డిప్యూటీఈవోల బాధ్యతలు ఇక డీఈవోలకే!
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డిప్యూటీఈవో)లు నిర్వహించిన బాధ్యతలను ఇకపై డీఈవోలే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటివరకు డిప్యూటీఈవోలుగా ఉన్న వారంతా ఇన్ఛార్జి డీఈవోలు అయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీఈవో పోస్టులను విద్యాశాఖ భర్తీ చేయడం ఆపేసింది.
దీంతో డిప్యూటీఈవోలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్వర్తించేవారు లేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీఈవోల బాధ్యతలను ఇకపై డీఈవోలే చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు కొత్త మండలాల్లో ఎంఈవోల బాధ్యతలు కూడా వాటి పరిసర మండలాలకు (పాత మండలాలకు) చెందిన ఎంఈవోలకు అప్పగించాలని డీఈవోలను ఆదేశించినట్లు సమాచారం.