పీడిస్తుండ్రు..!
కలెక్టర్ గారూ..! బాధతో చెప్తున్నా... పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారిని ఆర్‌అండ్‌బీ అధికారులు ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. పరిశ్రమల స్థాపనలో ఎదురయ్యే అవరోధాలను ముందుండి పరిష్కరించాల్సిన అధికారులు, ప్రజాప్రతి నిధులు వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ఈ నెల 18న జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. జిల్లాలో పరిశ్రమలను ఆయా ప్రభుత్వ శాఖలు పీల్చి పిప్పిచేస్తున్న తీరుకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్న మండలాల్లో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న కొత్తూరు, షాద్‌నగర్, బాలానగర్, భూత్పూర్, జడ్చర్ల, కడ్తాల్ తదితర మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు బహుళజాతి కంపెనీలతో పాటు ఔ త్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1.003 పరిశ్రమలున్నాయి. ఇందులో 70 భారీ, మధ్య తరహా పరిశ్రమలు. ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉపాధి లభిస్తున్నట్లు అం చనా. అయితే వలసల జిల్లాగా పే రున్న మహబూబ్‌నగర్‌లో పారిశ్రామికీకరణకు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారుల తీరు అడ్డంకిగా తయారైంది.
తమకు రావాల్సిన వాటా ఇస్తేనే ఫైళ్లు కదులుతుండడంపై ఔత్సాహిక పెట్టుబడిదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారు అధికారుల వేధింపులు తట్టుకోలేక తల పట్టుకుంటున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు పునాదిలా భావించే లే ఔట్ అనుమతితో మొదలయ్యే లంచాల పర్వం దసరా మామూళ్ల దాకా కొనసాగుతోంది. సింగిల్‌విండో విధానంలో అనుమ తి ఇవ్వాల్సి ఉన్నా తమను వ్యక్తిగతంగా కలిస్తే తప్ప అనుమతులు ఇ వ్వడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. డీఐసీ, ఏపీఐఐసీ, విద్యుత్, కాలుష్య నియంత్రణ మండలి, వాణిజ్య పన్నుల శాఖ, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అగ్నిమాపక శాఖ, పోలీసులు ఇలా వివిధ ప్రభుత్వ విభాగాలు పారిశ్రామికవేత్తల నుంచి వసూళ్ల పర్వంలో పోటీలు పడుతున్నాయి.
లే ఔట్ అనుమతులతోనే ఆరంభం
నూతనంగా పరిశ్రమ ఏర్పాటుకు డై రక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తొ లుత అనుమతి కోసం, ఆ తర్వాత లే ఔట్‌లో తేడాలున్నాయంటూ వి విధ పద్ధతుల్లో సంబంధిత విభాగం తమకు కావాల్సింది రాబట్టుకుంటోంది. జిల్లా పరిశ్రమల కేం ద్రం (డీఐసీ) సింగిల్‌విండో విధానంలో అనుమతులు ఇప్పించాల్సి ఉంటుంది. కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి. ఇందులో సభ్యులుగా ఉండే వివిధ విభాగాల అధికారులను వ్యక్తిగతంగా కలిస్తే తప్ప పనికావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీ ఇస్తుంది. తమకు వచ్చే సబ్సిడీలో ముందస్తుగా 15శాతం ముట్టచెబితే నే డీఐసీ నుంచి ఫైలు ముందుకు కదిలే పరిస్థితి ఉందని ఓ పారిశ్రామికవేత్త ఆవేదన వ్యక్తం చేశారు. డైరక్టరేట్ స్థాయిలో మరో 15శాతం ము ట్ట చెపితే తప్ప సబ్సిడీ ఫైలు ముం దుకు కదిలే పరిస్థితి లేదని చెబుతున్నారు. గరిష్టంగా సబ్సిడీ రూ. 20లక్షల వరకు పొందే వీలుండగా, రూ. 6 లక్షలకు పైగా మామూళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. సబ్సిడీ చెక్కులు ఇచ్చే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో కూడా చేతులు తడపందే పనికావడం లేదని ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఒకరు తన అనుభవాన్ని వివరించారు. దసరా పండుగ వస్తుండడంతో ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి వచ్చే డిమాండ్లకు అంతులేకుండా పోతోంది. ‘అవినీతికి తావులేని, పూర్తి పారదర్శకతతో కూడిన ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తాం’ అని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన అమలు జరగాలని జిల్లా పారిశ్రామికవేత్తలు ఆకాంక్షిస్తున్నారు.