు. ఇంత అవమానకర ఓటమి బాధ్యతల నుంచి నేతలెవ్వరూ పారిపోవడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. ఆయా నేతలకు బాధ్యతలను అప్పగించడంలో పార్టీ వైఫల్యాన్ని ఆయన ఎత్తి చూపారు. తనను రాజ్యసభ సభ్యుడిలాగా ట్రీట్ చేయొద్దని శత్రుఘ్నసిన్హా పార్టీకి సూచించారు. తాను నామినేటెడ్ సభ్యుడిని కాదని, రాష్ట్రంలో తనకు ప్రజల మద్దతుగా పూర్తిగా ఉందన్నారు.
అందుకే రికార్డ్ మెజార్టీతో తనను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించారని సిన్హా గుర్తు చేశారు. పార్టీ విజయానికి వ్యతిరేకంగా పని చేశారన్న విమర్శలను తిప్పికొట్టిన ఆయన బిహార్ ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తనకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ప్రచారానికి అనుమతిచ్చి తనను పూర్తిగా వినియోగించుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదన్నారు. తనను పక్కన పెట్టి తనతోపాటు, ఓటర్లను, తన సన్నిహితులను అవమానవించారన్నారు. అయినా బాధ్యతగల పార్టీ కార్యకర్తగా మిన్నకుండిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు