విచ్చలవిడిగా బాణసంచా దుకాణాలు
గుర్గావ్: ఫరీదాబాద్‌లో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన బాణసంచా మార్కెట్లో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదం ఘటన అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటుచేస్తే ఏమి జరుగుతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. అయినప్పటికీ నగరంలోని అనేక ప్రాంతాల్లో అనుమతి లేకుండా అనేక బాణసంచా విక్రయ దుకాణాలు వెలిశాయి.
వాస్తవానికి నగరంలోని ఐదు ప్రాంతాల్లో మాత్రమే వీటి విక్రయానికి గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) అనుమతి ఇచ్చింది. లీజర్ వ్యాలీ గ్రౌండ్స్, సెక్టార్ -5 హుడా గ్రౌండ్స్, గౌశాల మైదానం, తావ్దేవి లాల్పార్కు, పటౌడీ ప్రాంతంలోని రాంలీలా మైదానంలో మాత్రమే బాణసంచాను విక్రయించేందుకు అనుమతించారు. అయినప్పటికీ నగరంలో విచ్చలవిడిగా దుకాణాలు వెలిశాయి.
లీజర్ వ్యాలీ గ్రౌండ్స్‌లో 350 దుకాణాలు వెలిశాయి. ఇదిలాఉంచితే కాగా ఢిల్లీకి సరిహద్దులోని ఫరీదాబాద్‌లో మంగళవారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో 230కి పైగా బాణసంచా దుకాణాలు అగ్నికి ఆహుతైన సంగతి విదితమే. ఇక్కడి దసరా మైదానంలో ప్రతిఏటా దీపావళి సందర్భంగా బాణసంచా దుకాణాలు పెట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. దాదాపు 200 దుకాణాలకు లెసైన్సులు ఇచ్చామని అగ్ని మాపక శాఖ అధికారి రామ్ మెహర్ చెప్పారు. కొంతమంది దుకాణాలను అలంకరించుకుంటుండగా, మరి కొందరు బాణసంచాను రవాణా చేస్తున్న సమయంలోనే భారీ అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ఈ ఘటనలో కొన్ని ప్రైవేటు వాహనాలు కూడా కాలి బూడిదయ్యాయని చెప్పారు.