పొరుగు నక్షత్రం చుట్టూ రెండు కొత్త గ్రహాలు
మన సౌరకుటుంబానికి పొరుగున 13 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కాప్టెన్స్ అనే పురాతన నక్షత్రం చుట్టూ రెండు గ్రహాలు తిరుగుతున్నాయట. వాటిలో ఓ గ్రహంపై జీవుల నివాసానికి అనుకూలమైన వాతావరణం ఉండవచ్చట. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన లా సిలా, హవాయిలోని కెక్, చిలీలోని మెగాలెన్ వేధశాలల్లోని స్పెక్ట్రోమీటర్ల ద్వారా శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు. వీటికి కాప్టెన్స్ బీ, సీలుగా పేర్లుపెట్టారు. ఈ కాప్టెన్స్‌కు, దాని గ్రహాలకు పెద్ద చరిత్రే ఉందట.
ఇవి 1,150 కోట్ల ఏళ్ల క్రితమే ఏర్పడి ఉంటాయట. 16,000 కాంతి సంవత్సరాల దూరంలోని ఓ మరుగుజ్జు గెలాక్సీలో ఇవి ఏర్పడగా.. ఆ గెలాక్సీని మన పాలపుంత లాగేసుకుందని అంటున్నారు. ఈ ఊహాచిత్రంలో.. కాప్టెన్స్ నక్షత్రం, గ్రహాలు, మరుగుజ్జు గెలాక్సీలోని నక్షత్రాలు మిల్కీవే వైపు రావడాన్ని చూడొచ్చు.