హృదయాలను కొల్లగొట్టాలి : సీతారామశాస్త్రి
‘‘ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తడానికి శక్తివంచన లేకుండా శ్రమించిన పని రాక్షసుడు ఈవీవీ. ఎన్నో మంచి సినిమాలు అందించాడు. ఇప్పుడాయన కుమారులు ఈవీవీ సినిమా పతాకంపై మళ్లీ సినిమాలు నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ ‘బందిపోటు’ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాలని కోరుకుంటున్నాను’’ అని ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు.
‘అల్లరి’ నరేశ్, ఈష జంటగా ఈవీవీ సినిమా పతాకంపై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాజేశ్ ఈదర నిర్మించిన చిత్రం ‘బందిపోటు’. కల్యాణ్ కోడూరి స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రాజమౌళి ఆడియో సీడీని ఆవిష్కరించి కీరవాణికి ఇచ్చారు. సినిమా విజయం సాధిస్తే ఆకాశానికి ఎత్తేస్తారనీ, పరాజయంపాలైతే ఎత్తి కుదేస్తారనీ, దేనికీ పొంగిపోకూడదని, కుంగిపోకూడదని వీవీగారు అన్న మాటలు తనకెప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని రాజమౌళి చెప్పారు. ఈవీవీకీ, తనకూ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని కృష్ణారెడ్డి అన్నారు.
ఈవీవీ సంస్థ మళ్లీ చిత్రాలు నిర్మించడం, అది కూడా తన దర్శకత్వంలో రూపొందిన చిత్రంతో ఆరంభం కావడం ఆనందంగా ఉందని ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పారు. ‘‘మా నాన్నగారు మమ్మల్ని హీరోలుగా నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డారో ఈ సంస్థను నిలబెట్టడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడతాం’’ అని నరేశ్ అన్నారు. ఈ వేడుకలో నటులు రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శ్రీకాంత్, చలపతిరావు, నాని, సందీప్ కిషన్, నిర్మాతలు డి. సురేశ్‌బాబు, దామోదరప్రసాద్, దర్శకులు భీమినేని శ్రీనివాసరావు, హరీశ్ శంకర్, జి. నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.