మీకొక బడ్జెట్ కావాలి
వేతన జీవులైనా..వ్యాపారస్థులు అయినా..ఆర్థికంగా ఎదగాలంటే.. అందుకు తగిన ప్రణాళిక ఉండాల్సిందే. దేశానికి, రాష్ట్రానికే కాదు.. సొంతంగా కూడా ఒక బడ్జెట్ ఉండాల్సిందే. లేకపోతే ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకుండా సతమతం కావాల్సి వస్తుంది. నిలకడగా ఆదాయం వచ్చే వేతనజీవులు కావొచ్చు.. రెగ్యులర్‌గా ఒకే మొత్తం ఆదాయం ఉండని ఫ్రీలాన్సర్లు కావొచ్చు.. బడ్జెట్‌ని రూపొందించుకోవాలి. ఇందుకోసం మూడు దశల ప్రణాళిక ఒకటుంది. అదే ఇది..
మొదటి దశ ..
సాధారణంగా ప్రతి నెలా నిలకడగా ఆదాయం ఉన్నప్పుడు మనం వేసుకునే నెలవారీ బడ్జెట్ స్వరూపం ఒక రకంగా ఉంటుంది. అంటే.. మనకి వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చులను సర్దుతాం. కానీ, నిలకడైన ఆదాయం లేనప్పుడు ముందు మనకి ఖర్చులు ఎంత ఉంటాయన్నది లెక్క వేసుకుని, వచ్చే ఆదాయాన్ని వాటికి సర్దుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా మన ఖర్చులను మూడు కేటగిరీలుగా .. అంటే నిత్యావసరాలు, ప్రాధాన్యం ఇవ్వాల్సినవి, లైఫ్ స్టయిల్ ఖర్చులనీ విడగొట్టుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రాథమిక ఖర్చులు కింద పరిగణించాలి. ఇవి ప్రతి నెలా తప్పనిసరిగా చెల్లించాల్సినవి. వీటిలో ఈ కింది అంశాలు వస్తాయి.
1- ఆహారావసరాలు'
హోటళ్లు, బైటి చిరుతిళ్లు మొదలైనవి కాకుండా రోజువారీ ఆహార ఖర్చులు ఎంత అవుతాయన్నది ఈ హెడ్డింగ్ కింద రాసుకోండి. మరీ కత్తెర వేసేయకుండా వాస్తవికంగా రాయండి. ఒక రెండు వారాల పాటు ఖర్చులను పరిశీలించుకుంటే.. ఎంత కేటాయించాలన్నది తెలుస్తుంది.
2- ఇంటి అద్దెలు వగైరా...
కిరాయి ఇంట్లో ఉంటే నెలవారీ అద్దె, అదే గృహ రుణం తీసుకున్న పక్షంలో నెలవారీ ఈఎంఐలు మొదలైనవి ఈ లెక్కలోకి వస్తాయి. కరెంటు బిల్లులు, పన్నులు, ఇంటర్నెట్, ఫోన్ ఖర్చులు తదితరాలు ఇందులో చేర్చవచ్చు.
3- వైద్యం ఖర్చులు..
చికిత్స ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు. ఏదో ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ బీమా ప్రీమియాలు, ఇతర మెడికల్ ఖర్చులను ఉజ్జాయింపుగా లెక్క వేసుకోవాలి.
4- ప్రయాణ ఖర్చులు
బస్సులో ప్రయాణించేట్లయితే ఆ వ్యయాలు.. బైకు, కారు మొదలైన వాటికి సంబంధించి ఇంధనం, మెయింటెనెన్స్, ఈఎంఐలాంటివి ఏమైనా ఉంటే అవి.. ఇందులోకి చేర్చవచ్చు. ఇప్పుడు ఈ ఖర్చులన్నింటినీ కూడితే ప్రతి నెలా ఎంత ఆదాయం అవసరం అవుతుందన్నది తెలుస్తుంది.
రెండో దశ..
ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం
ఇది కాస్త సులువైనదే. ఎందుకంటే ఖర్చులు ఎంత అవుతాయన్నది ఈపాటికి అవగాహన వచ్చేస్తుంది కాబట్టి ఎంత ఆదాయం అవసరం అవుతుందన్నది అంచనా వేసుకోవచ్చు. అలాగే ఆ ఆదాయంపై పన్నులు గట్రా కట్టాల్సి వచ్చేట్లుంటే ఎంత కట్టాల్సి రావచ్చన్నది అంచనా వేసుకునేందుకు ఆన్లైన్లో సాధనాలు కూడా ఉన్నాయి. ఇదంతా ప్రతి నెలా కచ్చితంగా అవసరమయ్యే మొత్తం. దీనికి మించి అదనంగా ఆదాయం వచ్చిన పక్షంలో ముందు పొదుపు చేసేందుకు ప్రాధాన్యమివ్వాలి. అటు పైన అత్యవసర అవసరాల కోసం కొంత పక్కన ఉంచాలి. ఆ తర్వాత కూడా ఇంకా కొంత మిగిలితే అప్పుడు.. బోనస్‌గా అనుకుని లైఫ్‌స్టయిల్ అవసరాలపై ఖర్చు చేసుకోవచ్చు.
మూడో దశ..
వేర్వేరు బ్యాంకు ఖాతాలు..
ఈ ప్రణాళిక అంతా సజావుగా సాగాలంటే ఒక్కో అవసరానికి ఒక్కోటిగా వేర్వేరు ఖాతాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
వ్యాపార అవసరాలకు..
ఆదాయం కింద వచ్చే చెక్కులు, చెల్లింపులు మొదలైనవి డిపాజిట్ చేసుకునేందుకు ఈ ఖాతా ఉపయోగపడుతుంది. ఇందులో నుంచి ప్రతి నెలా కీలకమైన మూడు ఖాతాల్లోకి నగదు బదలాయించవచ్చు. ఆ మూడు ఖాతాలు..
వ్యక్తిగత అవసరాలు..
బిల్లులు, నిత్యావసరాలు మొదలైన ఖర్చులకు సంబంధించిన చెల్లింపుల కోసం ఈ ఖాతాలో డబ్బును ఉపయోగించవచ్చు. బోనస్‌గా అనుకునే డబ్బును కూడా ఈ ఖాతాలోకి మళ్లించి.. ఇతరత్రా లైఫ్‌స్టయిల్ ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు.
ప్రాధాన్యత అవసరాల కోసం పొదుపు..
నెల వారీగా గాకుండా.. మూణ్నెల్లకో, ఆర్నెల్లకో, ఏడాదికో ఒకసారి చెల్లించాల్సినవి కొన్ని ఉంటాయి. ఆదాయ పన్ను, ఆస్తి పన్నులు, బీమా మొదలైన వాటి చెల్లింపుల కోసం.. అలాగే పిల్లల విద్యావసరాల కోసమో కొత్తగా కొనాలనుకుంటున్న ఇంటి డౌన్‌పేమెంట్ కోసమో డబ్బు దాచాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ ఖాతాను ఉపయోగించుకోవచ్చు.
అత్యవసర పరిస్థితుల కోసం..
ప్రతి నెలా ప్రాథమిక ఖర్చులు, పొదుపు డబ్బు తీసేయగా.. మిగిలిన దాన్ని ఈ ఎమర్జెన్సీ ఖాతాలోకి మళ్లించవచ్చు. ఇందులో ఎప్పుడూ కనీసం ఆరు నెలల ఆదాయ పరిమాణం ఉండేట్లు చూసుకుంటే మంచిది. ఈ ఖాతాలో డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఉదాహరణకు..
అకస్మాత్తుగా ఉద్యోగం పోయినా ఇంటి అద్దెలు, బిల్లులు కట్టక తప్పదు. అనారోగ్యం పాలైతే చికిత్స కోసం ఖర్చు పెట్టాల్సిందే.
ఇంటి రిపేర్లు రావొచ్చు, అనుకోని వ్యయాలు ఎదురు కావొచ్చు.
ఇలాంటివాటి కోసం మాత్రమే ఈ ఖాతాని ఉపయోగించాలి.
ఎవరికి వారు తమ తమ అవసరాలు, పరిస్థితులను బట్టి ఇందులో మార్పులు చేర్పులు చేసుకుని బడ్జెట్‌ని రూపొందించుకోవచ్చు. తద్వారా ఆదాయమార్గం ఏదైనా ఇంటి బడ్జెట్ అదుపు తప్పకుండా జాగ్రత్తపడొచ్చు.