రక్తసిక్తం | road accident 4 members died | Sakshi
Sakshi News home page

రక్తసిక్తం

Published Fri, Sep 23 2016 12:15 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

ప్రమాదానికి గురైన క్రూజర్‌ వాహనం - Sakshi

ప్రమాదానికి గురైన క్రూజర్‌ వాహనం

  •  వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం 
  •  శ్రీశైలం–హైదరాబాద్‌ హైవేపై డీసీఎం–క్రూజర్‌ ఢీ 
  •  ఇద్దరి మృత్యువాత, ఇద్దరి పరిస్థితి విషమం  
  •  పెబ్బేరు, అడ్డాకులలో మరో ఇద్దరి మృతి 
  • జిల్లా రహదారులు గురువారం రక్తసిక్తంగా మారాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీశైలం–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై డీసీఎంను క్రూజర్‌ ఢీకొట్టగా ఇద్దరు, పెబ్బేరు మండలంలో బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఓ యువకుడు, అడ్డాకుల మండలంలో జరిగిన ప్రమాదంలో మరో వ్యక్తి మృత్యువాతపడ్డాడు.
     
    ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన క్రూజర్‌ 
    కడ్తాల: శ్రీశైలం–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆమనగల్లు మండలం కడ్తాల సమీపంలో తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి క్రూజర్‌ వాహనం వేగంగా ఢీకొట్టడంతో క్రూజర్‌లో ప్రయాణిస్తున్న అంబోజు చంద్రయ్య(48), వంగూరు సాలమ్మ(35) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. మాడ్గుల మండలం కలకొండకి చెందిన కొంతమంది రైతులు, తాము సాగుచేసిన కూరగాయలను విక్రయించేందుకు ప్రతిరోజూ గ్రామానికి చెందిన క్రూజర్‌ వాహనంలో హైదరాబాద్‌ కూరగాయల మార్కెట్‌కు వెళుతుంటారు. రోజులాగే అంబోజు చంద్రయ్య తాను పండించిన కూరగాయలతో క్రూజర్‌లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, గ్రామానికి చెందిన గిన్నెపుష్ప, యాదగిరి తమ కుమారుడి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారు ఆస్పత్రికి వెళ్లేందుకు అదే వాహనంలో ఎక్కారు. వారితో పాటు అదే గ్రామానికి చెందిన గుండాల వెంకటయ్య, వంగూరు సాలమ్మ, వంగూరు అంజయ్య, యాదమ్మ, ఎగిరిశెట్టి బాలమ్మ, మార్గమధ్యలో చంద్రయాన్‌పల్లి వద్ద కసిరెడ్డి సువర్ణ హైదరాబాద్‌కు వెళ్లేందుకు క్రూజర్‌లో ఎక్కారు. ఈ క్రమంలో క్రూజర్‌ ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామ సమీపంలో కూరగాయల లోడ్‌తో ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో క్రూజర్‌లో ఉన్న వంగూరు సాలమ్మ, అంబోజు చంద్రయ్య అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. గిన్నె యాదగిరి, గిన్నె పుష్ప, వంగూరు అంజయ్య, యాదమ్మ, గుండాల వెంకటయ్య తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చి,  క్షతగాత్రులను ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో వంగూరు అంజయ్య, యాదమ్మ పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం వారందరినీ హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆమనగల్లు ఎస్‌ఐ రామలింగారెడ్డి సంఘటన  స్థలానికి చేరుకుని ప్రమాదవివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రూజర్‌లో ప్రయాణిస్తున్న కసిరెడ్డి సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. 
    అంత్యక్రియలకు వచ్చి.
    కలకొండకి చెందిన వంగూరు అంజయ్య, వంగూరు సాలమ్మ, వంగూరు మాసయ్య, వంగూరు యాదమ్మ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కలకొండలో బుధవారం తమ బంధువు మృతి చెందడంతో హైదరాబాద్‌ నుంచి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తిరిగి గురువారం హైదరాబాద్‌కు వెళుతుండగా మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యారు. వంగూరు సాలమ్మ మృతి చెందగా, ఆమె భర్త వంగూరు అంజయ్య, యాదమ్మలు తీవ్రంగా గాయపడ్డాడు.  
     
    లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి..
    అడ్డాకుల: ముందు వెళుతున్న లారీని బైక్‌పై ఓవర్‌టేక్‌ చేయబోయి అదే లారీకి ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం అడ్డాకుల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తకోట మండలంలోని కృష్ణవేణి షుగర్‌ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న ప్రటుల్‌ తివారీ(25), అత్రజ్‌సింగ్, వివేక్‌ త్రిపాఠి ముగ్గురు కలిసి సొంతపనిపై ఒకే బైక్‌పై అడ్డాకులకు వెళ్లి, తిరిగి ఫ్యాక్టరీకి బయల్దేరారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి అదే లారీని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ప్రటుల్‌ తివారి అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు తివారీ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు పేర్కొన్నారు.  
     
     బైక్, లారీ ఢీ: ఒకరి మృతి 
    పెబ్బేరు: మండల పరిధిలోని రంగాపూర్‌ శివారులో గురువారం సాయంత్రం బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. జనుంపల్లికి చెందిన గొల్ల మద్దిలేటి(48) గురువారం సాయంత్రం పెబ్బేరు నుంచి స్వగ్రామం జనుంపల్లికి బైక్‌ పై బయల్దేరాడు. రంగాపూర్‌ శివారులో పెబ్బేరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న సిమెంట్‌ పైపుల లారీ వెనుక నుంచి బైక్‌ను  ఢీకొట్టింది. ఈ సంఘటనలో మద్దిలేటి తల, కాళ్లు, ఇతర శరీర భాగాలు నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో లారీని అక్కడే వదిలేసి డ్రైవర్‌ పరారయ్యాడు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ రమేష్‌ చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమారులున్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement