national highway 44
-
అదొక రాకాసి రహదారి
-
ఆ జాతీయ రహదారి మృత్యు దారి!.. ఐదేళ్లలో 1066 ప్రమాదాలు.. కారణాలేంటి?
జైనథ్ మండలంలోని గిమ్మ ఎక్స్‌రోడ్ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై ఈనెల 16న లారీ ఢీకొని ఆంకోలి గ్రామానికి చెందిన వడరపు రాజారెడ్డి(59) మృతిచెందాడు. మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా వన్‌వే ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడిపి బైక్‌ను ఢీకొన్నాడు. జైనథ్ మండలం భోరజ్ వద్ద ఈనెల 17న ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన ఆకిటి వెంకట్‌రెడ్డి ఏకైక కూతురు చైత్ర(13)కు జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బైక్‌పై బయలుదేరాడు. భోరజ్ ఎక్స్ రోడ్ సమీపంలో వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొంది. చైత్ర కుడివైపుకు పడిపోవడంతో లారీ ఆమె మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆదిలాబాద్ పట్టణం సాయినగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఏనుగు పద్మ(56) శుక్రవారం స్కూటీపై బేల మండలం ఏటీ పాఠశాలకు బయల్దేరారు. జైనథ్ మండలం భోరజ్ చెక్‌పోస్ట్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆమె కిందపడిపోగా, లారీ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పాఠశాలకు బయల్దేరిన 15 నిమిషాల్లో మృత్యువు కబళించింది. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో సుమారు వంద కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న 44వ నంబర్ జాతీయ రహదారి నెత్తురోడుతోంది. ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఈ రోడ్డుపై ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. ప్రమాదాల నివారణకు కృషి చేయాల్సిన రోడ్ సేఫ్టీ కమిటీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2016 నుంచి 2020 వరకు ఎన్‌హెచ్ 44పై 1,066 ప్రమాదాలు జరుగడం కమిటీల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ఈ కమిటీలో కీలకపాత్ర పోషించే రవాణా శాఖ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన బారికేడ్లతో రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలకు కారణమవుతోంది. శుక్రవారం ఉదయం ఉపాధ్యాయురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి బారికేడ్లే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో సంఘటన స్థలంలో నిరసన చేపట్టిన కొంతమంది రవాణ శాఖపై హత్యానేరం నమోదు చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. చదవండి: మేడారం వెళ్లే దారిలో ఘోర రోడ్డు ప్రమాదం. నలుగురు మృత్యువాత రవాణాశాఖే ఉల్లంఘన..! సమాచార హక్కు చట్టం ద్వారా జిల్లాకేంద్రం శాంతినగర్‌కు చెందిన టీఆర్ఎస్ నేత బాలూరి గోవర్ధన్‌రెడ్డి వివిధ అంశాలపై 2020లో వివిధ వివరాలను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లోని ప్రాంతీయ అధికారిని కోరగా, అదే సంవత్సరం జూన్ 16న మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా హైదరాబాద్‌లోని బోయిన్పల్లి వరకు జాతీయ రహదారిపై హైవే అథారిటీ ద్వారా ఎలాంటి చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం జరగలేదని సమాధానం ఇచ్చారు. అలాంటి పరిస్థితుల్లో జైనథ్ మండలం భోరజ్ చెక్‌పోస్టు వద్ద బారికేడ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టడం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుంది. భద్రత కమిటీలో కీలకంగా వ్యవహరించాల్సిన రవాణాశాఖ పరంగానే లోపాలు కనిపిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. నిధులు మంజూరైనా నిర్లక్ష్యం.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ బోయిన్పల్లి వరకు జాతీయ రహదారి 44కు సంబంధించి రహదారి భద్రతపై కేంద్ర మంత్రిత్వ శాఖ గతంలో ఆడిట్ నిర్వహించారు. అనేక బ్లాక్ స్పాట్స్‌లను గుర్తించారు. ప్రమాదాల నివారణ కోసం రహదారిపై చేపట్టాల్సిన పనులకు సంబంధించి పెన్‌గంగ నుంచి ఇచ్చోడ దగ్గర ఇస్లాంనగర్ వరకు వివిధ రోడ్డ భద్రత పనుల కోసం రూ.40.28 కోట్లు మంజూరు చేశారు. అందులో కొన్ని పనులు పూర్తి చేశారు. మిగతా పనులు నిర్మాణంలో ఉన్నాయి. భోరజ్ వద్ద స్లిప్ రోడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతోనే ద్విచక్రవాహనదారులు జాతీయ రహదారిమీదుగానే ప్రయాణిస్తున్నారు. స్లిప్ రోడ్డు నిర్మాణమై ఉంటే గురువారం చైత్ర(13), శుక్రవారం ఉపాధ్యాయురాలు పద్మ(56) దానిమీదుగా ప్రయాణించేవారు. వారి ప్రాణాలు పోయేవికావు. ఇక్కడ సమష్టిగా రోడ్డు భద్రతావైఫల్యం కనిపిస్తోంది. స్పీడ్ గన్లు ఎక్కడ? జిల్లాలో పెన్‌గంగ వద్ద నుంచి జాతీయ రహదారి 44 మొదలవుతుంది. నిర్మల్ జిల్లా వరకు వంద కిలో మీటర్ల పరిధిలో జిల్లాలో విస్తరించి ఉంది. ఈ రహదారిపై మావల నుంచి నిర్మల్ వైపు వెళ్లే దారిలో పోలీసు శాఖ పరంగా పలుచోట్ల స్పీడ్ గన్లు ఏర్పాటు చేసి అతివేగంగా వెళ్లే వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. పెన్‌గంగ నుంచి మావల వరకు స్పీడ్ గన్లు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు జాతీయ రహదారిపై వేగంగా దూసుకుపోతున్నారు. చదవండి: పెట్టీ కేసులో సైఫాబాద్ పోలీసుల దురుసు ప్రవర్తన.. లాఠీలతో మహిళలపై దాడి? వరుస ప్రమాదాలతో ఆందోళన.. మూడు రోజులుగా ఈ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. పెన్‌గంగ నుంచి ఇస్లాంనగర్ వరకు జాతీయ రహదారి రెన్యూవల్ పనులు జరుగుతున్నాయి. హైవే నుంచి స్లిప్ రోడ్లు, సర్వీస్ రోడ్లు సరిగ్గా లేకపోవడంతో అనేకంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు మృత్యువాత పడ్డ తర్వాత భద్రత కమిటీ మేల్కొంది. శుక్రవారం సాయంత్రం ఈ కమిటీ సభ్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇకనైనా వేగిరంగా పనులు చేపట్టి హైవేపై ప్రాణాలు పోకుండా చర్యలు చేపడతారో.. లేదో వేచిచూడాలి. కాగా పనుల విషయంలో వివరాలు అడిగేందుకు ఎన్హెచ్ఏఐ పీడీ శ్రీనివాస్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
బైక్‌ను ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి
కొత్తకోట: వేగంగా వెళ్తున్న లారీ ఓ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దమందడి మండలం మోజర్లకు చెందిన బాల్‌రెడ్డి, రాములుతో పాటు మరో వ్యక్తి కొత్తకోట నుంచి గ్రామానికి బైక్‌పై వెళ్తున్నారు. పాలెం వద్దకు రాగానే వేగంగా దూసుకొచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బాల్‌రెడ్డి, రాములు అక్కడిక్కడే మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వామ్మో.. మహబూబా ఘాట్స్!
సారంగాపూర్ : అందమైన మలుపుల వెనుక అగాధాలెన్నో ఉన్నాయి. వాహన చోదకులు ఏ కొంచెం ఆదమరిచినా మలుపులపై రక్తాలు ధారలుగా పారడం ఖాయం. అందమైన ఆ మలుపులపై ప్రమాద సూచికలు సరిగా లేక ప్రమాదాలకు నెలవవుతున్నాయి. ఈ మలుపులపై కొన్నేళ్లుగా ఎన్నో కుటుంబాలు వీధిన పడిన దాఖలాలున్నాయి. అయినా అంతటి ప్రమాదకర మలుపుల వద్ద రక్షణ కల్పించడానికి సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ దారి గుండా ప్రయాణించే వాహన చోదకులు ఏకంగా శాపనార్థాలు పెట్టేస్తున్నారు. అందమైన మలుపుల వద్ద.. సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) సమీపంలోని మహబూబా ఘాట్స్ ప్రకృతి ప్రేమికులకు కనుల విందు చేయడమే కాదు అందాల మోజులో పడి ఆదమరిచి వాహనాలు నడిపేవారి పాలిట మృత్యు కూపాలుగానూ మారుతున్నాయి. మహబూబా ఘాట్స్ మాత్రమే కాదు ఘాట్స్ మొదలుకుని చించోలి(బి) ఎక్స్‌రోడ్డు వరకు వచ్చే 44వ జాతీయ రహదారిపైన ఉన్న మూడు మూల మలుపులు ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి. మూడేళ్లుగా ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. అయినా ఇంతవరకు ఘాట్స్తో పాటు ప్రమాదకర మలుపులు పట్టించుకున్నవారే కరువయ్యారు. గతంలో పలు ఘటనలు మహబూబా ఘాట్లు ఈ మూడేళ్లలో ఇప్పటివరకు దాదాపు 12 కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. 2013 ఫిబ్రవరి 2వ తేదీన ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. అది గమనించిన నేరడిగొండ మండలం నంద్యానాయక్ తండాకు చెందిన ఆడె రమేశ్ అనే యువకుడు తన ప్రాణాలను కాపాడుకోబోయి అదే బస్సు కింద పడి మృతిచెందాడు. అంతేకాకుండా 2013 జూన్ 6వ తేదీన మహబూబా ఘాట్స్ సమీపంలో ఘాట్ల పైనుంచి వేగంగా నిర్మల్ వైపు వస్తున్న లారీ ఎడ్లబండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చించోలి(బి) గ్రామానికి చెందిన నారాయణ అనే రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. 2015 ఆగస్టు 28న ఘాట్స్ పైనుంచి లారీ వేగంగా వచ్చి ఆవుల మంద, మేకల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 ఆవులు, 3 మేకలు మృతిచెందాయి. మే 18, 2016న మహిళా ప్రాంగణం సమీపంలోని మూలమలుపు వద్ద కడెం మండలం మొర్రిపేట్ గ్రామానికి చెందిన మర్సుకోల తిరుపతి(15) అనే బాలుడు మృతిచెందాడు. తన ద్విచక్రవాహనంపై నిర్మల్ నుంచి రాణాపూర్ వైపు వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. ఇలా దాదాపు ఎంతోమంది మనుషులు, పశువుల ప్రాణాలు గాలిలో కలిసిపోయి వారి కుటుంబాల్లో తీరని దు:ఖం మిగిలింది. ఇవన్నీ పెద్దవి కాగా చిన్నచిన్న ప్రమాదాలు జరిగి గాయాలపాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇంతటి ప్రమాదాలు కళ్లెదుటే జరుగుతున్నా మూలమలుపుల వద్ద ప్రమాద సూచికలు లేకపోవడం గమనార్హం. కొన్ని చోట్ల ప్రమాద సూచిక బోర్డులు ఉన్నా అవి చెడిపోయి, రంగులు వెలిసి పోయి ఉండటంతో ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే వారికి అవి అర్థం కావడం లేదని వాహనచోదకులు అంటున్నారు. విషాద కుటుంబం..! ఘాట్స్పైన జరుగుతున్న ప్రమాదాలతో పాటు చించోలి(బి) ఎక్స్ రోడ్డు వరకు ఉన్న మలుపుల వద్ద ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు వీధిపాలవుతున్నాయి. తాజాగా మహబూబా ఘాట్స్పైన శుక్రవారం జరిగిన ప్రమాదమే ఇందుకు తార్కాణం. ఇంటికి పెద్ద దిక్కయిన అనంత్వార్ మాధవరావు, ఆయన పెద్ద కుమారుడు హరీశ్ మృతిచెందిన ఘటనే. కుటుంబానికి పెద్ద దిక్కయిన మాధవరావు మృతిచెందడంతో ప్రస్తుతం ఆ కుటుంబం రోడ్డున పడినట్లయ్యింది. దీంతో పాటే అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తన పెద్ద కుమారుడు హరీశ్ మృతి ఆ కుటుంబానికి తీరని దు:ఖాన్ని మిగిల్చింది. వారి మరణంతో పాటు చిన్న కుమారుడు సాయిప్రసాద్, మాధవరావు భార్య నమితలు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థి«తి దయానీయంగా మారింది. -
రక్తసిక్తం
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం శ్రీశైలం–హైదరాబాద్ హైవేపై డీసీఎం–క్రూజర్ ఢీ ఇద్దరి మృత్యువాత, ఇద్దరి పరిస్థితి విషమం పెబ్బేరు, అడ్డాకులలో మరో ఇద్దరి మృతి జిల్లా రహదారులు గురువారం రక్తసిక్తంగా మారాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై డీసీఎంను క్రూజర్ ఢీకొట్టగా ఇద్దరు, పెబ్బేరు మండలంలో బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఓ యువకుడు, అడ్డాకుల మండలంలో జరిగిన ప్రమాదంలో మరో వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన క్రూజర్ కడ్తాల: శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆమనగల్లు మండలం కడ్తాల సమీపంలో తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి క్రూజర్ వాహనం వేగంగా ఢీకొట్టడంతో క్రూజర్‌లో ప్రయాణిస్తున్న అంబోజు చంద్రయ్య(48), వంగూరు సాలమ్మ(35) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. మాడ్గుల మండలం కలకొండకి చెందిన కొంతమంది రైతులు, తాము సాగుచేసిన కూరగాయలను విక్రయించేందుకు ప్రతిరోజూ గ్రామానికి చెందిన క్రూజర్ వాహనంలో హైదరాబాద్ కూరగాయల మార్కెట్‌కు వెళుతుంటారు. రోజులాగే అంబోజు చంద్రయ్య తాను పండించిన కూరగాయలతో క్రూజర్‌లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, గ్రామానికి చెందిన గిన్నెపుష్ప, యాదగిరి తమ కుమారుడి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారు ఆస్పత్రికి వెళ్లేందుకు అదే వాహనంలో ఎక్కారు. వారితో పాటు అదే గ్రామానికి చెందిన గుండాల వెంకటయ్య, వంగూరు సాలమ్మ, వంగూరు అంజయ్య, యాదమ్మ, ఎగిరిశెట్టి బాలమ్మ, మార్గమధ్యలో చంద్రయాన్‌పల్లి వద్ద కసిరెడ్డి సువర్ణ హైదరాబాద్‌కు వెళ్లేందుకు క్రూజర్‌లో ఎక్కారు. ఈ క్రమంలో క్రూజర్ ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామ సమీపంలో కూరగాయల లోడ్‌తో ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో క్రూజర్‌లో ఉన్న వంగూరు సాలమ్మ, అంబోజు చంద్రయ్య అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. గిన్నె యాదగిరి, గిన్నె పుష్ప, వంగూరు అంజయ్య, యాదమ్మ, గుండాల వెంకటయ్య తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చి, క్షతగాత్రులను ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో వంగూరు అంజయ్య, యాదమ్మ పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం వారందరినీ హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆమనగల్లు ఎస్ఐ రామలింగారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదవివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రూజర్‌లో ప్రయాణిస్తున్న కసిరెడ్డి సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అంత్యక్రియలకు వచ్చి. కలకొండకి చెందిన వంగూరు అంజయ్య, వంగూరు సాలమ్మ, వంగూరు మాసయ్య, వంగూరు యాదమ్మ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కలకొండలో బుధవారం తమ బంధువు మృతి చెందడంతో హైదరాబాద్ నుంచి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తిరిగి గురువారం హైదరాబాద్‌కు వెళుతుండగా మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యారు. వంగూరు సాలమ్మ మృతి చెందగా, ఆమె భర్త వంగూరు అంజయ్య, యాదమ్మలు తీవ్రంగా గాయపడ్డాడు. లారీని ఓవర్టేక్ చేయబోయి.. అడ్డాకుల: ముందు వెళుతున్న లారీని బైక్‌పై ఓవర్టేక్ చేయబోయి అదే లారీకి ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం అడ్డాకుల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తకోట మండలంలోని కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న ప్రటుల్ తివారీ(25), అత్రజ్సింగ్, వివేక్ త్రిపాఠి ముగ్గురు కలిసి సొంతపనిపై ఒకే బైక్‌పై అడ్డాకులకు వెళ్లి, తిరిగి ఫ్యాక్టరీకి బయల్దేరారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయి అదే లారీని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ప్రటుల్ తివారి అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు తివారీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. బైక్, లారీ ఢీ: ఒకరి మృతి పెబ్బేరు: మండల పరిధిలోని రంగాపూర్ శివారులో గురువారం సాయంత్రం బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. జనుంపల్లికి చెందిన గొల్ల మద్దిలేటి(48) గురువారం సాయంత్రం పెబ్బేరు నుంచి స్వగ్రామం జనుంపల్లికి బైక్ పై బయల్దేరాడు. రంగాపూర్ శివారులో పెబ్బేరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న సిమెంట్ పైపుల లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో మద్దిలేటి తల, కాళ్లు, ఇతర శరీర భాగాలు నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో లారీని అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. సంఘటన స్థలానికి ఎస్ఐ రమేష్ చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమారులున్నారు. -
త్రినేత్రం
– రూ.2కోట్లతో పుష్కరఘాట్ల వద్ద 500 సీసీ కెమెరాల ఏర్పాటు – 11వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు – జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా కృష్ణా పుష్కరాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు 32పుష్కరఘాట్ల వద్ద 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. 11వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనుంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరగనున్న కృష్ణా పుష్కరాలకు జిల్లా పోలీస్‌శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోనే కృష్ణా పరివాహక ప్రాంతం ఉండటంతో జిల్లాలో పుష్కరఘాట్లకు దాదాపు మూడు కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 40నుంచి 45వేల మందికి ఒక సీసీ కెమెరాతో పర్యవేక్షణ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే జిల్లాలో 32 ఘాట్లను గుర్తించిన అధికారులు, అందులో అత్యంత ముఖ్యమైన 9 ఘాట్లను గుర్తించారు. బందోబస్తుపరంగా ఎక్కడ తగ్గకుండా చూస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాలను పూర్తిగా నిఘా నేత్రంతో పహారా చేయాలని భావిస్తున్న పోలీసులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 32ఘాట్లలో 500సీసీ కెమెరాలు.. గుర్తించిన 32ఘాట్లలో రూ.2కోట్లతో 500సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసు అధికారులు ప్రాథమికంగా అంచనాకొచ్చి పుష్కరాలకు కావాల్సిన కెమెరాలు, పోలీస్ బలగాలు, భారీ గ్రేడ్స్ ఇతర వాటికి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వనికి జిల్లా పోలీస్ శాఖ నుంచి ప్రతిపాదన వెళ్లింది. పుష్కరాల కోసం ఏర్పాటు చేసే కెమెరాలు 360డిగ్రీల కోణంలో తిరిగే వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.70నుంచి 80వేలను ఒక్కో కెమెరాకు ఖర్చు చేసి అత్యంత టెక్నాలజీతో కూడిన నిఘా పెట్టాలని భావిస్తున్నారు. ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన జరిగిన సకాలంలో స్పందించడానికి ఈ కెమెరాలను ఉపయోగించుకోనున్నారు. మొత్తం 500కెమెరాలకు కలిపి రెండు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఏ ప్రదేశంలో ఎలాంటి సంఘటన చొటుచేసుకున్న స్థానిక విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం చేరవేయనున్నారు. జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి రానున్న పుష్కరాల సందర్భంగా జిల్లాలో దాదాపు 185కిలోమీటర్ల పొడవు ఉన్న జాతీయరహదారిపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. హైవేపై అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. బీచుపల్లి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఎలాంటి ఇబ్బంది రాకుండా పోలీసులు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెల రోజుల ముందే నుంచి పుష్కరఘాట్ల పరిసర ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఘాట్ల సమీపంలో సరికొత్త బారీకేడ్లను వాడుతున్నట్లు తెలుస్తోంది. 11వేల మంది బందోబస్తు పుష్కరాల సమయంలో జిల్లాలో బందోబస్తు నిర్వహించడానికి పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్థానికంగా ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో ఘాట్లు ఏర్పాటు చేయడంతో బందోబస్తు భారీస్థాయిలో ఉండాలని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు వేల పోలీస్ సిబ్బంది ఉండటంతో అదనంగా మరో 8వేల మందిని ఇతర జిల్లాల నుంచి రప్పిస్తున్నారు. సివిల్ పోలీసులతో పాటు పారా మిలిటరీ, ట్రాఫిక్ ఇతర విభాగాలు వారు ఉండనున్నారు. ముఖ్యంగా పుష్కరాల కోసం వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ స్థలాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బందోబస్తులో 10మంచి అదనపు ఎస్పీలు, 25మంది డీఎస్పీలు, 150మంది సీఐలు, 750మంది ఎస్ఐలు ఉంటారు. -
అకస్మాత్తుగా మంటలు చెలరేగి లారీ దగ్ధం
అడ్డాకుల: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న ఎల్అండ్టీ టోల్ ప్లాజా వద్ద బుధవారం వేకువజామున ఒక లారీ దగ్ధమైంది. రాజస్థాన్ నుంచి చెన్నైకి బ్లీచింగ్ పౌడర్ లోడుతో వెళుతున్న ఆర్జే08జిఏ7509 నంబరు గల లారీలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టోల్ ప్లాజా వద్ద మూత్ర విసర్జనకు లారీని ఆపిఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన ఎల్ అండ్ టి సిబ్బంది పోలీసులకు, పైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే లారీ పూర్తిగా దగ్ధమైన తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే లారీ పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
పరిహారం చెల్లించి... పనులు చేపట్టండి
వైఎస్ఆర్ సీపీ డిమాండ్ ఎఫ్‌సీ గోదాం నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరిక మద్దతు పలికిన వామపక్షాలు రాప్తాడు : జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రాప్తాడు చెరువు ఆయకట్టు భూములను రైతులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా స్వాధీనం చేసుకుని ఎఫ్‌సీ గోదాం నిర్మాణ పనులు ఎలా చేపట్టారంటూ అధికారులను, కాంట్రాక్టర్‌ని జిల్లా వైఎస్ఆర్ సీపీ కార్యదర్శి నారాయణ, మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు నిలదీశారు. 90 సంవత్సరాలుగా సాగులో ఉన్న సర్వే 274, 277లోని ఎకరా స్థలంలో ఎఫ్‌సీ గోదాం నిర్మాణాలను టీడీపీ నేతలు వేగవంతం చేశారు. కనీసం పరిహారం కూడా ఇవ్వకుండా పనులు కొనసాగిస్తుండడంతో బుధవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమానికి వామపక్ష నేతలు మద్దతు పలికారు. తొలుత 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం గోదాం నిర్మాణస్థలికి చేరుకుని పనులు అడ్డుకున్నారు. నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత పేరు చెప్పి తెలుగు తమ్ముళ్లు ఆగడాలు ఎక్కువైపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పరిహారం చెల్లించి అక్కడ గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నా తమకు అభ్యంతరం లేదని అన్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహశీల్దార్ ఈశ్వరమ్మ అక్కడకు చేరుకుని చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు. -
పరిశ్రమల వెల్లువ
జిల్లాలో ఉన్న పరిశ్రమలు.... చిన్న పరిశ్రమలు 7,664 కాటేజీ పరిశ్రమలు 614 పెద్ద పరిశ్రమలు 593 ఉపాధి పొందుతున్న వారు 50,000 జిల్లాలో కొత్తగా 14 పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు చాలా అనువైనదిగా యాజమాన్యాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో ఉండడంతో పాటు హైదరాబాద్, బెంగళూరులను కలిపే జాతీయ రహదారి- 44 కూడా జిల్లా గుండా వెళ్తుండడంతో పరిశ్రమలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలో మానవ వనరులు కూడా పుష్కలంగా ఉండడంతో సమస్య ఉత్పన్నం కాదని పరిశ్రమలు భావిస్తున్నాయి. అలాగే పరిశ్రమల స్థాపనకు భూ సమస్య రాకుండా ప్రభుత్వం కూడా పక్కా చర్యలు చేపట్టింది. జిల్లాలో దాదాపు 13,439 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు అనువైన భూమి ఉన్నట్లు ఇదివరకే రెవెన్యూశాఖ తేల్చి చెప్పింది. వాస్తవానికి జిల్లాలో 34,184 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. వీటిలో 16,723 ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు అనువుకాదని రెవెన్యూశాఖ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో తేల్చి చెప్పింది. అలాగే ఇదివరకే జిల్లాలో ఐఐసీ ఆధ్వర్యంలో ఆరు పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసి సుమారు రెండు వేల ఎకరాలకు పైగా భూమిని పారిశ్రామికవేత్తలకు అందజేశారు. ప్రస్తుతం ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మండలాలపైనే ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. నారాయణపేట, వనపర్తి డివిజన్లలో భూమి అందుబాటులో ఉన్నా పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని వినికిడి. కొత్త ఊపునిస్తున్న ప్రభుత్వ రాయితీలు.. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికంగా పురోగతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పరిశ్రమలకు రెడ్‌కార్పెట్ పరుస్తోంది. అందులో భాగంగా నూతన పారిశ్రామిక విధానం టీఎస్- ఐపాస్‌లో ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. దళితులు, గిరిజనులు, మహిళలకు పరిశ్రమల ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు రుణాలు ఇవ్వకుంటే ప్రభుత్వమే పెట్టుబడులు సమకూర్చేలా నిబంధనలు సడలించింది. అంతేకాదు పరిశ్రమలకు విద్యుత్ రాయితీ, చిన్న తరహా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పావలా వడ్డీకే రుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసకుంది. దీంతో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహవంతులుగా పరితపిస్తున్నారు. కొత్తగా ఆసక్తి కనబరుస్తున్న కంపెనీలు.. మెసర్స్ అనన్య గ్రీన్‌టెక్, అరబిందో ఫార్మా లిమిటెడ్, ఓయుఎం పరిశ్రమలు, శ్రీ వెంకటేశ్వర పరిశ్రమలు, గౌరిప్రియ పరిశ్రమలు, ఓఆర్ఇఎం యాక్సెక్ బయోఇంక్, మెసర్స్ స్టార్ పేపర్ కప్స్ అండ్ ప్లేట్స్, శ్రీ కార్తికేయ ఫార్మా యూనిట్-2, శిల్ప మెడికల్ లిమిటెడ్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర పరిశ్రమ, మెసర్స్ మనీష్ పరిశ్రమ, మెసర్స్ బేవ్కాన్ వాయర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ శ్రీ భవానీ పాలిమర్స్, సహజ పరిశ్రమలు వీటితో పాటు ప్రోక్టర్ అండ్ గాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి మల్టినేషన్ కంపెనీల మ్యాన్ ఫాక్చరింగ్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. పెద్ద ఎత్తున ఉపాధి... నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాలోని యువతకు పెద్దఎత్తున ఉపాధి లభించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నూతనంగా ఏర్పాటు చేయబోయే ప్రోక్టర్ అండ్ గాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి మల్టినేషన్ కంపెనీల మ్యాన్ ఫాక్చరింగ్ ప్లాంట్ల ద్వారానే ప్రత్యక్షంగా పరోక్షంగా 6వేల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉందని భావిస్తోంది. మిగతా 14 కంపెనీలు కలుపుకుంటే మొత్తంగా 20వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం లెక్కలు వేసుకుంది. ప్రస్తుతం జిల్లాలో 8,931వరకు చిన్నా పెద్దా పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 50వేల మందికి ప్రత్యక్షంగా... మరో 20వేల మందికి పైగా పరోక్షంగా ఉపాధి కలుగుతున్నట్లు అధికారుల గణాంకాలు సూచిస్తున్నాయి. -
ఎన్‌హెచ్-44పై సదుపాయాలు కల్పించండి
* లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ మీదుగా వెళుతున్న 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా గుండా వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారిపై 78 చోట్ల గ్రామాలకు వెళ్లే అప్రోచ్ రోడ్లు ఉన్నాయని, ఆయా గ్రామాలకు వెళ్లే వారు హైవేను దాటాల్సి ఉంటుందని, ఆ సమయంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 500 మంది ఈ రోడ్డులో ప్రమాదవశాత్తు చనిపోయారన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన 78 చోట్ల్ల జీబ్రాలైన్లు, స్పీడ్‌బ్రేకర్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. -
పీడిస్తుండ్రు..!
కలెక్టర్ గారూ..! బాధతో చెప్తున్నా... పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ఆర్అండ్బీ అధికారులు ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. పరిశ్రమల స్థాపనలో ఎదురయ్యే అవరోధాలను ముందుండి పరిష్కరించాల్సిన అధికారులు, ప్రజాప్రతి నిధులు వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ఈ నెల 18న జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. జిల్లాలో పరిశ్రమలను ఆయా ప్రభుత్వ శాఖలు పీల్చి పిప్పిచేస్తున్న తీరుకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్న మండలాల్లో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న కొత్తూరు, షాద్‌నగర్, బాలానగర్, భూత్పూర్, జడ్చర్ల, కడ్తాల్ తదితర మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు బహుళజాతి కంపెనీలతో పాటు ఔ త్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1.003 పరిశ్రమలున్నాయి. ఇందులో 70 భారీ, మధ్య తరహా పరిశ్రమలు. ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉపాధి లభిస్తున్నట్లు అం చనా. అయితే వలసల జిల్లాగా పే రున్న మహబూబ్‌నగర్‌లో పారిశ్రామికీకరణకు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారుల తీరు అడ్డంకిగా తయారైంది. తమకు రావాల్సిన వాటా ఇస్తేనే ఫైళ్లు కదులుతుండడంపై ఔత్సాహిక పెట్టుబడిదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారు అధికారుల వేధింపులు తట్టుకోలేక తల పట్టుకుంటున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు పునాదిలా భావించే లే ఔట్ అనుమతితో మొదలయ్యే లంచాల పర్వం దసరా మామూళ్ల దాకా కొనసాగుతోంది. సింగిల్‌విండో విధానంలో అనుమ తి ఇవ్వాల్సి ఉన్నా తమను వ్యక్తిగతంగా కలిస్తే తప్ప అనుమతులు ఇ వ్వడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. డీఐసీ, ఏపీఐఐసీ, విద్యుత్, కాలుష్య నియంత్రణ మండలి, వాణిజ్య పన్నుల శాఖ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అగ్నిమాపక శాఖ, పోలీసులు ఇలా వివిధ ప్రభుత్వ విభాగాలు పారిశ్రామికవేత్తల నుంచి వసూళ్ల పర్వంలో పోటీలు పడుతున్నాయి. లే ఔట్ అనుమతులతోనే ఆరంభం నూతనంగా పరిశ్రమ ఏర్పాటుకు డై రక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తొ లుత అనుమతి కోసం, ఆ తర్వాత లే ఔట్లో తేడాలున్నాయంటూ వి విధ పద్ధతుల్లో సంబంధిత విభాగం తమకు కావాల్సింది రాబట్టుకుంటోంది. జిల్లా పరిశ్రమల కేం ద్రం (డీఐసీ) సింగిల్‌విండో విధానంలో అనుమతులు ఇప్పించాల్సి ఉంటుంది. కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి. ఇందులో సభ్యులుగా ఉండే వివిధ విభాగాల అధికారులను వ్యక్తిగతంగా కలిస్తే తప్ప పనికావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీ ఇస్తుంది. తమకు వచ్చే సబ్సిడీలో ముందస్తుగా 15శాతం ముట్టచెబితే నే డీఐసీ నుంచి ఫైలు ముందుకు కదిలే పరిస్థితి ఉందని ఓ పారిశ్రామికవేత్త ఆవేదన వ్యక్తం చేశారు. డైరక్టరేట్ స్థాయిలో మరో 15శాతం ము ట్ట చెపితే తప్ప సబ్సిడీ ఫైలు ముం దుకు కదిలే పరిస్థితి లేదని చెబుతున్నారు. గరిష్టంగా సబ్సిడీ రూ. 20లక్షల వరకు పొందే వీలుండగా, రూ. 6 లక్షలకు పైగా మామూళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. సబ్సిడీ చెక్కులు ఇచ్చే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో కూడా చేతులు తడపందే పనికావడం లేదని ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఒకరు తన అనుభవాన్ని వివరించారు. దసరా పండుగ వస్తుండడంతో ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి వచ్చే డిమాండ్లకు అంతులేకుండా పోతోంది. ‘అవినీతికి తావులేని, పూర్తి పారదర్శకతతో కూడిన ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తాం’ అని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన అమలు జరగాలని జిల్లా పారిశ్రామికవేత్తలు ఆకాంక్షిస్తున్నారు. -
ప్రాణాలు పోతున్నాయి.. మూడు నెలల్లో 12 ప్రమాదాలు
సదాశివనగర్, న్యూస్‌లైన్: ఈ రహదారి పేరు చెబితేనే ద్విచక్ర వాహనదారులు జంకుతున్నారు. సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ శివారు నుంచి దగ్గి గ్రామ శివారు వరకు ఉన్న 10 కిలో మీటర్ల దూరంలోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. నవయుగ కన్స్ట్రక్షన్స్ సంస్థ చేపట్టిన ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా ఉండడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దగ్గి గ్రామ శివారు వద్ద నిర్మించిన సర్వీస్ రోడ్లు అధ్వానంగా మారాయి. బ్రిడ్జి విశాలంగా లేకపోవడంతో భారీ వాహనాలు పద్మాజివాడి చౌరస్తా వరకు రాంగ్ రూట్లో రావాల్సి వస్తోంది. దీంతో ఎదురుగా వస్తున్న వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సర్వీస్ రోడ్లను బీటీగా మార్చాలని నవయుగ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడు లేడు. ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. మల్లుపేట్ గ్రామం వద్ద యూటర్న్ కూడా ప్రమాదాలకు నెలవైంది. ఈ ప్రాంతంలో వాహనాల వేగం ఎక్కువగా ఉం టోంది. దీంతో గ్రామస్తులు రోడ్డు దాటేటప్పు డు ప్రమాదాలకు గురవుతున్నారు. కుప్రియాల్ గ్రామ స్టేజీ వద్ద యూటర్న్ నిర్మించడంతో చా లా ఇబ్బందులకు గురికావల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు. గడచిన మూడు నెలలలో ఈ రహదారిపై 12 ప్రమాదాలు జరుగగా, 11మం ది మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం నవయుగ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమనే విమర్శలు వస్తున్నా యి. అవసరమున్న చోట ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేవదని, ప్రధాన కూడళ్ల వద్ద భారీ లైటింగ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ప్రమాద నివారణ వా రోత్సవాలు నామమాత్రంగా నిర్వహించారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటే ప్రమాదాలను కొంత మేరకు నివారించవచ్చు. మూడునెలల్లో ప్రమాదాలు ఇలా.. సెప్టెంబర్ 9 : కుప్రియాల్ పెట్రోల్ బంక్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్నవారిని ఇన్నోవా కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో దూస అరవింద్ మృతి చెందగా, నవీన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. సెప్టెంబర్ 10 : కుప్రియాల్ బంక్ వద్ద పెట్రోల్ పోసుకునేందుకు ద్విచక్ర వాహనంపై వస్తుం డ గా కారు ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సెప్టెంబర్ 15 : అడ్లూర్ ఎల్లారెడ్డి బ్రిడ్జి వద్ద కారు అదుపు తప్పింది. అందులో ప్రయాణిస్తున్న శ్రీకాంత్, శాంతి, మోహన్‌లకు గాయాలయ్యాయి. అక్టోబర్ 12 : సదాశివనగర్ మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో యూటర్న్ వద్ద రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈర్ల దయాకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. శ్రీశైలం చికిత్స పొందుతూ చనిపోయాడు. అక్టోబర్ 17 : సదాశివనగర్ శివారులో రాత్రి వ్యవసాయ బావి వద్దకు సైకిల్‌పై వెళ్తున్న మ్యాదరి దేవయ్యను కారు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స పొందుతూ వా రం రోజుల తర్వాత మృతి చెందాడు. అక్టోబర్ 24 : దగ్గి గ్రామ శివారులో స్కార్పియో కారు అదుపు తప్పి మరో కారుకు ఢీ కొట్టడం తో హైదరాబాద్‌కు చెందిన కరుణ, డ్రైవర్ అంజిబాబు మృతి చెందారు. అక్టోబర్ 27 : మల్లుపేట్కు చెందిన మారుపాక నర్సింహులు రాత్రి వ్యవసాయ బావి వద్ద నుంచి సైకిల్‌పై గ్రామానికి వస్తుండగా కారు ఢీ కొని మృతి చెందాడు. అక్టోబర్ 31 : సదాశివనగర్ గ్రామ శివారు సాం పేఫీర దర్గా వద్ద గల బ్రిడ్జిపై నిలుచున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మేరాజొద్దీన్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఒకరికి గాయాలయ్యాయి. నవంబర్ 8 : కల్వరాల్ గ్రామ శివారులో సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన జంగం మహంతప్ప అనే పూజారి ద్విచక్ర వాహనంపై నిజామాబాద్ వైపునకు వెళ్తుండగా రాంగ్ రూట్లో ఎదురు వస్తున్న ఐచర్ వ్యాన్ ఢీ కొట్టడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. నవంబర్ 11 : దగ్గి గ్రామ స్టేజీ వద్ద గాంధారి మండలం తిమ్మాపూర్‌కు చెందిన పుట్టల సాయి లు రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టడంతో మృతి చెందాడు. నవంబర్ 17 : కుప్రియాల్ గ్రామ స్టేజీ వద్ద కుప్రియాల్‌కు చెందిన ఏలేటి లక్ష్మారెడ్డి ద్విక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొని మృతి చెందాడు. నవంబర్ 22 : కుప్రియాల్ గ్రామ శివారులో కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై కామారెడ్డి వైపునకు వెళ్తున్న అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన అంకం నర్సింహులు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందారు. సర్వీస్ రోడ్లను బాగుజెయ్యాలె రోడ్డు పెద్దగ చేసిన సంది మస్తుమంది చస్తుండ్రు. సర్వీస్ రోడ్లు కరాబైనయ్. డాంబార్ రోడ్డు ఏస్తమని చెప్పిండ్రు ఇప్పటికీ రోడ్డు లేదు. సర్వీస్ రోడ్డు మంచిగ జేస్తె పెద్ద రోడ్డుకు ఎక్కువ మంది పోరు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలే. -మల్లయ్య, సదాశివనగర్ పెద్ద లైట్లు పెట్టాలే... గ్రామ స్టేజీల వద్ద పెద్ద లైట్లు పెడితే దూరం నుంచి అచ్చే వాహనం కనిపిస్తుంది. ఇప్పడు రోడ్డు పక్కపొంటి పోయినా సాన భయమేస్తుంది. లైట్లు లేక ఎనుక అచ్చి గుద్దిపోతుండ్రు. నవయుగ వాల్లకు మస్తు సార్లు చెప్పినం అయిన పట్టించుకోలేదు. లైట్లు పెట్టకుంటే రోడ్డుమీద రాస్తారోకో చేస్తాం. -రాములు, మల్లుపేట్ -
ప్రైవేట్ బస్సుకు తప్పిన ముప్పు: ప్రయాణికలు సురక్షితం
అనంతపురంలోని బళ్లారి జాతీయ రహదారి నెంబర్- 44 పై వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఆదివారం తెల్లవారుజామున అదుపు తప్పి ఫ్లైఓవర్‌ను ఢీ కొట్టింది. అయితే ఆ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆ బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానం చేర్చేందుకు బస్సు యాజమాన్యం చర్యలు చేపట్టింది.