ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకోండి
సుప్రీంకోర్టుకు విద్యార్థి లేఖ.. స్పందించిన అత్యున్నత న్యాయస్థానం
హైదరాబాద్: జాతీయ జెండా రంగులు రాజకీయ పార్టీలకు ఉండటం, ఎన్నికల్లో ఒకే అభ్యర్థి రెండు మూడు స్థానాల్లో పోటీ చేసి అనంతరం రాజీనామా చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తదితర అంశాలపై చైతన్యపురికి చెందిన రామిని ఈశ్వరచంద్ర రాసిన లేఖకు సుప్రీం కోర్టు స్పందించింది. గత ఏప్రిల్లో ఈశ్వరచంద్ర సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రెండు పేజీల లేఖను రాశాడు. ఉమ, శ్రీనివాస్ దంపతుల కుమారుడు ఈశ్వర చంద్ర స్థానిక జీనియస్ గ్రామర్ స్కూల్లో 7వతరగతి చదువుతున్నాడు.
జాతీయ జెండాను పోలిన పార్టీ జెండాలు ఉండటం, గవర్నర్లుగా మాజీ మంత్రులు, మాజీ గవర్నర్లను తిరిగి మంత్రులుగా తీసుకోవటం ఎంతవరకు సబబని ఆ లేఖలో ఈశ్వరచంద్ర ప్రశ్నించాడు. మాజీ గవర్నర్ ఏ పార్టీ ప్రభుత్వంలో ఉండకుండా, ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒకే చోటి నుంచి మాత్రమే పోటీ చేసేలా చూడాలని కోరాడు. ఈ అంశాలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ, ఏపీ ఎన్నికల అధికారికి, కేంద్ర ఎన్నికల కమిషన్కు అతని లేఖ ప్రతులను పంపించింది.