ప్రాణాలు పోతున్నాయి.. మూడు నెలల్లో 12 ప్రమాదాలు | 12 road accidents with in 3 months over national highway No. 44 | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోతున్నాయి.. మూడు నెలల్లో 12 ప్రమాదాలు

Published Tue, Nov 26 2013 5:08 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

12 road accidents with in 3 months over national highway No. 44

 సదాశివనగర్, న్యూస్‌లైన్: ఈ రహదారి పేరు చెబితేనే ద్విచక్ర వాహనదారులు జంకుతున్నారు. సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ శివారు నుంచి దగ్గి గ్రామ శివారు వరకు ఉన్న 10 కిలో మీటర్ల దూరంలోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. నవయుగ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చేపట్టిన ఈ జాతీయ రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా ఉండడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దగ్గి గ్రామ శివారు వద్ద నిర్మించిన సర్వీస్ రోడ్లు అధ్వానంగా మారాయి. బ్రిడ్జి  విశాలంగా లేకపోవడంతో భారీ వాహనాలు పద్మాజివాడి చౌరస్తా వరకు రాంగ్ రూట్‌లో రావాల్సి వస్తోంది. దీంతో ఎదురుగా వస్తున్న వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.

ఈ సర్వీస్ రోడ్లను బీటీగా మార్చాలని నవయుగ కన్‌స్ట్రక్షన్స్ నిర్వాహకులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడు లేడు. ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. మల్లుపేట్ గ్రామం వద్ద యూటర్న్ కూడా ప్రమాదాలకు నెలవైంది. ఈ ప్రాంతంలో వాహనాల వేగం ఎక్కువగా ఉం టోంది. దీంతో గ్రామస్తులు రోడ్డు దాటేటప్పు డు ప్రమాదాలకు గురవుతున్నారు. కుప్రియాల్ గ్రామ స్టేజీ వద్ద యూటర్న్ నిర్మించడంతో చా లా ఇబ్బందులకు గురికావల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు. గడచిన మూడు నెలలలో ఈ రహదారిపై 12 ప్రమాదాలు జరుగగా, 11మం ది మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు.
 
 అధికారుల నిర్లక్ష్యమే కారణం
 నవయుగ కన్‌స్ట్రక్షన్స్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమనే విమర్శలు వస్తున్నా యి. అవసరమున్న చోట ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేవదని, ప్రధాన కూడళ్ల వద్ద భారీ లైటింగ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.  ప్రమాద నివారణ వా రోత్సవాలు నామమాత్రంగా నిర్వహించారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటే ప్రమాదాలను కొంత మేరకు నివారించవచ్చు.
 
 మూడునెలల్లో ప్రమాదాలు ఇలా..
 సెప్టెంబర్ 9 : కుప్రియాల్ పెట్రోల్ బంక్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్నవారిని ఇన్నోవా కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో దూస అరవింద్ మృతి చెందగా, నవీన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి.


 సెప్టెంబర్ 10 : కుప్రియాల్ బంక్ వద్ద పెట్రోల్ పోసుకునేందుకు ద్విచక్ర వాహనంపై వస్తుం డ గా కారు ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
 
 సెప్టెంబర్ 15 : అడ్లూర్ ఎల్లారెడ్డి బ్రిడ్జి వద్ద కారు అదుపు తప్పింది. అందులో ప్రయాణిస్తున్న శ్రీకాంత్, శాంతి, మోహన్‌లకు గాయాలయ్యాయి.
 
 అక్టోబర్ 12 : సదాశివనగర్ మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో యూటర్న్ వద్ద రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిని ఆర్‌టీసీ బస్సు ఢీకొంది. ఈర్ల దయాకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. శ్రీశైలం చికిత్స పొందుతూ చనిపోయాడు.
 
 అక్టోబర్ 17 : సదాశివనగర్ శివారులో రాత్రి వ్యవసాయ బావి వద్దకు సైకిల్‌పై వెళ్తున్న మ్యాదరి దేవయ్యను కారు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స పొందుతూ వా రం రోజుల తర్వాత  మృతి చెందాడు.
 
 అక్టోబర్ 24 : దగ్గి గ్రామ శివారులో స్కార్పియో కారు అదుపు తప్పి మరో కారుకు ఢీ కొట్టడం తో హైదరాబాద్‌కు చెందిన కరుణ, డ్రైవర్ అంజిబాబు మృతి చెందారు.
 
 అక్టోబర్ 27 : మల్లుపేట్‌కు చెందిన మారుపాక నర్సింహులు రాత్రి వ్యవసాయ బావి వద్ద నుంచి సైకిల్‌పై గ్రామానికి వస్తుండగా కారు ఢీ కొని మృతి చెందాడు.
 
 అక్టోబర్ 31 : సదాశివనగర్ గ్రామ శివారు సాం పేఫీర దర్గా వద్ద గల బ్రిడ్జిపై నిలుచున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మేరాజొద్దీన్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఒకరికి గాయాలయ్యాయి.
 
 నవంబర్ 8 : కల్వరాల్ గ్రామ శివారులో సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన జంగం మహంతప్ప అనే పూజారి ద్విచక్ర వాహనంపై నిజామాబాద్ వైపునకు వెళ్తుండగా రాంగ్ రూట్‌లో ఎదురు వస్తున్న ఐచర్ వ్యాన్ ఢీ కొట్టడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు.
 
 నవంబర్ 11 : దగ్గి గ్రామ స్టేజీ వద్ద గాంధారి మండలం తిమ్మాపూర్‌కు చెందిన పుట్టల సాయి లు రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టడంతో మృతి చెందాడు.
 
 నవంబర్ 17 : కుప్రియాల్ గ్రామ స్టేజీ వద్ద కుప్రియాల్‌కు చెందిన ఏలేటి లక్ష్మారెడ్డి ద్విక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొని మృతి చెందాడు.
 
 నవంబర్ 22 : కుప్రియాల్ గ్రామ శివారులో కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై కామారెడ్డి వైపునకు వెళ్తున్న అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన అంకం నర్సింహులు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందారు.
 
 సర్వీస్ రోడ్లను బాగుజెయ్యాలె
 రోడ్డు పెద్దగ చేసిన సంది మస్తుమంది చస్తుండ్రు. సర్వీస్ రోడ్లు కరాబైనయ్. డాంబార్ రోడ్డు ఏస్తమని చెప్పిండ్రు ఇప్పటికీ రోడ్డు లేదు. సర్వీస్ రోడ్డు మంచిగ జేస్తె పెద్ద రోడ్డుకు ఎక్కువ మంది పోరు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలే.
 -మల్లయ్య, సదాశివనగర్
 
 పెద్ద లైట్లు పెట్టాలే...
 గ్రామ స్టేజీల వద్ద పెద్ద లైట్లు పెడితే దూరం నుంచి అచ్చే వాహనం కనిపిస్తుంది. ఇప్పడు రోడ్డు పక్కపొంటి పోయినా సాన భయమేస్తుంది. లైట్లు లేక ఎనుక అచ్చి గుద్దిపోతుండ్రు. నవయుగ వాల్లకు మస్తు సార్లు చెప్పినం అయిన పట్టించుకోలేదు. లైట్లు పెట్టకుంటే రోడ్డుమీద రాస్తారోకో చేస్తాం.
 -రాములు, మల్లుపేట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement