అప్పుడూ ఇప్పుడూ వాళ్లే నాకు అండ! | No regrets about life, says Jogi Naidu | Sakshi
Sakshi News home page

అప్పుడూ ఇప్పుడూ వాళ్లే నాకు అండ!

Published Fri, Jun 13 2014 11:53 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

అప్పుడూ ఇప్పుడూ వాళ్లే నాకు అండ! - Sakshi

అప్పుడూ ఇప్పుడూ వాళ్లే నాకు అండ!

‘‘కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు జనాల్లో గుర్తింపు, క్రేజ్ ఉంటాయి. ఈ మూడు రంగాల్లో ఒకటైన సినీ ప్రపంచంలో ఉండటం నా అదృష్టం’’ అని జోగి నాయుడు పేర్కొన్నారు. దర్శకుడు కావాలనుకుని వచ్చినా నటునిగా పేరు తెచ్చుకుని, త్వరలో నిర్మాతగా కూడా మారనున్నారు జోగినాయుడు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన 20ఏళ్ల సినీ ప్రస్థానంలోని మలుపుల్ని గుర్తు చేసుకున్నారాయన.  ‘‘2001లో  ‘మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది’తో ఈవీవీగారు నన్ను నటునిగా పరిచయం చేశారు. ఇప్పటికి వందకు పైగా సినిమాలు చేశాను. ‘స్వామి రారా’తో నా కెరీర్ ఊపందుకుంది.

ఆ ఒక్క సినిమా వల్ల నాకు 20 సినిమాల్లో అవకాశాలొచ్చాయి’’ అని జోగి నాయుడు సంతోషం వెలిబుచ్చారు. ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏంటని అడిగితే - ‘‘ఇప్పుడు నేను బ్యాచ్‌లర్‌ని. అదే ఈ పుట్టినరోజు ప్రత్యేకత’’ అన్నారు నిర్వేదంగా. ఝాన్సీ నుంచి విడిపోయారు కాబట్టి, మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అనడిగితే -‘‘మళ్లీ పెళ్లి గురించి ఆలోచించడంలేదు. ప్రస్తుతం నా దృష్టంతా చేస్తున్న సినిమాలపైనా, టీవీ షోస్ పైనే. ఈ ఏడాది చివర్లో ఓ నిర్మాణ సంస్థ ఆరంభించాలనుకుంటున్నా. కథలు సిద్ధంగా ఉన్నాయి. చిన్న బడ్జెట్ చిత్రాలు నిర్మించాలనుకుంటున్నా’’ అన్నారు.

మీ పాప ధన్య ఎవరి దగ్గర ఉంటోంది? అనే ప్రశ్నకు -‘‘ఇటీవలే మాకు విడాకులు వచ్చాయి. ప్రస్తుతం పాప ఝాన్సీ దగ్గరే ఉంటోంది. పాప నన్ను కలవొచ్చనే విషయమై కోర్టులో కేసు సాగుతోంది. నాకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నా’’ అని తెలిపారు. అసలు ఝాన్సీ నుంచి ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు? అంటే.. ‘‘మా మధ్య ఏవో మనస్పర్థలొచ్చాయి. పరిష్కరించుకుని, కలిసి ఉండాలనుకున్నా. కానీ, తనకిష్టం లేదు. దాంతో, విడాకులు ఇవ్వక తప్పలేదు’’ అని చెప్పారు. మీ జీవితంలో పశ్చాత్తాపపడే సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అనడిగితే -‘‘ఏమీ లేవు.

అసిస్టెంట్ డెరైక్టర్‌గా వచ్చినప్పుడు పూరి జగన్నాథ్ దగ్గర చేశాను. కృష్ణవంశీ దగ్గర కూడా పని చేయాలనుకున్నా. ‘జోగి బ్రదర్స్’ షో చూసి, ఆయనే పిలిపించి సహాయ దర్శకునిగా చేర్చుకున్నారు. అదే షో చూసి, ఓరోజు చిరంజీవిగారు నన్నూ, జోగి కృష్ణంరాజుని పిలిపించి ‘అసలు ఎలా చేస్తారయ్యా.. చాలా బాగుంటుంది’ అంటూ ఇద్దర్నీ అమాంతంగా హత్తుకున్నారు. నా పెళ్లి, మా పాప పుట్టినప్పుడు.. ఇలా నా జీవితంలో ఆనందపడే సంఘటనలు చాలా ఉన్నాయి.

నేనెప్పుడూ మంచి విషయాలను మనసులో ఉంచుకుని, చెడు సంఘటనలను మర్చిపోతాను. నేను పశ్చాత్తాపపడాల్సిన సంఘటనలేవీ నా జీవితంలో జరగలేదు. అలాంటి పనులు కూడా చేయలేదు. ఎవరి కోసమూ సినిమా పరిశ్రమకు రాలేదు. నాకోసం వచ్చాను. చిన్న పల్లెటూరి నుంచి ఇక్కడికొచ్చినప్పుడు మా అమ్మా, నాన్న నాకు అండగా నిలిచారు. ఇప్పుడూ వాళ్లే నా అండ’’ అన్నారు. భవిష్యత్తులో సినిమాలకు దర్శకత్వం వహించే ఆలోచన ఉందని జోగినాయుడు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement