hyderabad srisailam national highway
-
అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్ధార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని స్మితా ఇంటి వద్ద మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్ హల్చల్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మేడ్చల్ జిల్లా పౌరఫరాశాఖ కార్యాలయంలో ఆనంద్ కుమార్ రెడ్డి(45) డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి తన స్నేహితుడు దుర్గా విలాస్ హోటల్ యజమాని బాబుతో కలిసి యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని ప్లెజెంట్ వ్యాలీలో ఆమె ఉంటున్న నివాస సముదాయం వద్దకు వచ్చాడు. తనకు అపాయింట్మెంట్ ఉందంటూ అక్కడి భద్రతా సిబ్బందిని నమ్మించి ఆనంద్రెడ్డిలోనికి ప్రవేశించి స్మీతా సబర్వాల్ ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ భద్రత లేకపోవడంతో ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి వెళ్లాడు. అలికిడికి బయటకు వచ్చిన స్మితా సబర్వాల్ గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో ఆందోళనకు గురై.. బయటకు వెళ్లిపోవాల్సిందిగా కేకలు వేసింది. దాంతో ఆనంద్ బయటకు వెళ్లిపోయాడు. తన అనుమతి లేకుండా గుర్తు తెలియని వ్యక్తిని లోనికి ఎవరు పంపారంటూ సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించడంతో అప్రమత్తమైన సిబ్బంది బయటకు వస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడు ఆనంద్ కుమార్‌తోపాటు అతడి వెంట వచ్చిన బాబును అదుపులోకి తీసుకున్నారు. వారి కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో స్మితా సబర్వాల్ ట్వీట్లను డిప్యూటీ తహసీల్దార్ రీట్వీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు తనకు ఎదురైన అనుభవాన్ని ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. గత రాత్రి అత్యంత బాధాకరమైన ఘటన జరిగిందని, తన ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడినట్లు తెలిపారు. అప్రమత్తతో వ్యవహరించి తన ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. మీరు ఎంత సురక్షితంగా ఉన్నామని భావించినా.. ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా తలుపులు, తాళాలు తనిఖీ చేసుకోవాలంటూ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని పేర్కొన్నారు. Had this most harrowing experience, a night back when an intruder broke into my house. I had the presence of mind to deal and save my life. Lessons: no matter how secure you think you are- always check the doors/ locks personally.#Dial100 in emergency — Smita Sabharwal (@SmitaSabharwal) January 22, 2023 -
రూ.1450 కోట్ల వ్యయంతో పనులు.. ‘సుంకిశాల’.. చకచకా
సాక్షి, హైదరాబాద్: మహానగర దాహార్తిని తీరుస్తున్న కృష్ణా మూడు దశల ప్రాజెక్టులకు ఈ ఏడాది చివరి నాటికి పుష్కలంగా తాగునీరు అందుబాటులోకి రానుంది. జలాలను తరలించేందుకు ఉద్దేశించిన సుంకిశాల ఇన్‌టేక్‌వెల్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. నాగార్జున సాగర్ బ్యాక్‌వాటర్ సుంకిశాల వద్ద రూ.1470 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 50 శాతం.. అంటే రూ.760 కోట్ల మేర పనులు పూర్తయినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ ఏడాది నవంబర్– డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేస్తామని పేర్కొంది. దాహార్తి దూరం.. ►ప్రస్తుతం కృష్ణా మూడు దశల ప్రాజెక్టుల ద్వారా నగరానికి నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల (16.5 టీఎంసీలు) తాగునీటిని ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ (ఏఎంఆర్పీ) నుంచి తరలిస్తున్నారు. ఏటా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టాలు 510 అడుగుల కంటే దిగువనకు పడిపోయినపుడు డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని తరలించాల్సి వస్తోంది. ►ఈ నేపథ్యంలోనే ఈ ఇన్‌టేక్‌వెల్‌ను అత్యంత లోతున నిర్మిస్తున్నారు. సుమారు 170 మీటర్ల లోతు, 40 మీటర్ల వెడల్పున ఇన్‌టేక్ వెల్‌ను నిర్మిస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాల కారణంగా భవిష్యత్‌లో మొత్తంగా 20 టీఎంసీల కృష్ణా జలాలను నగరానికి తరలించేందుకు ఈ వెల్‌ను నిర్మిస్తుండడం విశేషం. మండువేసవిలోనూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎండీడీఎల్(మినిమం డ్రాయల్ డౌన్ లెవెల్) కంటే దిగువ నుంచి కూడా నీటిని తరలించేందుకు సుంకిశాల ప్రాజెక్టు ఉపయోగపడనుందని జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టు పురోగతి ఇలా.. ►అండర్ గ్రౌండ్ షాఫ్ట్ (వెట్ వెల్ డ్రై వెల్): అండర్ గ్రౌండ్ షాఫ్ట్ నిర్మాణం కోసం కీలకమైన రాతి తొలగింపు పనులు పూర్తయ్యాయి. ►8 మీటర్ల డయా వ్యాసార్థంతో యాక్సెస్ టన్నెళ్లు, లింక్ టన్నెళ్ల తవ్వకం పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. మొత్తం 1100 రన్నింగ్ మీటర్లు (ఆర్ఎంటీ)లో 900 ఆర్ఎంటీ మేర పనులు పూర్తయ్యాయి. ఇన్ టేక్ టన్నెళ్ల తవ్వకం పనులు జరుగుతున్నాయి. ►ఎలక్ట్రో మెకానికల్ ఈక్విప్ మెంట్: ట్రాన్ కో నుంచి ప్రత్యేకంగా హెచ్ టీ ఫీడర్ మెయిన్ తీసుకున్నారు. పంపులు, మోటార్లు, ట్రాన్సా్ఫర్మర్, సబ్ స్టేషన్, ఇతర సామగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. పంపింగ్ మెయిన్లు: 2375 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్‌కు ప్లేట్లు, పైపుల కొనుగోలు, తయారీ జరుగుతోంది. మొత్తం 5 కిలోమీటర్ల పైపులైన్లు తయారు కాగా, 3 కిలోమీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు పూర్తయ్యింది. మొత్తం ప్రాజెక్టును 2023 నవంబరు– డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. -
రక్తసిక్తం
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం శ్రీశైలం–హైదరాబాద్ హైవేపై డీసీఎం–క్రూజర్ ఢీ ఇద్దరి మృత్యువాత, ఇద్దరి పరిస్థితి విషమం పెబ్బేరు, అడ్డాకులలో మరో ఇద్దరి మృతి జిల్లా రహదారులు గురువారం రక్తసిక్తంగా మారాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై డీసీఎంను క్రూజర్ ఢీకొట్టగా ఇద్దరు, పెబ్బేరు మండలంలో బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఓ యువకుడు, అడ్డాకుల మండలంలో జరిగిన ప్రమాదంలో మరో వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన క్రూజర్ కడ్తాల: శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆమనగల్లు మండలం కడ్తాల సమీపంలో తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి క్రూజర్ వాహనం వేగంగా ఢీకొట్టడంతో క్రూజర్‌లో ప్రయాణిస్తున్న అంబోజు చంద్రయ్య(48), వంగూరు సాలమ్మ(35) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. మాడ్గుల మండలం కలకొండకి చెందిన కొంతమంది రైతులు, తాము సాగుచేసిన కూరగాయలను విక్రయించేందుకు ప్రతిరోజూ గ్రామానికి చెందిన క్రూజర్ వాహనంలో హైదరాబాద్ కూరగాయల మార్కెట్‌కు వెళుతుంటారు. రోజులాగే అంబోజు చంద్రయ్య తాను పండించిన కూరగాయలతో క్రూజర్‌లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, గ్రామానికి చెందిన గిన్నెపుష్ప, యాదగిరి తమ కుమారుడి ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారు ఆస్పత్రికి వెళ్లేందుకు అదే వాహనంలో ఎక్కారు. వారితో పాటు అదే గ్రామానికి చెందిన గుండాల వెంకటయ్య, వంగూరు సాలమ్మ, వంగూరు అంజయ్య, యాదమ్మ, ఎగిరిశెట్టి బాలమ్మ, మార్గమధ్యలో చంద్రయాన్‌పల్లి వద్ద కసిరెడ్డి సువర్ణ హైదరాబాద్‌కు వెళ్లేందుకు క్రూజర్‌లో ఎక్కారు. ఈ క్రమంలో క్రూజర్ ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామ సమీపంలో కూరగాయల లోడ్‌తో ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో క్రూజర్‌లో ఉన్న వంగూరు సాలమ్మ, అంబోజు చంద్రయ్య అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. గిన్నె యాదగిరి, గిన్నె పుష్ప, వంగూరు అంజయ్య, యాదమ్మ, గుండాల వెంకటయ్య తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చి, క్షతగాత్రులను ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో వంగూరు అంజయ్య, యాదమ్మ పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం వారందరినీ హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆమనగల్లు ఎస్ఐ రామలింగారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదవివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రూజర్‌లో ప్రయాణిస్తున్న కసిరెడ్డి సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అంత్యక్రియలకు వచ్చి. కలకొండకి చెందిన వంగూరు అంజయ్య, వంగూరు సాలమ్మ, వంగూరు మాసయ్య, వంగూరు యాదమ్మ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కలకొండలో బుధవారం తమ బంధువు మృతి చెందడంతో హైదరాబాద్ నుంచి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తిరిగి గురువారం హైదరాబాద్‌కు వెళుతుండగా మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యారు. వంగూరు సాలమ్మ మృతి చెందగా, ఆమె భర్త వంగూరు అంజయ్య, యాదమ్మలు తీవ్రంగా గాయపడ్డాడు. లారీని ఓవర్టేక్ చేయబోయి.. అడ్డాకుల: ముందు వెళుతున్న లారీని బైక్‌పై ఓవర్టేక్ చేయబోయి అదే లారీకి ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం అడ్డాకుల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తకోట మండలంలోని కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న ప్రటుల్ తివారీ(25), అత్రజ్సింగ్, వివేక్ త్రిపాఠి ముగ్గురు కలిసి సొంతపనిపై ఒకే బైక్‌పై అడ్డాకులకు వెళ్లి, తిరిగి ఫ్యాక్టరీకి బయల్దేరారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయి అదే లారీని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ప్రటుల్ తివారి అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు తివారీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. బైక్, లారీ ఢీ: ఒకరి మృతి పెబ్బేరు: మండల పరిధిలోని రంగాపూర్ శివారులో గురువారం సాయంత్రం బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. జనుంపల్లికి చెందిన గొల్ల మద్దిలేటి(48) గురువారం సాయంత్రం పెబ్బేరు నుంచి స్వగ్రామం జనుంపల్లికి బైక్ పై బయల్దేరాడు. రంగాపూర్ శివారులో పెబ్బేరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న సిమెంట్ పైపుల లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో మద్దిలేటి తల, కాళ్లు, ఇతర శరీర భాగాలు నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో లారీని అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. సంఘటన స్థలానికి ఎస్ఐ రమేష్ చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమారులున్నారు.