చరిత్రకు సాక్ష్యం - దేవరంపాడు
ఒంగోలు రూరల్ న్యూస్‌లైన్: నిష్కళంక రాజకీయ నాయకుడు బాబు రాజేంద్రప్రసాద్ కాలుమోపిన ప్రాంతమిది. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యం ఈ గ్రామం. అటువంటి ఈ దేవరంపాడును పర్యాటక కేంద్రంగా మార్చివేస్తామని ప్రతి ఏటా ప్రజా ప్రతినిధులు హామీపై హామీలు గుప్పిస్తారు. తరువాత తూతూ మంత్రంగా కొన్ని కార్యక్రమాలు చేసి చేతులు దులుపుకుంటారు. దీంతో ఎన్నో యేళ్లుగా పర్యాటకకేంద్రం ఏర్పాటు కలగానే మిగిలింది.
అంధ్రకేసరి ప్రకాశం పంతులు దండి సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ పిపులునందుకొని ఒంగోలు మండలం దేవరంపాడు గ్రామ శివారు గుండ్లకమ్మ నది ఒడ్డున ఉద్యమం చేపట్టారు. ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం దిగివచ్చింది. దానికి గుర్తుగా దేవరంపాడులో 1935 నవంబర్ 21న అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ విజయ స్థూపం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశం పంతులుకు గాంధీ రాసిన అభినందన లేఖ దేవరంపాడు గ్రంథాలయంలో భద్రపరిచారు.
ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తరువాత ప్రకాశంపంతులు దేవరంపాడు విడిది ఏర్పాటు చేసుకొని నివశించారు. ఇక్కడి రాజుల కుటుంబాలు వారు ఆయనకు మామిడి తోటలు రాసిచ్చాశారు. ఆంధ్రకేసరి చివరి మజిలీలో ఎక్కువ సమయం తన కిష్టమైన విజయస్థూపం దగ్గరే గడిపేవారు. ఈ సందర్భంగా దివంగత దేవాదాయశాఖ మంత్రి దామచర్ల ఆంజనేయులు ఈ ప్రాంతాన్ని చారిత్రాత్మక ప్రదేశంగా గుర్తించుకొనేలా చేస్తామన్నారు.
కలెక్టర్లు క్రిష్ణబాబు, ఉదయలక్ష్మి అక్రమణలపాలైన విజయస్థూపం భూములను స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. తరువాత వచ్చిన కలెక్టర్ కరికాల వళవన్ భూములు కొలతవేసి ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. ఇటువంటి కంటి తుడుపు చర్యలే తప్ప చారిత్రక ప్రదేశంగా గుర్తింపునిచ్చే గట్టి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా ప్రజల కలను తీర్చాల్సిన అవసరం ఉంది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం ఆత్మీయబంధంగా ఉన్న విజయ స్థూపం ప్రాంతంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి.