అదే... మర్రదే... పుసుక్కున ఫీలైపోతాడు!
ఎల్బీ శ్రీరామ్‌లో గొప్ప నటుడు దాగున్నాడని బయటకు లాక్కొచ్చి పుసుక్కున చూపించిన సినిమా ‘చాలా బాగుంది’. ఈవీవీ ఇచ్చిన ఈ ట్విస్టుకి ఎల్బీ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆయన కెరీర్‌కి బ్రేకూ, యాక్సిలేటరూ ఈ పాత్రే.
వెస్టు గోదావరి జిల్లా ఈస్టు దిక్కునుండే పల్లెటూరు కోరుమామిడి.
ఆ చుట్టుపక్కల జమానాలో ఈ ఊరెంత ఫేమస్సో, ఈ ఊళ్లో గంటస్తంభం వెంకటేశ్వర్రావు అంత ఫేమస్సు.
మీకేమన్నా డౌటా?
ఓసారి మీరు కలిశారంటే - నా సామి రంగా మరిచిపోమన్నా మరిచిపోలేరు.
మరి అతన్నెలా గుర్తుపట్టడం?
చాలా ఈజీ. ఎలక్షన్ బేనర్లని ఒంటికి లుంగీ లాగా ఎవడైతే కట్టుకుంటాడో
వాడే గంటస్తంభం వెంకటేశ్వర్రావు.
మరి అతణ్ణి పరిచయం చేసుకోవడమెలా?
అబ్బో... అంత సీను మనకివ్వడు.
పెద్ద పుడింగులాగా తనే మధ్యలో దూరిపోతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీన్ చూడండి.
నిడదవోలు స్టేషన్లో రైలాగింది.
ఫ్రెండు తాతారావు కూతురి పెళ్లికి ఫ్యామిలీతో సహా దిగాడు పొట్టి ప్రసాద్. ఆ తాతారావుకి క్లోజాతి క్లోజు ఫ్రెండు మన గంటస్తంభం. తాతారావు, గంటస్తంభం ఇద్దరూ పొట్టి ప్రసాద్‌ను రిసీవింగ్ చేసుకోడానికి వెళ్లారు.
పొట్టి ప్రసాద్‌ను చూడగానే తాతారావ్ మొహం వెలిగిపోతుంది. ‘‘ఏరా బావున్నావా?’’ అడిగాడు తాతారావు చాలా ఆప్యాయంగా. పానకంలో పుడకలాగా మన గంటస్తంభం ఎంటరైపోయాడు. ‘‘బుద్ధుందా నీకు? బియ్యం బస్తాలాగా పిటపిటలాడతా ఉంటే బాగున్నావా అని అడుగుతావేంటి?’’ అని లటిక్కున అనేశాడు.
పొట్టి ప్రసాద్ కంగారుపడిపోయాడు. తాతారావుకివన్నీ అలవాటే కాబట్టి, ఏం పట్టించుకోలేదు.
పొట్టి ప్రసాద్ పక్కనే ఒకావిడ నిలబడి ఉంది. ‘‘మనమ్మాయిగారా అండి? అచ్చం తమరి పోలికే’’ అనేశాడు పొట్టి ప్రసాద్. ఇక చూడాలి పొట్టి ప్రసాద్ మొహం. ఫ్యూజులు మొత్తం కొట్టేసి, షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా ఫేసు పెట్టాడు. అయినా రిప్లయ్ ఇవ్వాలి కదా... తప్పదు. ‘‘అది నా కూతురు కాదు... మా ఆవిడ’’ అన్నాడు కొంచెం కోపంగా. ‘‘అయ్యో... మన ఆవిడగారా అండి. అబ్బాయిగారి పక్కన అక్కలా ఉంటే కూతురనేసుకుని అడిగేశా. పుసుక్కున ఫీలయి పోమాకండి.’’
పొట్టి ప్రసాద్‌కి ఇతని విషయంలో క్లారిటీ వచ్చేసింది.
ఈ పెళ్లి నాలుగు రోజులూ తనను వేపుకొని తింటాడని అర్థమైపోయింది. గంటస్తంభంతో గడిపే కన్నా, కరెంట్ స్తంభం ఎక్కి కూర్చోవడం బెటరని ఫిక్సయిపోయాడు.
చూశారా... ఒక్క సీన్‌కే గంటస్తంభం ఎలా గంట మోగించేశాడు. ఇంకొకడెవడైనా ఇలా చేస్తే స్తంభానికి కట్టేసి మరీ కొట్టేవాళ్లు. కానీ మన గంటస్తంభంకుండే ఫ్లాష్‌బ్యాక్... ‘సింహాద్రి’ సినిమాలో ఎన్టీఆర్ ఫ్లాష్‌బ్యాక్ కన్నా పవర్ఫుల్. మన గంటస్తంభం ఒకప్పుడు బాగా బతికి చెడ్డోడు. ఉన్న నాలుగెకరాల్లో పత్తి పండించి, అప్పులు పాలై, పురుగుల మందు తాగేశాడు. అప్పట్నుంచీ కాస్త మెంటలెక్కేసిందన్న మాట. ఇల్లూ, పొలం పోయాయి. మూగ పెళ్లాం... ముగ్గురాడ పిల్లలు మాత్రం మిగిలారు.
తాతారావు కూతురి పెళ్లి జరుగుతోంది. సందడంతా గంటస్తంభానిదే. ‘‘శుభలేఖలు అందరికిచ్చేశావా? ఎవరన్నా దిగడ్డారా?’’ అడిగాడు తాతారావ్.
గంటస్తంభానికి పుసుక్కున కోపం వచ్చేసింది.
‘‘అదే.. మర్రదే... దిగడరా? పనికిమాలిన ఎదవలందరికీ శుభలేఖ లేశావ్. ఇద్దరు ముఖ్యమైన వాళ్లను మాత్రం మరిచిపోయావ్?’’ అన్నాడు. తాతారావ్ కంగారు పడిపోయి, ‘‘ఎవర్రా వాళ్లు?’’ అనడిగాడు.
‘‘ఢిల్లీ వాజ్‌పేయి కేశావా? హైదరాబాద్ నారా చంద్రబాబునాయుడికేశావా?’’ అని గంటస్తంభం క్వశ్చనింగ్సేసేసరికి, తాతారావ్ అదిరిపోయాడు.
‘‘వాళ్లకెందుకురా?’’ అనడిగాడు.
‘‘నువ్వసలు గడ్డి తింటున్నావా? వన్నం తింటున్నావా? కడుపుకి! జన్మభూమని, వాటర్ షెడ్డని, దీపమని బోలెడు పథకాలు పెడితే అన్నీ శుభ్రంగా వాడుకు దొబ్బలే... తీరా మోసి ఇంట్లో శుభకార్యానికి అందర్నీ పిలిచి, వాళ్లిద్దర్నీ మానేస్తావా? ఇవన్నీ మనసులో ఎట్టుకోరు రేపూ...!’’ అని గంటస్తంభం గడగడా చెప్పేసరికి తాతారావుకి పట్టపగలే కళ్లముందు నక్షత్రాలు కనబడ్డాయి. కానీ ఏం చేయగలడు?
ఏమన్నా చేద్దామన్నా... గూట్లో పురుగుల మందు స్టాక్ పెట్టుకున్నాడాయె!
గంటస్తంభం వెంకటేశ్వర్రావుకి ముగ్గురు కూతుళ్లని చెప్పాం కదా. పెద్ద కూతురు సీతామహాలక్ష్మిని తొలిచూపులోనే అమితంగా ఇష్టపడ్డాడు వంశీ. కాణీ కట్నం తీసుకోకుండా పెళ్లి కూడా చేసేసుకున్నాడు.
ఆ రోజు గేదె ఈనింది. భార్య జున్ను చేసింది. గంటస్తంభం ఆ జున్నును కావిడిబద్దకు కట్టుకుని, కోరుమామిడి నుంచి హైదరాబాద్ బయలుదేరాడు రైల్లో.
‘‘ఎదవ రైలు... స్టేషన్ కనబడితే ఆగిపోద్ది... మున్సిపాల్టీ ఎద్దులాగా! అయిదు పెట్టెలకు ఒకటే ఇంజిను..! ఏం ఒక్కో పెట్టెకు ఒక్కో ఇంజిను దొబ్బిచ్చుకోవచ్చుగా...! బుర్రకాయలుండవ్’’ అని విసుక్కున్నాడు.
అడ్రస్ తెలీదు. ఫోన్ నంబర్ తెలీదు. ఇంకేం డీటైల్స్ లేవు. కానీ కావిడి బద్దేసుకుని హైదరాబాద్ అంతా కలియతిరిగేస్తున్నాడు గంటస్తంభం వెంకటేశ్వర్రావు.
‘‘మా అల్లుడిగారి ఇల్లెక్కడ? మా అమ్మాయి ఇల్లెక్కడ?’’ అని కనబడ్డ ప్రతివాణ్ణీ అడుగుతుంటాడు తప్ప... వాళ్లు ఏ హిల్స్‌లో ఉంటారో, ఏ గుట్టలో ఉంటారో, ఏ బాదులో ఉంటారో మాత్రం చెప్పలేకపోతున్నాడు. దాంతో ఇదెక్కడి గోలరా బాబూ అని అందరూ ఒకటే గ్యాలప్.
ఈ గంటస్తంభానికి ఇంకో ఎర్రిబాగులోడు ఎదురుపడ్డాడు. అడ్రస్ కోసం గంటస్తంభం ఆరేడు వారాల నుంచి వెతుకుతుంటే, ఆ ఎర్రిబాగులోడు రెండేళ్ల నుంచి వెతుకుతున్నాడట. ఆ ఎర్రిబాగులోడు వచ్చి వచ్చి, తిన్నగా గంటస్తంభాన్నే అడ్రస్ అడిగాడు. ఈ గంటస్తంభానికేదో బాగా తెలుసన్నట్టుగా ‘‘ఏది అడ్రస్ చూపించు’’ అనడిగాడు. ‘‘డోర్ నంబర్ 7-9-2511/6/3/311/ఎబి-2’’ అంటూ చాంతాండంత అడ్రస్ చదివి వినిపించాడు వాడు. ‘‘ఇంత ఇవరంగా ఉంటే... ఇన్నాళ్లు ఎతుకుతున్నావా?’’ అని గంటస్తంభం ఎటకరించాడు.
‘‘ఏంటి నీకు తెలుసా..? చెప్పవా ప్లీజ్’’ అని బతిమిలాడాడు. గంటస్తంభం చెప్పడం మొదలెట్టాడు. ‘‘సెంటర్‌కెళ్లి ఆటో అట్టుకో. రైల్వే స్టేషన్ కెళ్లి రెలైక్కు. నిడదవోలులో దిగు. అక్కడ గుర్రపు బండి అట్టుకో. అమ్మోరు గుడి పక్కనే సందులోకెళ్లు. అక్కడ కుంటి ఎంకడు కనిపిస్తాడు. వాడితో మాత్రం మాట్లాడకు. ఆడు నాకు ఎగస్పార్టీ. కొంచెం ముందుకెళ్తే పొట్టి భద్రంగాడి కొట్టు కనిపిస్తుంది. వాడు లేకపోయినా వాడి కొడుకుంటాడు. వాణ్ణడిగితే - వెంకట్రామా అండ్ కో... ఎక్కాల బుక్కు చేతిలో పెడతాడు. నువ్వు చూపించిన అంకెలన్నీ అందులో ఉంటాయ్’’ అనేసి చక్కా పోయాడు మన గంటస్తంభం.
మరి మన గంటస్తంభం తన అల్లుడింటికి చేరాడంటారా? చేరే ఉంటాడు లెండి.
రెండు వారాల నుంచి అలా జున్నును మురగబెట్టి మురగబెట్టి ఉంచాడు కదా. ఆ సువాసనకు మున్సిపాల్టీ వాళ్లు కచ్చితంగా వెంటబడే ఉంటారు. వాళ్లే తొట్టిలో కూర్చోబెట్టి మరీ మన గంటస్తంభాన్ని అల్లుడి గారింటికి చేర్చి ఉంటారని ఆశిద్దాం. లేకపోతే దొబ్బేయడు మరి!
- పులగం చిన్నారాయణ
వాడే ఈ పాత్రకు ఇన్స్పిరేషన్
నటుడిగా నాకో జన్మనిచ్చిన పాత్ర ఇది. ఈ పాత్ర లేకపోతే నేను లేను. ఈవీవీగారు ‘చాలా బాగుంది’ చేస్తున్న టైమ్‌లో నేను వెళ్లి కలిసి వేషమడిగాను. చలపతిరావు అసిస్టెంట్‌గా రెండు సీన్ల తింగరోడి వేషం వెంటనే ఇచ్చేశారు. ‘మరీ... రెండు సీన్లేనా’ అని నా మనసులో అసంతృప్తి. దీనికి ముందే ‘రామసక్కనోడు’లో మతిభ్రమించిన పాత్రొకటి చేశా. ఆ పాత్ర యాస భిన్నంగా ఉంటుంది. ఈవీవీ గారు అది చూసి, అదే యాసలో ఈ పాత్ర మొత్తం డిజైన్ చేయమన్నారు.
రెండు సీన్ల వేషం కాస్తా, అయిదు సీన్లు... అలా అలా పెరుగుతూ పోయింది. ఈ పాత్ర కోసం స్క్రిప్టులో మార్పులూ చేర్పులూ చేశారు. నేను మా ఊరెళ్లి ఈ పాత్రను ఎంతవరకు డెవలప్ చేయొచ్చో అంత లెవెల్లో చేశా. మా ఊళ్లో ఇంటింటికీ నీళ్లు మోసే ఓ తింగరబుచ్చి ఉన్నాడు. వాడే ఈ పాత్రకు ఇన్స్పిరేషన్. ఇక ‘గంటస్తంభం వెంకటేశ్వరరావు’ అనే పేరు ఎందుకు పెట్టామంటే - కంచుస్తంభం వెంకటేశ్వరరావు అని నా ఫ్రెండొకడు ఉన్నాడు. ఇంటిపేరు గమ్మత్తుగా ఉండాలని ‘కంచు’ బదులు ‘గంట’ పెట్టామంతే. ఈ పాత్ర విషయంలో ఇంత స్వేచ్ఛ ఇచ్చిన మహానుభావులు ఈవీవీ గారిని ఎప్పటికీ మరిచిపోను. సినిమాకి కొత్త కామెడీ పట్టుకొచ్చానని ఈ పాత్ర గురించి ఎన్ని ప్రశంసలొచ్చాయో! ఆ ప్రశంసలన్నీ మోయాలంటే ఒక కావిడిబద్ద సరిపోదండీ! చిన్న చిన్న పిల్లకాయలు, ఐఏయస్ ఆఫీసర్లక్కూడా పుసుక్కున నచ్చేసింది.
- ఎల్బీ శ్రీరామ్, నటుడు - రచయిత