'నా హనీమూన్‌కు మిలిటరీ విమానం కావాలి'
వాషింగ్టన్ : తన హనీమూన్‌కు ఏకంగా అమెరికా మిలిటరీ జెట్ విమానాన్ని అడిగి అమెరికా కోశ విభాగ చీఫ్ స్టీవెన్ నుచిన్ విమర్శల్లో చిక్కారు. హాలీవుడ్ నటిని వివాహం చేసుకున్న ఆయన ఆమెతో కలిసి యూరోపియన్ హనీమూన్‌కు వెళ్లేందుకు మిలిటరీ జెట్‌ను అడిగారు. అందుకోసం అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. అయితే, దీనిని ఆయన ఖండిస్తూ తాను ప్రభుత్వాన్ని అలా అడగలేదని, నా వ్యక్తిగత అవసరాలకోసం ఉపయోగించుకోవాలని, ప్రభుత్వమే చెల్లించాలని కోరినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని చెప్పారు. తానే చెల్లిస్తానని తెలిపానని అన్నారు.
స్టీవెన్ అడిగిన జెట్ విమానంలో ఒక గంట ప్రయాణించాలంటే దాదాపు 25 వేల డాలర్లు ఖర్చవుతాయి. ఏబీసీ న్యూస్ బుధవారం వెల్లడించిన ప్రకారం గంట ప్రయాణించేందుకు 25వేల డాలర్లు ఖర్చయ్యే మిలిటరీ జెట్ విమానాన్ని తాము స్కాట్లాండ్, ఫ్రాన్స్, ఇటలీవంటి యూరోపియన్ దేశాల్లో పర్యటించేందుకు అడిగారట. ఈ సమ్మర్లోనే వారి వివాహం కాగా, దానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా హాజరయ్యారు.
'నేను దాదాపు 50శాతం నా సమయాన్ని జాతీయ భద్రత అంశాలమీదే గడుపుతుంటాను. ఉత్తర కొరియా, ఇరాన్‌లాంటి దేశాల వ్యవహారాల్లో ముఖ్యంగా తలమునకలై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటుంటాను. ఈ నేపథ్యంలో నేను ప్రయాణంలో ఉండగా అలాంటి సమాచారం తెలుసుకునేందుకే ఆ విమానం ద్వారా అయితే సేఫ్‌గా ఉంటుందని అనుకున్నాను. అయితే, ఇప్పుడు మాత్రం నేను ఆ విమానంలో వెళ్లనుగాక వెళ్లను. నా నిర్ణయం మార్చుకున్నాను. నాకు ప్రత్యామ్నాయం దొరికింది' అని చెప్పారు. సున్నితమైన భద్రతాపరమైన అంశాలు తెలుసుకోవడానికి మిలిటరీ విమానమే సరైనదనుకున్నానుగానీ, తన వ్యక్తిగత కారణాలకోసం కాదని వివరించారు.