ఆర్థిక సమరం.. అత్యవసరం
పథకాలకు కేంద్ర నిధుల తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన
⇒ గతంలో ఉన్న పద్ధతి కొనసాగించాలని ప్రతిపాదన
⇒తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి
⇒28న భోపాల్లో నీతి ఆయోగ్ సమావేశం.. హాజరవనున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ధనిక రాష్ట్రమని చెప్పుకున్నప్పటికీ... కేంద్రం నిధుల కోతతో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతున్నాయని తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది.
ఆర్థిక సాయానికి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయిం చింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రాల భాగస్వామ్యపు వాటాను పెంచటం ఆర్థికం గా గుదిబండగా మారింది. రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల వాటా పది శాతం పెంచినందున ప్రాయోజిత పథకాలను పునర్వ్యవస్థీకరించాల్సి వచ్చిందని కేంద్రం చెప్పుకుంటోంది. దీంతో ఆర్థికంగా తమపై ఒత్తిడి పెరిగిం దని తెలంగాణ సర్కారు తల పట్టుకుంటోంది. అందుకే.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది.
ఈనెల 28న మధ్యప్రదేశ్లోని భోపాల్లో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అక్కడ ప్రధానంగా ఈ అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించారు. ఆర్థిక , ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఈ అంశాన్ని ప్రత్యేకంగా చర్చిం చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర సౌజన్య పథకాల్లో రాష్ట్రాల వాటాను గతంలో ఉన్న పద్ధతిలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేయాలని.. లేనిపక్షంలో కొత్త రాష్ట్రమైనందున తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలని కోరాలని నిర్ణయించారు.
ఈ రెండింటినీ ప్రస్తావిస్తూ కేం ద్రానికి లేఖ రాయటంతో పాటు.. నీతి ఆయోగ్ సమావేశంలో వీటిని ప్రధాన ఎజెండాగా ప్రస్తావించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పథకాల వారీగా రాష్ట్రంపై ఎంత భారం పడుతుందని విశ్లేషించేందుకు సీఎం సూచనల మేరకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది.
రెంటికీ చెడ్డ రేవడి: గత ఏడాది వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 75 శాతం వాటాను కేంద్రం చెల్లించగా.. మిగతా 25 శాతమే రాష్ట్రం సమకూర్చేది. ఈ ఏడాది నుంచి కేంద్రం తమ పథకాలను పునర్వ్యవస్థీకరించి వాటాను కేవలం 50 శాతానికి పరిమితం చేసింది. మిగతా సగం రాష్ట్రాలే భరించాలని నిర్దేశించింది. పన్నుల వాటా ను పెంచిన సాకుతో కేంద్రం ప్రాయోజిత పథకాల్లో కత్తెర వేయటంతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు దాదాపు రూ. 2,233 కోట్లు కోత పెట్టినట్లయింది. కానీ పాత జనాభా ప్రాతిపదికన నిధులి వ్వడంతో తెలంగాణకు వచ్చే పన్నుల వాటా కూడా తగ్గి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. మొత్తంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.4622 కోట్లు నిలిచిపోయాయని ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
అన్ని పథకాలకు వాతే
గత ఏడాది వరకు అమలైన 63 పథకాల్లో కేంద్రం ప్రస్తుతం 31 పథకాలనే కొనసాగిస్తోంది. అందులో 24 పథకాలకు తామిచ్చే నిధుల వాటాను తగ్గించుకుంది. చిన్నారులు బాలింతలు, గర్భిణుల ఆరోగ్యం, పౌష్టికాహారానికి ఇచ్చే నిధులను సగానికి సగం కుదించింది. ఐసీడీఎస్ ప్రాజెక్టులకు గత ఏడాది రూ.16,316 కోట్లు మంజూరు చేయగా ఈసారి కేవలం రూ. 8 వేల కోట్లు కేటాయించింది.
గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య పథకాలు, స్వచ్ఛభారత్ అభయాన్ కింద అమలు చేసిన ఈ కార్యక్రమాలన్నింటికీ నిధుల వాత పెట్టింది. వీటికి అవసరమయ్యే భాగస్వామ్య వాటాకు నిధులను మళ్లిస్తే.. రాష్ట్రంలో తలపెట్టిన ప్రాధాన్య కార్యక్రమాలకు నిధుల కొరత తలెత్తటం ఖాయమని ఆర్థిక నిపుణులు వేలెత్తి చూపుతున్నారు. అందుకే ముందుజాగ్రత్తగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే రాష్ట్ర సర్కారు మొగ్గు చూపుతోంది.