రక్షణ శాఖ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సర్వం సిద్ధం
ఓర్వకల్లు:
మండలంలోని పాలకొలను, చింతలపల్లె పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన ప్రభుత్వ భూమి మండలంలో విస్తారంగా ఉంది. జిల్లా అధికార యంత్రాంగం వాటికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఆ మేరకు ఇప్పటికే జాతీయ అణు ఇంధన సంస్థ, రక్షణ శాఖ పరిశోధన అభివృద్ధి సంస్థ, ఇనుప ఖనిజ తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ఆయా సంస్థల ప్రతినిధులు పలుసార్లు ఇక్కడ పర్యటించారు. ప్రభుత్వ భూములను పరిశీలించారు.
ఈ క్రమంలోనే ఆదివారం కేంద్ర రక్షణ శాఖ తరపున ఇద్దరు డెరైక్టర్ జనరల్స్ శేఖరన్ సుందరంతో పాటు డీఎల్‌ఆర్‌ఎల్ ఎస్‌పీదాస్, డెరైక్టర్ చెస్ సురంజన్ పాల్, శాస్త్రవేత్తలు శంకర్‌రావు జీవీఎస్‌ఆర్.మూర్తితో కూడిన పదిమంది బృందం అందుకు సంబంధించిన ప్రభుత్వ భూములను పరిశీలించారు. మండలంలోని పాలకొలను, చింతలపల్లె, కాల్వ, ఉప్పలపాడు, ఎన్.కొంతలపాడు, ఉయ్యాలవాడ గ్రామం రెవెన్యూ పరిధిలో మొత్తం 2,300 ఎకరాల భూములు ఉన్నాయని రెవెన్యూ అధికారులు వారికి వివరించారు.
అనంతరం మధ్యాహ్న భోజన విరామ సమయంలో స్థానిక రాక్‌గార్డెన్ వద్ద కలెక్టర్ విజయమోహన్, జేసీ కన్నబాబు, ఆర్‌డీవో రఘుబాబు బృందం ఆయూ కంపెనీల ప్రతినిధులతో సదరు భూముల వివరాలపై చర్చించారు. సంస్థలు నెలకొల్పితే అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ వారికి తెలియజేశారు. భూ వివరాలు, మంచినీరు, విద్యుత్, రవాణా సౌకర్యాలపై పూర్తి నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని బృందం ప్రతినిధులు తెలిపారు.
ఈ సంస్థను నెలకొల్పేందుకు రాష్ట్రంలోని కర్నూలు, కడప జిల్లాల్లో భూములను పరిశీలించామన్నారు. తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 29వ తేదీన కేంద్ర ప్రభుత్వం మరో బృందాన్ని పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనాథ్, సర్వేయర్, మల్లికార్జున, వీఆర్వోలు బాలమద్దిలేటి, చంద్రమోహన్‌రెడ్డి, లక్ష్మణ్‌కుమార్, ఎల్లసుబ్బయ్య పాల్గొన్నారు.