ఎగిసిపడ్డ ఏటిగడ్డ..
- మల్లన్నసాగర్ ముంపు బాధితుల కన్నెర్ర
తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై ముంపు బాధితులు కన్నెర్రజేశారు. మెదక్ జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్ ఎంపీటీసీ సభ్యుడు దామరంచ ప్రతాప్‌రెడ్డికి చెందిన పంటలను వారు శనివారం ధ్వంసంచేశారు. ఈ ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసమంటూ గ్రామస్తులతో బలవంతంగా భూములను రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని ఆరోపిస్తూ పలువురి పంటలను వారు ధ్వంసం చేశారు. ఎంపీటీసీ ప్రతాప్‌రెడ్డితోపాటు గ్రామానికి చెందిన ఎల్దండ నర్సింహరెడ్డి, నేవూరి జీవన్‌రెడ్డి, మంజుల, తలారి కిష్టయ్యలకు చెందిన పంటలపై గ్రామస్తులు దాడి చేశారు. మొదట ప్రతాప్‌రెడ్డి వ్యవసాయ బావి వద్దకు చేరుకుని స్ప్రింక్లర్లకు నిప్పు పెట్టారు.
అక్కడే ఉన్న వరి నారును బురదలో వేసి తొక్కేశారు. ఆయన బంధువైన మంజుల మొక్కజొన్న పంటను కూడా ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న తొగుట ఎస్ఐ రంగ కృష్ణ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. మహిళలను పంట చేలోకి వెళ్లకుండా అడ్డుకునే క్రమంలో గొడుగు ఎల్లవ్వ అనే మహిళ సొమ్మ సిల్లి పడిపోయింది.
దాంతో గ్రామస్తులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులను పక్కకు నెట్టేసి మరీ మొక్కజొన్న పంటపై దాడి చేశారు. అక్కడినుంచి నర్సింహరెడ్డి, జీవన్‌రెడ్డి, చిన్న రాజవ్వ, తలారి కిష్టయ్యల పంటలను కూడా ధ్వంసం చేశారు. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ సంఘటన స్థలికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పంట, ఆస్తి నష్టానికి కారకులుగా గుర్తించిన 62 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.