వామ్మో.. మహబూబా ఘాట్స్!
సారంగాపూర్ : అందమైన మలుపుల వెనుక అగాధాలెన్నో ఉన్నాయి. వాహన చోదకులు ఏ కొంచెం ఆదమరిచినా మలుపులపై రక్తాలు ధారలుగా పారడం ఖాయం. అందమైన ఆ మలుపులపై ప్రమాద సూచికలు సరిగా లేక ప్రమాదాలకు నెలవవుతున్నాయి. ఈ మలుపులపై కొన్నేళ్లుగా ఎన్నో కుటుంబాలు వీధిన పడిన దాఖలాలున్నాయి. అయినా అంతటి ప్రమాదకర మలుపుల వద్ద రక్షణ కల్పించడానికి సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ దారి గుండా ప్రయాణించే వాహన చోదకులు ఏకంగా శాపనార్థాలు పెట్టేస్తున్నారు.
అందమైన మలుపుల వద్ద..
సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) సమీపంలోని మహబూబా ఘాట్స్ ప్రకృతి ప్రేమికులకు కనుల విందు చేయడమే కాదు అందాల మోజులో పడి ఆదమరిచి వాహనాలు నడిపేవారి పాలిట మృత్యు కూపాలుగానూ మారుతున్నాయి. మహబూబా ఘాట్స్ మాత్రమే కాదు ఘాట్స్ మొదలుకుని చించోలి(బి) ఎక్స్‌రోడ్డు వరకు వచ్చే 44వ జాతీయ రహదారిపైన ఉన్న మూడు మూల మలుపులు ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి. మూడేళ్లుగా ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. అయినా ఇంతవరకు ఘాట్స్‌తో పాటు ప్రమాదకర మలుపులు పట్టించుకున్నవారే కరువయ్యారు.
గతంలో పలు ఘటనలు
మహబూబా ఘాట్లు ఈ మూడేళ్లలో ఇప్పటివరకు దాదాపు 12 కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. 2013 ఫిబ్రవరి 2వ తేదీన ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. అది గమనించిన నేరడిగొండ మండలం నంద్యానాయక్ తండాకు చెందిన ఆడె రమేశ్ అనే యువకుడు తన ప్రాణాలను కాపాడుకోబోయి అదే బస్సు కింద పడి మృతిచెందాడు. అంతేకాకుండా 2013 జూన్ 6వ తేదీన మహబూబా ఘాట్స్ సమీపంలో ఘాట్ల పైనుంచి వేగంగా నిర్మల్ వైపు వస్తున్న లారీ ఎడ్లబండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చించోలి(బి) గ్రామానికి చెందిన నారాయణ అనే రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. 2015 ఆగస్టు 28న ఘాట్స్ పైనుంచి లారీ వేగంగా వచ్చి ఆవుల మంద, మేకల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 ఆవులు, 3 మేకలు మృతిచెందాయి. మే 18, 2016న మహిళా ప్రాంగణం సమీపంలోని మూలమలుపు వద్ద కడెం మండలం మొర్రిపేట్ గ్రామానికి చెందిన మర్సుకోల తిరుపతి(15) అనే బాలుడు మృతిచెందాడు.
తన ద్విచక్రవాహనంపై నిర్మల్ నుంచి రాణాపూర్ వైపు వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. ఇలా దాదాపు ఎంతోమంది మనుషులు, పశువుల ప్రాణాలు గాలిలో కలిసిపోయి వారి కుటుంబాల్లో తీరని దు:ఖం మిగిలింది. ఇవన్నీ పెద్దవి కాగా చిన్నచిన్న ప్రమాదాలు జరిగి గాయాలపాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇంతటి ప్రమాదాలు కళ్లెదుటే జరుగుతున్నా మూలమలుపుల వద్ద ప్రమాద సూచికలు లేకపోవడం గమనార్హం. కొన్ని చోట్ల ప్రమాద సూచిక బోర్డులు ఉన్నా అవి చెడిపోయి, రంగులు వెలిసి పోయి ఉండటంతో ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే వారికి అవి అర్థం కావడం లేదని వాహనచోదకులు అంటున్నారు.
విషాద కుటుంబం..!
ఘాట్స్‌పైన జరుగుతున్న ప్రమాదాలతో పాటు చించోలి(బి) ఎక్స్ రోడ్డు వరకు ఉన్న మలుపుల వద్ద ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు వీధిపాలవుతున్నాయి. తాజాగా మహబూబా ఘాట్స్‌పైన శుక్రవారం జరిగిన ప్రమాదమే ఇందుకు తార్కాణం. ఇంటికి పెద్ద దిక్కయిన అనంత్‌వార్ మాధవరావు, ఆయన పెద్ద కుమారుడు హరీశ్ మృతిచెందిన ఘటనే. కుటుంబానికి పెద్ద దిక్కయిన మాధవరావు మృతిచెందడంతో ప్రస్తుతం ఆ కుటుంబం రోడ్డున పడినట్లయ్యింది. దీంతో పాటే అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తన పెద్ద కుమారుడు హరీశ్ మృతి ఆ కుటుంబానికి తీరని దు:ఖాన్ని మిగిల్చింది. వారి మరణంతో పాటు చిన్న కుమారుడు సాయిప్రసాద్, మాధవరావు భార్య నమితలు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థి«తి దయానీయంగా మారింది.