ఎస్సార్ స్టీల్ దివాలా కేసులో యథాతధ స్థితిని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ కొనుగోలుకు ఆర్సెలార్ మిట్టల్ చెల్లించాల్సిన రూ. 42 వేల కోట్లను నిలిపివేయాలని తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని అభ్యర్ధనలను తొందరగా పరిశీలించి అంతిమ నిర్ణయాన్ని తీసుకోవాలని అప్పిలేట్ ట్రిబ్యున్‌లను ఆదేశించింది. అంతవరకు ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు ఉద్దేశించిన మొత్తాన్ని కంపెనీ రుణదాతలకు చెల్లించకుండా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆర్సెలార్ మిట్టల్‌ను ఆదేశించింది. దీంతో దేశీయ స్టీల్ మార్కెట్లోకి అడుగుపెట్టాలన్న లక్ష్మీ మిట్టల్ ఆశలు అమలయ్యేందుకు మరింత జాప్యం జరగనుంది. ఈ డీల్ పూర్తయిఉంటే దేశంలో నాలుగో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా మిట్టల్ నిలిచేది. కొనుగోలు అనంతరం కంపెనీపై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని ఆర్సెలార్ భావించింది.
ఎస్సార్ రుణదాతలకు 600 కోట్ల డాలర్లిచ్చి కంపెనీని సొంతం చేసుకునేందుకు, అనంతరం కంపెనీపై మరో 110 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలార్‌కు దివాలా కోర్టు అనుమతినిచ్చింది. అయితే వచ్చేసొమ్మును ఎలా పంచుకోవాలనే అంశమై రుణదాతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రుణదాతల్లో ఒకటైన ఎస్‌బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్టాటస్ కో ఆదేశాలు జారీ చేసింది. కేసులో భాగంగా రుణదాతలకు చెల్లిస్తామన్న 42వేల కోట్ల రూపాయలను ప్రత్యేక అకౌంట్‌లో వేయాలని ఆర్సెలార్‌కు సూచిస్తామని ఎన్‌సీఎల్‌ఏటీ తెలిపింది. అంతేకాకుండా కంపెనీ అనుసరించదలచిన ప్రణాళికను సైతం సమర్పించాలని ఆదేశించనుంది. దీంతోపాటు రుణదాతల సమావేశ వివరాలను కూడా పరిశీలించనుంది. ఇవన్నీ పరీశీలించిన అనంతరం తుది నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment