
న్యూఢిల్లీ: ఎస్సార్ స్టీల్‌కు రెండో దశ బిడ్డింగ్‌లో రూ.37,000 కోట్ల కంటే ఎక్కువే ఆఫర్ చేసినట్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) రష్యాకు చెందిన న్యుమెటల్ తెలియజేసింది. మరోవంక మొదటి దశలో బిడ్డింగ్ వేసిన ఏకైక కంపెనీ ఆర్సెలర్ మిట్టల్... రెండో దశ బిడ్డింగ్‌ను వ్యతిరేకించడంతో పాటు మొదటి దశ బిడ్లనే పరిశీలించాలని కోరింది. దీంతో ఎన్‌సీఎల్‌టీ ముందు న్యుమెటల్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి హాజరై రెండో దశ బిడ్డింగ్ వల్ల రుణదాతలకు అదనపు విలువ సమకూరుతుందని చెప్పారు. ఎస్సార్ స్టీల్ బ్యాంకులకు రూ.49 వేల కోట్లు బకాయి పడడంతో కంపెనీని వేలం వేస్తున్న విషయం తెలిసిందే. ఎస్సార్ స్టీల్ వేలం వ్యవహారాలు చూస్తున్న పరిష్కార నిపుణుడు రెండో దశ బిడ్డింగ్‌ను తెరవాలని, తాము రూ.37,000 కోట్ల కంటే ఎక్కువే ఆఫర్ చేశామని రోహత్గి తెలిపారు.
రెండో దశలో అటు ఆర్సెలర్ మిట్టల్‌తో పాటు, న్యుమెటల్ బిడ్‌ను దాఖలు చేసింది. న్యుమెటల్‌లో రుయాలకు చెందిన ఆరోరా ట్రస్ట్‌కు 25 శాతం వాటా ఉంది. మరోవైపు రుణాలను ఎగవేసిన ఉత్తమ్ గాల్వాలో ఆర్సెలర్ మిట్టల్‌కు వాటా ఉండటం ప్రతికూలంగా మారింది. అయితే, తాము అనర్హతను తొలగించుకునేందుకు ఉత్తమ్‌గాల్వా బకాయిలను తీర్చేసేందుకు రూ.7,000 కోట్లను ఎస్క్రో ఖాతాలో జము చేసినట్టు ఆర్సెలర్ మిట్టల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. దీంతో విచారణను ఎన్‌సీఎల్‌టీ బెంచ్ ఈ నెల 22కు వాయిదా వేసింది.