Essar Steel Company
-
ఎస్సార్ స్టీల్ కేసులో సుప్రీం కీలక రూలింగ్
ఎస్సార్ స్టీల్ దివాలా కేసులో యథాతధ స్థితిని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ కొనుగోలుకు ఆర్సెలార్ మిట్టల్ చెల్లించాల్సిన రూ. 42 వేల కోట్లను నిలిపివేయాలని తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని అభ్యర్ధనలను తొందరగా పరిశీలించి అంతిమ నిర్ణయాన్ని తీసుకోవాలని అప్పిలేట్ ట్రిబ్యున్లను ఆదేశించింది. అంతవరకు ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు ఉద్దేశించిన మొత్తాన్ని కంపెనీ రుణదాతలకు చెల్లించకుండా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆర్సెలార్ మిట్టల్‌ను ఆదేశించింది. దీంతో దేశీయ స్టీల్ మార్కెట్లోకి అడుగుపెట్టాలన్న లక్ష్మీ మిట్టల్ ఆశలు అమలయ్యేందుకు మరింత జాప్యం జరగనుంది. ఈ డీల్ పూర్తయిఉంటే దేశంలో నాలుగో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా మిట్టల్ నిలిచేది. కొనుగోలు అనంతరం కంపెనీపై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని ఆర్సెలార్ భావించింది. ఎస్సార్ రుణదాతలకు 600 కోట్ల డాలర్లిచ్చి కంపెనీని సొంతం చేసుకునేందుకు, అనంతరం కంపెనీపై మరో 110 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలార్‌కు దివాలా కోర్టు అనుమతినిచ్చింది. అయితే వచ్చేసొమ్మును ఎలా పంచుకోవాలనే అంశమై రుణదాతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రుణదాతల్లో ఒకటైన ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్టాటస్ కో ఆదేశాలు జారీ చేసింది. కేసులో భాగంగా రుణదాతలకు చెల్లిస్తామన్న 42వేల కోట్ల రూపాయలను ప్రత్యేక అకౌంట్లో వేయాలని ఆర్సెలార్‌కు సూచిస్తామని ఎన్సీఎల్ఏటీ తెలిపింది. అంతేకాకుండా కంపెనీ అనుసరించదలచిన ప్రణాళికను సైతం సమర్పించాలని ఆదేశించనుంది. దీంతోపాటు రుణదాతల సమావేశ వివరాలను కూడా పరిశీలించనుంది. ఇవన్నీ పరీశీలించిన అనంతరం తుది నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ఎస్సార్ స్టీల్‌కు రూ.37 వేల కోట్ల ఆఫర్
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్‌కు రెండో దశ బిడ్డింగ్‌లో రూ.37,000 కోట్ల కంటే ఎక్కువే ఆఫర్ చేసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్సీఎల్టీ) రష్యాకు చెందిన న్యుమెటల్ తెలియజేసింది. మరోవంక మొదటి దశలో బిడ్డింగ్ వేసిన ఏకైక కంపెనీ ఆర్సెలర్ మిట్టల్... రెండో దశ బిడ్డింగ్‌ను వ్యతిరేకించడంతో పాటు మొదటి దశ బిడ్లనే పరిశీలించాలని కోరింది. దీంతో ఎన్సీఎల్టీ ముందు న్యుమెటల్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి హాజరై రెండో దశ బిడ్డింగ్ వల్ల రుణదాతలకు అదనపు విలువ సమకూరుతుందని చెప్పారు. ఎస్సార్ స్టీల్ బ్యాంకులకు రూ.49 వేల కోట్లు బకాయి పడడంతో కంపెనీని వేలం వేస్తున్న విషయం తెలిసిందే. ఎస్సార్ స్టీల్ వేలం వ్యవహారాలు చూస్తున్న పరిష్కార నిపుణుడు రెండో దశ బిడ్డింగ్‌ను తెరవాలని, తాము రూ.37,000 కోట్ల కంటే ఎక్కువే ఆఫర్ చేశామని రోహత్గి తెలిపారు. రెండో దశలో అటు ఆర్సెలర్ మిట్టల్‌తో పాటు, న్యుమెటల్ బిడ్‌ను దాఖలు చేసింది. న్యుమెటల్‌లో రుయాలకు చెందిన ఆరోరా ట్రస్ట్‌కు 25 శాతం వాటా ఉంది. మరోవైపు రుణాలను ఎగవేసిన ఉత్తమ్ గాల్వాలో ఆర్సెలర్ మిట్టల్‌కు వాటా ఉండటం ప్రతికూలంగా మారింది. అయితే, తాము అనర్హతను తొలగించుకునేందుకు ఉత్తమ్‌గాల్వా బకాయిలను తీర్చేసేందుకు రూ.7,000 కోట్లను ఎస్క్రో ఖాతాలో జము చేసినట్టు ఆర్సెలర్ మిట్టల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. దీంతో విచారణను ఎన్సీఎల్టీ బెంచ్ ఈ నెల 22కు వాయిదా వేసింది. -
బుల్లెట్ ప్రూఫ్ స్టీల్‌ను అభివృద్ధి చేసిన ఎస్సార్ స్టీల్
ఈ తరహా స్టీల్‌ను తయారు చేసిన తొలి కంపెనీ ముంబై: ఎస్సార్ స్టీల్ కంపెనీ బుల్లెట్ ప్రూఫ్ ఉక్కును అభివృద్ధి చేసింది. అత్యున్నత పనితీరు కనబరిచే ఈ బుల్లెట్‌ప్రూఫ్ ఉక్కును అభివృద్ధి చేసిన తొలి దేశీయ కంపెనీ తమదేనని ఎస్సార్ స్టీల్ తెలిపింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ ఉక్కును రక్షణ రంగంలో అధికంగా ఉపయోగిస్తారు. తేలికపాటి ఆయుధాల వాహనాలు, రక్షణ ఛత్రాలు, నిర్మాణాల్లో ఈ బుల్లెట్ ప్రూఫ్ ఉక్కును ఉపయోగిస్తారని, మంచి డిమాండ్, వృద్ధి ఉండగలవని ఎస్సార్ స్టీల్ ఈడీ(స్ట్రాటజీ, బిజినెస్ డెవలప్మెంట్) విక్రమ్ అమిన్ చెప్పారు. అత్యున్నత భద్రత అవసరమైన వారికి, పౌర వాహనాల బుల్లెట్ ప్రూఫింగ్‌కు, ఈ స్టీల్ ఉపయోగపడుతుందన్నారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ స్టీల్‌ను సెకన్‌కు 700 మీ. వేగంతో దూసుకు వచ్చే బుల్లెట్ ఏమీ చేయలేదని వివరించారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ స్టీల్ కఠినత్వం 500 బీహెచ్ఎన్(బ్రినెల్హార్డ్నెస్ నంబర్) ఉంటుందని పేర్కొన్నారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ స్టీల్ పనితీరును భారత్‌లోనూ, జర్మనీలోనూ తనిఖీ చేశామని తెలిపారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ ఉక్కు తయారు చేయడం భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి తమ కంపెనీ అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద రక్షణ రంగానికి కావలసిన సామగ్రిని, పరికరాలను దేశీయంగానే తయారు చేయాలనేది ప్రభుత్వ అభిమతమని వివరించారు.