The European Space Agency
-
అంతరిక్షం నుంచి సూపర్ సెల్ఫీ!
పెద్ద గాజుపలక.. డంబెల్లాంటి ఓ బండరాయి ఉన్నట్లు కనిపిస్తున్న ఈ చిత్రం ఓ సెల్ఫీ(స్వీయచిత్రం)! ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా)కు చెందిన రోసెట్టా వ్యోమనౌక అక్టోబరు 7న దీనిని తీసుకుంది. చిత్రంలో గాజుపలకలా కనిపిస్తున్నది రోసెట్టా 14 మీటర్ల సౌరవిద్యుత్ పలక కాగా.. రాయిలా కనిపిస్తున్నది ‘67/పీ చుర్యుమోవ్ గెరాసిమెంకో’ అనే తోకచుక్క! పదేళ్లుగా ఈ తోకచుక్కను వెంటాడుతూ అంతరిక్షంలో వందల కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన రోసెట్టా ఎట్టకేలకు ఆ తోకచుక్కకు 16 కి.మీ. సమీపంలోకి చేరుకుంది. నవంబరు 11న ఫిలే అనే ఓ ల్యాండర్‌ను ఈ తోకచుక్కపైకి దింపనున్న రోసెట్టా పరిశోధనలు చేసి భూమికి సమాచారం పంపనుంది. 47.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తోకచుక్క గుట్టు తెలిస్తే.. భూమిపైకి నీరు, జీవం ఎలా ఏర్పడిందన్న విషయాలు తెలుస్తాయి. -
పొరుగు నక్షత్రం చుట్టూ రెండు కొత్త గ్రహాలు
మన సౌరకుటుంబానికి పొరుగున 13 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కాప్టెన్స్ అనే పురాతన నక్షత్రం చుట్టూ రెండు గ్రహాలు తిరుగుతున్నాయట. వాటిలో ఓ గ్రహంపై జీవుల నివాసానికి అనుకూలమైన వాతావరణం ఉండవచ్చట. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన లా సిలా, హవాయిలోని కెక్, చిలీలోని మెగాలెన్ వేధశాలల్లోని స్పెక్ట్రోమీటర్ల ద్వారా శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు. వీటికి కాప్టెన్స్ బీ, సీలుగా పేర్లుపెట్టారు. ఈ కాప్టెన్స్కు, దాని గ్రహాలకు పెద్ద చరిత్రే ఉందట. ఇవి 1,150 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడి ఉంటాయట. 16,000 కాంతి సంవత్సరాల దూరంలోని ఓ మరుగుజ్జు గెలాక్సీలో ఇవి ఏర్పడగా.. ఆ గెలాక్సీని మన పాలపుంత లాగేసుకుందని అంటున్నారు. ఈ ఊహాచిత్రంలో.. కాప్టెన్స్ నక్షత్రం, గ్రహాలు, మరుగుజ్జు గెలాక్సీలోని నక్షత్రాలు మిల్కీవే వైపు రావడాన్ని చూడొచ్చు.