పరిహారం చెల్లించి... పనులు చేపట్టండి
వైఎస్‌ఆర్ సీపీ డిమాండ్
ఎఫ్‌సీ గోదాం నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరిక
మద్దతు పలికిన వామపక్షాలు
రాప్తాడు : జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రాప్తాడు చెరువు ఆయకట్టు భూములను రైతులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా స్వాధీనం చేసుకుని ఎఫ్‌సీ గోదాం నిర్మాణ పనులు ఎలా చేపట్టారంటూ అధికారులను, కాంట్రాక్టర్‌ని జిల్లా వైఎస్‌ఆర్ సీపీ కార్యదర్శి నారాయణ, మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు నిలదీశారు. 90 సంవత్సరాలుగా సాగులో ఉన్న సర్వే 274, 277లోని ఎకరా స్థలంలో ఎఫ్‌సీ గోదాం నిర్మాణాలను టీడీపీ నేతలు వేగవంతం చేశారు.
కనీసం పరిహారం కూడా ఇవ్వకుండా పనులు కొనసాగిస్తుండడంతో బుధవారం వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమానికి వామపక్ష నేతలు మద్దతు పలికారు. తొలుత 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం గోదాం నిర్మాణస్థలికి చేరుకుని పనులు అడ్డుకున్నారు. నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత పేరు చెప్పి తెలుగు తమ్ముళ్లు ఆగడాలు ఎక్కువైపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పరిహారం చెల్లించి అక్కడ గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నా తమకు అభ్యంతరం లేదని అన్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహశీల్దార్ ఈశ్వరమ్మ అక్కడకు చేరుకుని చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు.