శివుడే భిక్షం ఎత్తుకోమన్నాడు...
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘నాతో సెల్ఫీకి రూ.10 రేటు పెట్టాను, డబ్బులు చెల్లించి మరీ సెల్ఫీ దిగుతున్నారు’ అని రష్యన్ పర్యాటకుడు ఈవ్జెనీ బేర్టినీ కోవ్ చెప్పాడు. ఈ నెల 9న కాంచీపురం పర్యటనకు వచ్చిన కోవ్ తన ఖర్చులకు తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో కోపంతో ఏటీఎం కార్డును చించేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి డబ్బుల కోసం కాంచీపురంలోని ఓ ఆలయం మెట్ల వద్ద కోవ్ భిక్షమెత్తుకుంటు న్నాడు.
పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఖర్చులతో చెన్నైలో రష్యా రాయబార కార్యాలయానికి పంపినా వెనక్కి వచ్చి టీ నగర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద యాచిస్తున్నాడు. చెన్నై నార్త్ ఉస్మాన్రోడ్డులోని మరో ఆలయం వద్ద ఆదివారం భిక్షమెత్తుకుంటున్న కోవ్ని స్థానికులు పలకరించగా.. ఆలయాల వద్ద భిక్షం అడగ్గానే డబ్బులేస్తున్నారని అన్నాడు. భారత్కు వచ్చేటప్పుడు తన వద్ద రూ.4 వేలు ఉండేవని, కానీ ఇప్పుడు తన దగ్గర భారీగా సొమ్ము చేరిందని తెలిపాడు. అంతేకాకుండా తాను శివ భక్తుడిని అని, ఆయనే తనను భిక్షం ఎత్తుకోమని ఆదేశించినట్లు చెప్పుకొచ్చాడు. అందుకే భారత్లోని ఆలయాలన్నీ తిరుగుతూ భిక్షమెత్తుకోవాలని తాను తీర్మానించుకున్నట్లు వెల్లడించాడు.