రెవెన్యూకు సీఆర్‌డీఏ గుబులు
నెల్లూరు(రెవెన్యూ): విభజన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్న బడా పారిశ్రామికవేత్తల చూపు జిల్లాపై ఉంది. ఇతర దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో జిల్లాకు రానున్నరని ఇప్పటికే మంత్రి నారాయణ ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన లక్ష ఎకరాల భూములను గుర్తించమని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పరిశ్రమలు స్థాపించడానికి రోడ్లు, నీరు తదితర సౌకర్యాలు సమీపంలో ఉండాలి. అటువంటి భూములు గుర్తించవలసి ఉంది.
ఈ సమయంలో భూసేకరణలో అనుభవం ఉన్న ఆర్డీవోలు, తహశీల్దార్లు, డీటీలను సీఆర్‌డీఏకు పంపడం వల్ల ఇబ్బందులుపడవలసి వస్తుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. జిల్లాలో భూసమస్యలు అనేకం ఉన్నాయి. వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. భూ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో భూముల సేకరణ కష్టతరమవుతుంది. ఇటువంటి తరుణంలో అనుభవజ్ఞలైన తహశీల్దార్లు, డీటీలను బదిలీ చేస్తే భూసేకరణ పూర్తిస్థాయిలో చేయలేమని జిల్లా యంత్రాంగం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
రెవెన్యూ సమస్యలు అధికం
జిల్లాలో రెవెన్యూకు సంబంధించి వేల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్న తహశీల్దార్లను, డీటీలను సీఆర్‌డీఏకు బదిలీ చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. జిల్లాలో 46 మండలాలు, ప్రత్యేక పోస్టులు కలపి 57 మంది తహశీల్దార్లు ఉన్నారు. సుమారు 150 మందికి పైగా డిప్యూటీ తహశీల్దార్లు(డీటీ) ఉన్నారు. ఒక ఆర్డీఓ, 8 మంది తహశీల్దార్లు, 10 మంది డీటీలు సీఆర్‌డీఏకు బదిలీ అయితే జిల్లాలో సిబ్బంది కొరత ఏర్పడుతుంది. మండలాల్లో తహశీల్దార్లపై పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయవల్సిన బాధ్యత తహశీల్దార్ల పైనే ఉంది.
రెవెన్యూకు సంబంధించి భూ సమస్యలు, పాసుపుస్తకాలు, అడంగల్, నివాస, కులధ్రువీకరణ పత్రాలు ఇతర సర్టిఫికెట్లు మంజూరుకు వారే కీలకం. ఇప్పటికే నెల్లూరు డివిజన్‌కు సంబంధించి పాసుపుస్తకాల కోసం 500 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు పాసుపుస్తకాలు మంజూరు చేయలేదు. ఇసుక రీచ్‌లను పర్యవేక్షించి అక్రమ రవాణాను అరికట్టవలసిన బాధ్యత తహశీల్దార్లు, డీటీలపైనే ఉంది.
గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్‌లో అర్జీదారుల సమర్పించిన వినతిపత్రాలు వేలసంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. భూసమస్యలకు సంబంధించి 5 వేలకు పైగా అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. అందరూ ఉంటేనే వేలసంఖ్యలో అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. మరి పూర్తిస్థాయిలో లేకపోతే సమస్యల పరిష్కరానికి ప్రజల నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొనడం ఖాయం.
అధికారుల అయిష్టత
సీఆర్‌డీఏలో పనిచేయడానికి ఎంపిక చేసిన తహశీల్దార్లు , డిప్యూటీ తహశీల్దార్లు(డీటీ) ఇరకాటంలో పడ్డారు. సీఆర్‌డీఏకు వెళ్లడానికి వారు సుముఖతవ్యక్తం చేయడంలేదు. డీటీలు మాత్రం తమకు పదోన్నతులు కల్పిస్తే సీఆర్‌డీఏకు వెళ్తామని అధికారుల వద్ద వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఎనిమిది మంది డీటీలు సీఆర్‌డీఏకు వెళ్లారు. సీఆర్‌డీఏ ఎంపిక చేసిన వారిని రిలీవ్ చేయడానికి జిల్లా యంత్రాంగం సుముఖంగా లేనట్లు సమాచారం. సీఆర్‌డీఏకు బదిలీ అయిన ఆత్మకూరు ఆర్‌డీఓ ఎంవి.
రమణను రిలీవ్ చేయడానికి జిల్లా యంత్రాంగాం వెనుకడుతున్నట్లు సమాచారం. జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఎన్. శ్రీకాంత్ ప్రస్తుతం సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్నారు. రాజధాని నిర్మాణం కోసం జిల్లాలో భూసేకరణలో అనుభవం ఉండి హుషారుగా పనిచేసే ఆర్‌డీఓలు, తహశీల్దార్లు, డీటీలను సీఆర్‌డీఏకు బదిలీ చేయించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి అనేకమంది తహశీల్దార్లను, డీటీలను సీఆర్‌డీఏకు పిలిపించి శిక్షణ ఇచ్చారు. అనుభవంతో పనిచేసే అధికారులను సీఆర్‌డీఏకు బదిలీ చేసేలా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించారు.
ఈ నెల 26వ తేదీ వరకు ఓటు నమోదు ప్రక్రియ జరుగుతుండటంతో బదిలీ ప్రక్రియ వాయిదాపడింది. ఎన్నికల నిబంధన పూర్తి కావడంతో బదిలీలు చేసేందుకు సీఆర్‌డీఏ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సుమారు 18 మంది తహశీల్దార్లు, డీటీలను సీఆర్‌డీఏకు బదిలీ చేయించేలా చర్యలు చేపట్టారు. మీరు వచ్చి సీఆర్‌డీఏలో పనిచేస్తే తర్వాత మీకు కావలసిన మండలాలకు బదిలీలు చేసేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇస్తున్నట్లు సమాచారం.
ముందుకురాని అధికారులు
సీఆర్‌డీఏకు వెళ్లి పనిచేయడానికి తహశీల్దార్లు, డీటీలు ముందుకు రావడంలేదు. రాజధాని నిర్మాణానికి రైతులందరు భూములు ఇవ్వడంలేదు. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించాలి. ఈ విషయంలో అనేకమంది వెనుకడుగువేస్తున్నట్లు సమాచారం.
లక్ష ఎకరాల భూమి సేకరించవలసి ఉంది..
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఇతర దేశాల పారిశ్రామికవేత్తలు ముందుకువస్తున్నారు. లక్ష ఎకరాల భూములు సేకరించమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 26వ వరకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఉన్నాయి. సీఆర్‌డీఏకు డిప్యూటీ కలెక్టర్లను పంపమంటున్నారు. తహశీల్దార్లను ప్రస్తుతం అడగడంలేదు. డీటీలకు పదోన్నతులు కల్పించే విషయం ప్రభుత్వం పరిశీలిస్తుంది. పదోన్నతులు కల్పిస్తే సీఆర్‌డీఏకు వెళ్లాడానికి డీటీలు సిద్ధంగా ఉన్నారు.
-జిల్లా రెవెన్యూ అధికారి, సుదర్శన్‌రెడ్డి