మగ కోపమే మగకు శత్రువు!
అత్తమీద కోపం దుత్త మీద చూపితే నష్టం. బయటి విషయాలపై కోపం ఇంట్లో చూపితే నష్టం, కష్టం రెండూ కలుగుతాయి. అదేమీ పట్టించుకోకుండా మగాళ్లలో చాలామంది ఉత్తిపుణ్యానికే తెగ కోపం చూపుతుంటారు. కానీ, ఇప్పుడు తన కోపమే తనకు శత్రువన్న సుభాషితాన్ని మగాళ్లందరూ ‘మన కోపమే మనకు శత్రువ’ని అర్థం చేసుకోవాల్సిన రోజులు వచ్చేశాయి. మేము చేయాల్సిందంతా చేసినా అసలు మగాడి కోపాన్ని ఎందుకు భరించాలన్న ఆలోచన స్త్రీలలో కలుగుతోంది.
ుగాళ్ళలో చాలామందికి కోపమెందుకు ఎక్కవనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే స్థూలంగా బయట పడిన కారణాలివీ.
1. పెంపకం నుంచే...
ఓ ఇంట్లో అన్నా-చెల్లెలి మధ్య ఓ చిన్న గొడవ జరిగితే ‘అన్న ఒక మాట అంటే ఏమైందమ్మా వాడు మగపిల్లాడు’ అనేయడం పెద్దవాళ్లకు ఒక అలవాటుగా ఉండేది. దీనివల్ల కోపం తప్పేమీ కాదేమోనన్న భావనతో మగాళ్లు, దానిని భరించాల్సిందే అన్న ఆలోచనతో స్త్రీలు పెరిగారు. అందుకే ‘మగాడి’ కోపంపై అంత తీవ్రమైన వ్యతిరేకత లేదు. కానీ ఇపుడు పెరుగుతోంది.
2. పరిస్థితుల ప్రభావం
సుమారు 70 శాతం మగాళ్లకు కోపం ఎక్కువట. మగాడికే కోపం ఎందుకు వస్తుందని చేసిన పరిశీలనలు, పరిశోధనల్లో ఎడ్రినలిన్ పాత్ర కనిపించింది. ఇది ఇద్దరిలో ఉన్నా కూడా మగాళ్లలో ఈ హార్మోను అతిగా విడుదలవడం వల్ల కోపం విపరీతంగా పెరుగుతుందట.మగ పిల్లల పెరుగుదలపై ఇంటితో పాటు అనేక విషయాలు ఎక్కువ పాత్ర పోషిస్తాయి. స్నేహాలు, సినిమాలు, మీడియా ముందు నుంచి కాస్త సోషల్ లైఫ్ గడుపుతున్న అబ్బాయిలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలున్న ఇంటి వాతావరణంలో పెరిగిన మగ పిల్లలకు ఇతరుల కంటే కోపం తక్కువని కొన్ని పరిశీలనలు చెబుతున్నాయి.
3. కోపానికి గాంభీర్యానికీ
తేడా గుర్తించకపోవడం
భారతీయ సమాజంలో ఇంటి యజ మాని అయిన పురుషుడు గాంభీర్యం -కోపం ఈ రెండింటికి పెద్దగా తేడా గుర్తించడం లేదు. కోప్పడటాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఉపయోగించే సాధనంగా భావిస్తూ వచ్చారు. అందుకే కుటుంబ సభ్యులను గాడిలో పెట్టడానికి గాంభీర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయంలోనూ కోపాన్ని ప్రదర్శించడం అలవాటుగా ఉంది. మరి కొందరిలో కోపాన్ని మేల్ ఐడెంటిటీగా భావించే దుర్లక్షణం ఉంటుంది.
4.
చనువును తప్పుగా చూడటం
అమెరికాకు చెందిన పరిశోధక ప్రొఫెసర్లు మాథ్యూ మెక్కీ, పీటర్ డి రాబర్ట్స్, జుడీత్ మెక్కీలు కోపం గురించి చేసిన వ్యాఖ్యలు చూడండి ‘‘కొన్ని కోపాలు ఆరోగ్యకరం. ఇంకొన్ని కోపాలు అవసరం. కొన్ని సార్లు విపరీతంగా వచ్చే కోపాన్ని వెంటనే బయటపెడితే మనసుకు సాంత్వన కలుగుతుంది. అయితే, సాధారణంగా దీని విపరిణామాలే ఎక్కువ. అవి ఎంత దారుణంగా ఉంటాయంటే ఇక వాటికి శాశ్వతంగా బంధాలను దూరం చేసే ప్రమాదం కూడా ఉంది’’. ఇక్కడ ఉదాహరించడం సరి కాదేమో గాని అత్తారింటికి దారేది.. సినిమాలో కూతురి (నదియా) మీద తండ్రి చూపిన కోపం వారి సంబంధాలను శాశ్వతంగా తెంపేస్తోంది. అది తండ్రి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది.
భార్యకు అయినా, పిల్లలకు అయినా చనువిస్తే చెడిపోతారన్న భావన ఒకప్పుడు మగ వారిలో పెచ్చు. అది ఎంత సాధారణం అయిందంటే నాన్నకు కోపం మామూలే అన్న విషయం సినిమాలలో ఎన్నో పాత్రలలో ప్రతిబింబిస్తూనే ఉంది. రోజులు మారాయి... వ్యవసాయరంగం ప్రభావం తగ్గి సేవారంగం రాజ్యమేలుతోంది.
ఇపుడు స్త్రీలు పురుషులతో ఎందులోనూ తీసిపోవడం లేదు. ఇంకా చెప్పాలంటే కుటుంబానికి మీకంటే ఎక్కువ సేవ చేస్తున్నపుడు మీ అనవసరమైన కోపాలను భరించాల్సిన అవసరం లేదంటున్నారు. అంతే కాదు, కోపాలు మనస్పర్థలను పెంచుతున్నాయి. భార్య అయినా, పిల్లలు అయినా కోపంతో చెప్తే వినే పరిస్థితులు లేవు. అది మనసుల మధ్య దూరం పెంచుతుంది. ప్రేమాభిమానాలు పలుచబడి బంధాలు బలహీనపడతాయి. ఈ తరం పిల్లలు చనువు లేకపోతేనే చెడిపోతారు.
కోపం తగ్గించకునే క్రమంలో మీరు చేయాల్సిన మొదటిపని మూడో వ్యక్తి ఉన్నపుడు ఎవరి మీద కోప్పడవద్దు. అది మనసుకు చాలా బాధ కలిగిస్తుంది. తొలుత దీనిని మానేసి ఆ తర్వాత పూర్తిగా కోపాన్ని తొలగించుకోండి. మీరు కోప్పడే భర్త/తండ్రి/బాస్ అయితే మీకో శుభవార్త. ఎందుకంటే మీరు కనుక మీ కోపాన్ని తగ్గించుకుని అందరికీ దగ్గరయితే వారి నుంచి లభించే ఆదరణ, ప్రేమాభిమానాలు మిమ్మల్ని అపరిమిత ఆనందానికి గురిచేస్తాయి. అసలు మీ జీవితమే చాలా కొత్తగా మారిపోతుంది. ఎపుడూ కోప్పడని వారికి దక్కే ప్రేమ కంటే కూడా మారిన మనిషికి ముఖ్యంగా కుటుంబం నుంచి దక్కే ప్రేమాభిమానాలు చాలా ఎక్కువట.