the establishment of industries
-
పరిశ్రమల వెల్లువ
జిల్లాలో ఉన్న పరిశ్రమలు.... చిన్న పరిశ్రమలు 7,664 కాటేజీ పరిశ్రమలు 614 పెద్ద పరిశ్రమలు 593 ఉపాధి పొందుతున్న వారు 50,000 జిల్లాలో కొత్తగా 14 పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు చాలా అనువైనదిగా యాజమాన్యాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో ఉండడంతో పాటు హైదరాబాద్, బెంగళూరులను కలిపే జాతీయ రహదారి- 44 కూడా జిల్లా గుండా వెళ్తుండడంతో పరిశ్రమలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలో మానవ వనరులు కూడా పుష్కలంగా ఉండడంతో సమస్య ఉత్పన్నం కాదని పరిశ్రమలు భావిస్తున్నాయి. అలాగే పరిశ్రమల స్థాపనకు భూ సమస్య రాకుండా ప్రభుత్వం కూడా పక్కా చర్యలు చేపట్టింది. జిల్లాలో దాదాపు 13,439 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు అనువైన భూమి ఉన్నట్లు ఇదివరకే రెవెన్యూశాఖ తేల్చి చెప్పింది. వాస్తవానికి జిల్లాలో 34,184 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. వీటిలో 16,723 ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు అనువుకాదని రెవెన్యూశాఖ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో తేల్చి చెప్పింది. అలాగే ఇదివరకే జిల్లాలో ఐఐసీ ఆధ్వర్యంలో ఆరు పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసి సుమారు రెండు వేల ఎకరాలకు పైగా భూమిని పారిశ్రామికవేత్తలకు అందజేశారు. ప్రస్తుతం ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాలపైనే ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. నారాయణపేట, వనపర్తి డివిజన్లలో భూమి అందుబాటులో ఉన్నా పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని వినికిడి. కొత్త ఊపునిస్తున్న ప్రభుత్వ రాయితీలు.. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికంగా పురోగతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పరిశ్రమలకు రెడ్‌కార్పెట్ పరుస్తోంది. అందులో భాగంగా నూతన పారిశ్రామిక విధానం టీఎస్- ఐపాస్‌లో ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. దళితులు, గిరిజనులు, మహిళలకు పరిశ్రమల ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు రుణాలు ఇవ్వకుంటే ప్రభుత్వమే పెట్టుబడులు సమకూర్చేలా నిబంధనలు సడలించింది. అంతేకాదు పరిశ్రమలకు విద్యుత్ రాయితీ, చిన్న తరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పావలా వడ్డీకే రుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసకుంది. దీంతో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహవంతులుగా పరితపిస్తున్నారు. కొత్తగా ఆసక్తి కనబరుస్తున్న కంపెనీలు.. మెసర్స్ అనన్య గ్రీన్‌టెక్, అరబిందో ఫార్మా లిమిటెడ్, ఓయుఎం పరిశ్రమలు, శ్రీ వెంకటేశ్వర పరిశ్రమలు, గౌరిప్రియ పరిశ్రమలు, ఓఆర్ఇఎం యాక్సెక్ బయోఇంక్, మెసర్స్ స్టార్ పేపర్ కప్స్ అండ్ ప్లేట్స్, శ్రీ కార్తికేయ ఫార్మా యూనిట్-2, శిల్ప మెడికల్ లిమిటెడ్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర పరిశ్రమ, మెసర్స్ మనీష్ పరిశ్రమ, మెసర్స్ బేవ్కాన్ వాయర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ శ్రీ భవానీ పాలిమర్స్, సహజ పరిశ్రమలు వీటితో పాటు ప్రోక్టర్ అండ్ గాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి మల్టినేషన్ కంపెనీల మ్యాన్ ఫాక్చరింగ్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. పెద్ద ఎత్తున ఉపాధి... నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలోని యువతకు పెద్దఎత్తున ఉపాధి లభించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నూతనంగా ఏర్పాటు చేయబోయే ప్రోక్టర్ అండ్ గాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి మల్టినేషన్ కంపెనీల మ్యాన్ ఫాక్చరింగ్ ప్లాంట్ల ద్వారానే ప్రత్యక్షంగా పరోక్షంగా 6వేల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉందని భావిస్తోంది. మిగతా 14 కంపెనీలు కలుపుకుంటే మొత్తంగా 20వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం లెక్కలు వేసుకుంది. ప్రస్తుతం జిల్లాలో 8,931వరకు చిన్నా పెద్దా పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 50వేల మందికి ప్రత్యక్షంగా... మరో 20వేల మందికి పైగా పరోక్షంగా ఉపాధి కలుగుతున్నట్లు అధికారుల గణాంకాలు సూచిస్తున్నాయి. -
పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలి
కలెక్టర్ ఎంఎం నాయక్ విజయనగరం కంటోన్మెంట్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో ఇటీవల పర్యటించినపుడు ఇచ్చిన హామీలపై దృష్టి సారించి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమలకు ఇస్తున్న భూములలో సమస్యలు తలెత్తితే రిజిస్ట్రేషన్ అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన నెల్లిమర్ల మండలంలోని తమ్మాపురం, టెక్కలి, ఒంపిల్లి గ్రామాల్లోని 262 ఎకరాల్లో ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. రామభద్రపురం మండలంలోని కొట్టక్కిలో ఆటోమొబైల్ షాపు ఏర్పాటుకు 200 ఎకరాల్లో సర్వే జరుగుతోందన్నారు. గజపతినగరం మండలం మరుపల్లిలో హార్డ్‌వేర్ పరిశ్ర మ ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులపై కలెక్టర్ ఆరా తీయగా 60 శాతంపనులు పూర్తయ్యాయని, మే లోగా ప్రారంభిస్తామని విద్యుత్ శాఖ ఎస్ ఈ చిరంజీవిరావు తెలిపారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఇటుకల తయారీ పరి శ్రమ కోసం పవన్ ఇండస్ట్రీస్‌కు రూ. 1.37 లక్షలు మంజూరు చేశామన్నారు. గంట్యాడ మండలంలోని తాటిపూడి, మదనాపురం గ్రామాల వద్ద వంద ఎకరాల్లో హెర్బల్ టూరిజం పార్కు ఏర్పాటుకు, భోగాపురం మండలం చెరకుపల్లి,రాజాపులోవ గ్రామాల వద్ద 90 ఎకరాల్లో ఐటీ పార్కుఏర్పాటుకు, దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామం వద్ద 83 ఎకరాల్లో ఫుడ్ పార్కు ఏర్పాటుకు ప్రతి పాదనలు ఏపీఐఐసీచైర్మన్కు పంపించామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సహించేలా అధికారులంతా పనిచేయాలన్నారు. ఈసమావేశంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ చిరంజీవిరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కోటేశ్వరరావు, ఏపీఐసీసీ జోనల్ మేనేజర్ సారథి, జిల్లారిజిస్ట్రార్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
రెవెన్యూకు సీఆర్డీఏ గుబులు
నెల్లూరు(రెవెన్యూ): విభజన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్న బడా పారిశ్రామికవేత్తల చూపు జిల్లాపై ఉంది. ఇతర దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో జిల్లాకు రానున్నరని ఇప్పటికే మంత్రి నారాయణ ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన లక్ష ఎకరాల భూములను గుర్తించమని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పరిశ్రమలు స్థాపించడానికి రోడ్లు, నీరు తదితర సౌకర్యాలు సమీపంలో ఉండాలి. అటువంటి భూములు గుర్తించవలసి ఉంది. ఈ సమయంలో భూసేకరణలో అనుభవం ఉన్న ఆర్డీవోలు, తహశీల్దార్లు, డీటీలను సీఆర్డీఏకు పంపడం వల్ల ఇబ్బందులుపడవలసి వస్తుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. జిల్లాలో భూసమస్యలు అనేకం ఉన్నాయి. వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. భూ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో భూముల సేకరణ కష్టతరమవుతుంది. ఇటువంటి తరుణంలో అనుభవజ్ఞలైన తహశీల్దార్లు, డీటీలను బదిలీ చేస్తే భూసేకరణ పూర్తిస్థాయిలో చేయలేమని జిల్లా యంత్రాంగం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెవెన్యూ సమస్యలు అధికం జిల్లాలో రెవెన్యూకు సంబంధించి వేల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్న తహశీల్దార్లను, డీటీలను సీఆర్డీఏకు బదిలీ చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. జిల్లాలో 46 మండలాలు, ప్రత్యేక పోస్టులు కలపి 57 మంది తహశీల్దార్లు ఉన్నారు. సుమారు 150 మందికి పైగా డిప్యూటీ తహశీల్దార్లు(డీటీ) ఉన్నారు. ఒక ఆర్డీఓ, 8 మంది తహశీల్దార్లు, 10 మంది డీటీలు సీఆర్డీఏకు బదిలీ అయితే జిల్లాలో సిబ్బంది కొరత ఏర్పడుతుంది. మండలాల్లో తహశీల్దార్లపై పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయవల్సిన బాధ్యత తహశీల్దార్ల పైనే ఉంది. రెవెన్యూకు సంబంధించి భూ సమస్యలు, పాసుపుస్తకాలు, అడంగల్, నివాస, కులధ్రువీకరణ పత్రాలు ఇతర సర్టిఫికెట్లు మంజూరుకు వారే కీలకం. ఇప్పటికే నెల్లూరు డివిజన్‌కు సంబంధించి పాసుపుస్తకాల కోసం 500 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు పాసుపుస్తకాలు మంజూరు చేయలేదు. ఇసుక రీచ్‌లను పర్యవేక్షించి అక్రమ రవాణాను అరికట్టవలసిన బాధ్యత తహశీల్దార్లు, డీటీలపైనే ఉంది. గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్లో అర్జీదారుల సమర్పించిన వినతిపత్రాలు వేలసంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. భూసమస్యలకు సంబంధించి 5 వేలకు పైగా అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. అందరూ ఉంటేనే వేలసంఖ్యలో అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. మరి పూర్తిస్థాయిలో లేకపోతే సమస్యల పరిష్కరానికి ప్రజల నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొనడం ఖాయం. అధికారుల అయిష్టత సీఆర్డీఏలో పనిచేయడానికి ఎంపిక చేసిన తహశీల్దార్లు , డిప్యూటీ తహశీల్దార్లు(డీటీ) ఇరకాటంలో పడ్డారు. సీఆర్డీఏకు వెళ్లడానికి వారు సుముఖతవ్యక్తం చేయడంలేదు. డీటీలు మాత్రం తమకు పదోన్నతులు కల్పిస్తే సీఆర్డీఏకు వెళ్తామని అధికారుల వద్ద వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఎనిమిది మంది డీటీలు సీఆర్డీఏకు వెళ్లారు. సీఆర్డీఏ ఎంపిక చేసిన వారిని రిలీవ్ చేయడానికి జిల్లా యంత్రాంగం సుముఖంగా లేనట్లు సమాచారం. సీఆర్డీఏకు బదిలీ అయిన ఆత్మకూరు ఆర్డీఓ ఎంవి. రమణను రిలీవ్ చేయడానికి జిల్లా యంత్రాంగాం వెనుకడుతున్నట్లు సమాచారం. జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఎన్. శ్రీకాంత్ ప్రస్తుతం సీఆర్డీఏ కమిషనర్‌గా ఉన్నారు. రాజధాని నిర్మాణం కోసం జిల్లాలో భూసేకరణలో అనుభవం ఉండి హుషారుగా పనిచేసే ఆర్డీఓలు, తహశీల్దార్లు, డీటీలను సీఆర్డీఏకు బదిలీ చేయించేందుకు సీఆర్డీఏ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి అనేకమంది తహశీల్దార్లను, డీటీలను సీఆర్డీఏకు పిలిపించి శిక్షణ ఇచ్చారు. అనుభవంతో పనిచేసే అధికారులను సీఆర్డీఏకు బదిలీ చేసేలా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించారు. ఈ నెల 26వ తేదీ వరకు ఓటు నమోదు ప్రక్రియ జరుగుతుండటంతో బదిలీ ప్రక్రియ వాయిదాపడింది. ఎన్నికల నిబంధన పూర్తి కావడంతో బదిలీలు చేసేందుకు సీఆర్డీఏ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సుమారు 18 మంది తహశీల్దార్లు, డీటీలను సీఆర్డీఏకు బదిలీ చేయించేలా చర్యలు చేపట్టారు. మీరు వచ్చి సీఆర్డీఏలో పనిచేస్తే తర్వాత మీకు కావలసిన మండలాలకు బదిలీలు చేసేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇస్తున్నట్లు సమాచారం. ముందుకురాని అధికారులు సీఆర్డీఏకు వెళ్లి పనిచేయడానికి తహశీల్దార్లు, డీటీలు ముందుకు రావడంలేదు. రాజధాని నిర్మాణానికి రైతులందరు భూములు ఇవ్వడంలేదు. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించాలి. ఈ విషయంలో అనేకమంది వెనుకడుగువేస్తున్నట్లు సమాచారం. లక్ష ఎకరాల భూమి సేకరించవలసి ఉంది.. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఇతర దేశాల పారిశ్రామికవేత్తలు ముందుకువస్తున్నారు. లక్ష ఎకరాల భూములు సేకరించమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 26వ వరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఉన్నాయి. సీఆర్డీఏకు డిప్యూటీ కలెక్టర్లను పంపమంటున్నారు. తహశీల్దార్లను ప్రస్తుతం అడగడంలేదు. డీటీలకు పదోన్నతులు కల్పించే విషయం ప్రభుత్వం పరిశీలిస్తుంది. పదోన్నతులు కల్పిస్తే సీఆర్డీఏకు వెళ్లాడానికి డీటీలు సిద్ధంగా ఉన్నారు. -జిల్లా రెవెన్యూ అధికారి, సుదర్శన్‌రెడ్డి -
రక్షణ శాఖ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సర్వం సిద్ధం
ఓర్వకల్లు: మండలంలోని పాలకొలను, చింతలపల్లె పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన ప్రభుత్వ భూమి మండలంలో విస్తారంగా ఉంది. జిల్లా అధికార యంత్రాంగం వాటికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఆ మేరకు ఇప్పటికే జాతీయ అణు ఇంధన సంస్థ, రక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి సంస్థ, ఇనుప ఖనిజ తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ఆయా సంస్థల ప్రతినిధులు పలుసార్లు ఇక్కడ పర్యటించారు. ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆదివారం కేంద్ర రక్షణ శాఖ తరపున ఇద్దరు డెరైక్టర్ జనరల్స్ శేఖరన్ సుందరంతో పాటు డీఎల్ఆర్ఎల్ ఎస్పీదాస్, డెరైక్టర్ చెస్ సురంజన్ పాల్, శాస్త్రవేత్తలు శంకర్రావు జీవీఎస్ఆర్.మూర్తితో కూడిన పదిమంది బృందం అందుకు సంబంధించిన ప్రభుత్వ భూములను పరిశీలించారు. మండలంలోని పాలకొలను, చింతలపల్లె, కాల్వ, ఉప్పలపాడు, ఎన్.కొంతలపాడు, ఉయ్యాలవాడ గ్రామం రెవెన్యూ పరిధిలో మొత్తం 2,300 ఎకరాల భూములు ఉన్నాయని రెవెన్యూ అధికారులు వారికి వివరించారు. అనంతరం మధ్యాహ్న భోజన విరామ సమయంలో స్థానిక రాక్‌గార్డెన్ వద్ద కలెక్టర్ విజయమోహన్, జేసీ కన్నబాబు, ఆర్డీవో రఘుబాబు బృందం ఆయూ కంపెనీల ప్రతినిధులతో సదరు భూముల వివరాలపై చర్చించారు. సంస్థలు నెలకొల్పితే అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ వారికి తెలియజేశారు. భూ వివరాలు, మంచినీరు, విద్యుత్, రవాణా సౌకర్యాలపై పూర్తి నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని బృందం ప్రతినిధులు తెలిపారు. ఈ సంస్థను నెలకొల్పేందుకు రాష్ట్రంలోని కర్నూలు, కడప జిల్లాల్లో భూములను పరిశీలించామన్నారు. తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 29వ తేదీన కేంద్ర ప్రభుత్వం మరో బృందాన్ని పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనాథ్, సర్వేయర్, మల్లికార్జున, వీఆర్వోలు బాలమద్దిలేటి, చంద్రమోహన్‌రెడ్డి, లక్ష్మణ్‌కుమార్, ఎల్లసుబ్బయ్య పాల్గొన్నారు.