రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు చాలా అనువైనదిగా యాజమాన్యాలు భావిస్తున్నాయి.
జిల్లాలో ఉన్న పరిశ్రమలు....
చిన్న పరిశ్రమలు 7,664
కాటేజీ పరిశ్రమలు 614
పెద్ద పరిశ్రమలు 593
ఉపాధి పొందుతున్న వారు 50,000
జిల్లాలో కొత్తగా 14 పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు చాలా అనువైనదిగా యాజమాన్యాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో ఉండడంతో పాటు హైదరాబాద్, బెంగళూరులను కలిపే జాతీయ రహదారి- 44 కూడా జిల్లా గుండా వెళ్తుండడంతో పరిశ్రమలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలో మానవ వనరులు కూడా పుష్కలంగా ఉండడంతో సమస్య ఉత్పన్నం కాదని పరిశ్రమలు భావిస్తున్నాయి. అలాగే పరిశ్రమల స్థాపనకు భూ సమస్య రాకుండా ప్రభుత్వం కూడా పక్కా చర్యలు చేపట్టింది. జిల్లాలో దాదాపు 13,439 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు అనువైన భూమి ఉన్నట్లు ఇదివరకే రెవెన్యూశాఖ తేల్చి చెప్పింది.
వాస్తవానికి జిల్లాలో 34,184 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. వీటిలో 16,723 ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు అనువుకాదని రెవెన్యూశాఖ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో తేల్చి చెప్పింది. అలాగే ఇదివరకే జిల్లాలో ఐఐసీ ఆధ్వర్యంలో ఆరు పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసి సుమారు రెండు వేల ఎకరాలకు పైగా భూమిని పారిశ్రామికవేత్తలకు అందజేశారు. ప్రస్తుతం ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాలపైనే ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. నారాయణపేట, వనపర్తి డివిజన్లలో భూమి అందుబాటులో ఉన్నా పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని వినికిడి.
కొత్త ఊపునిస్తున్న ప్రభుత్వ రాయితీలు..
రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికంగా పురోగతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పరిశ్రమలకు రెడ్‌కార్పెట్ పరుస్తోంది. అందులో భాగంగా నూతన పారిశ్రామిక విధానం టీఎస్- ఐపాస్‌లో ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. దళితులు, గిరిజనులు, మహిళలకు పరిశ్రమల ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు రుణాలు ఇవ్వకుంటే ప్రభుత్వమే పెట్టుబడులు సమకూర్చేలా నిబంధనలు సడలించింది. అంతేకాదు పరిశ్రమలకు విద్యుత్ రాయితీ, చిన్న తరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పావలా వడ్డీకే రుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసకుంది. దీంతో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహవంతులుగా పరితపిస్తున్నారు.
కొత్తగా ఆసక్తి కనబరుస్తున్న కంపెనీలు..
మెసర్స్ అనన్య గ్రీన్‌టెక్, అరబిందో ఫార్మా లిమిటెడ్, ఓయుఎం పరిశ్రమలు, శ్రీ వెంకటేశ్వర పరిశ్రమలు, గౌరిప్రియ పరిశ్రమలు, ఓఆర్‌ఇఎం యాక్సెక్ బయోఇంక్, మెసర్స్ స్టార్ పేపర్ కప్స్ అండ్ ప్లేట్స్, శ్రీ కార్తికేయ ఫార్మా యూనిట్-2, శిల్ప మెడికల్ లిమిటెడ్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర పరిశ్రమ, మెసర్స్ మనీష్ పరిశ్రమ, మెసర్స్ బేవ్‌కాన్ వాయర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ శ్రీ భవానీ పాలిమర్స్, సహజ పరిశ్రమలు వీటితో పాటు ప్రోక్టర్ అండ్ గాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి మల్టినేషన్ కంపెనీల మ్యాన్ ఫాక్చరింగ్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయి.
పెద్ద ఎత్తున ఉపాధి...
నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలోని యువతకు పెద్దఎత్తున ఉపాధి లభించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నూతనంగా ఏర్పాటు చేయబోయే ప్రోక్టర్ అండ్ గాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి మల్టినేషన్ కంపెనీల మ్యాన్ ఫాక్చరింగ్ ప్లాంట్ల ద్వారానే ప్రత్యక్షంగా పరోక్షంగా 6వేల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉందని భావిస్తోంది. మిగతా 14 కంపెనీలు కలుపుకుంటే మొత్తంగా 20వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం లెక్కలు వేసుకుంది. ప్రస్తుతం జిల్లాలో 8,931వరకు చిన్నా పెద్దా పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 50వేల మందికి ప్రత్యక్షంగా... మరో 20వేల మందికి పైగా పరోక్షంగా ఉపాధి కలుగుతున్నట్లు అధికారుల గణాంకాలు సూచిస్తున్నాయి.