BANDIPOTU
-
‘బందిపోటు’... ఓ గొప్ప అనుభవం!
ఒక్క సినిమాతోనే బర్నింగ్ స్టార్ అనిపించుకున్నారు సంపూర్ణేశ్‌బాబు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈవీవీ సినిమా పతాకంపై రాజేశ్ ఈదర నిర్మించిన ‘బందిపోటు’లో సంపూర్ణేశ్‌బాబు ముఖ్య పాత్ర పోషించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తన కెరీర్లో మంచి మలుపని సంపూ ఆనందం వెలిబుచ్చారు. ‘సాక్షి’తో సంపూర్ణేశ్‌బాబు ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు... ‘‘నరేశ్ పక్కన అదీ ఈవీవీ గారి సంస్థలో నటించడం చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ‘బందిపోటు’లో నటించడం ఓ గొప్ప అనుభవం. సెట్లో గడిపిన ప్రతీ క్షణాన్నీ నేను ఆస్వాదించాను. ఈ సినిమా వల్ల ‘అల్లరి’ నరేశ్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, సయాజీ షిండే తదితర గొప్ప నటులతో కలిసి తెరను పంచుకొనే అవకాశం కలిగింది. వీళ్లందరితో కలిసి నటించాలని తెలిసి మొదట్లో కాస్త టెన్షన్ పడ్డాను. కానీ సెట్లోకి అడుగుపెట్టగానే వాతావారణం అంతా మారి పోయింది. అందరూ చాలా సరదాగా... ఆద్యంతం నవ్వుతూ, నవ్విస్తూ నన్ను కలుపుకొన్నారు. ఆర్యన్ రాజేశ్ గారికి, ‘అల్లరి’ నరేశ్ గారికి నేనంటే చాలా ఇష్టం. వాళ్లు నన్నెంత బాగా చూసుకున్నారో మాటల్లో చెప్పలేను. ఆర్యన్ రాజేశ్ గారి ప్రత్యేకమైన ఆసక్తి వల్లే నేను ఈ సినిమాలో నటించాను.’’ టైమింగ్ తెలిసింది! ‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు తెల్లబ్బాయ్. చిన్న పిల్లల మనస్తత్వం అన్నమాట. ఎదుటివారి ఎత్తుల్ని, పైఎత్తుల్ని, లాజిక్కుల్ని పసిగట్టలేక పోతుంటాను. అందుకే ‘నీ తెల్లటి మనసుకు తెలియలేదురా తెల్లబ్బాయ్’ అని డైలాగ్ చెబుతాడు అల్లరి నరేశ్. ఆయనకి స్నేహితుడిగా సినిమా మొత్తం కనిపిస్తాను. నరేశ్‌తో కలిసి చేసిన ఈ సినిమా ప్రయాణం నా జీవితాంతం గుర్తుండి పోతుంది. కామెడీ టైమింగ్ అంటే ఏంటో ఆయన నుంచి బాగా తెలుసుకున్నాను. ఆయనతో కలిసి మళ్లీ మళ్లీ నటించాలని ఉంది.’’ ఇంట్రడక్షన్ మిస్ కావద్దు! ‘‘సినిమాలో సన్నివేశాలన్నీ ఒకెత్తయితే... నా ఇంట్రడక్షన్ మరో ఎత్తు. గురువుగారు మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతమైన ఇంట్రడక్షన్‌తో నన్ను తెరపై చూపించారు. అందుకే ఆ సన్నివేశాలను అస్సలు మిస్ కావద్దని చెబుతున్నా. సడన్ స్టార్, బర్నింగ్ స్టార్ కలిస్తే థియేటర్ నవ్వులతో మార్మోగిపోవాల్సిందే అని ఈ సినిమా నిరూపించింది.’’ రాజమౌళి గారిని అడుగుతా..! ‘‘ ‘బందిపోటు’ ఆడియో వేడుకలో రాజమౌళి గారిని కలిశాను. ‘బాహుబలి’ విడుదలయ్యాక రాజమౌళిగారిని కలిసి.. ‘తదుపరి మీరు చేయ బోయే సినిమాలో కనీసం రెండు నిమిషాలైనా కనిపించాలనుంది’ అని అడుగుతా. ప్రస్తుతం ‘కొబ్బరిమట్ట’, ‘సింగం 123’ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నా. వాటితో పాటు ఇంకో మూడు చిత్రాల్లోనూ సోలోగా నటించడానికి ఒప్పుకొన్నా.’’ -
ఈవీవీ సంస్థ పేరు నిలబెట్టే సినిమా ఇది!
ఒక్కో తరంలో ఒక్కో కథానాయకుడు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే బాధ్యతను భుజాన వేసుకుంటారు. రాజేంద్రప్రసాద్ తర్వాత ఈ తరంలో ఆ బాధ్యత మోస్తున్న ఓ కథానాయకుడు... ‘అల్లరి’ నరేశ్. ఆయన సినిమాకు వెళ్తే వందశాతం వినోదం గ్యారెంటీ అన్న మాట. నరేశ్ తాజాగా ‘బందిపోటు’ అవతారమెత్తారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈవీవీ సినిమా పతాకంపై ఆర్యన్ రాజేశ్ నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అన్నదమ్ములిద్దరూ ‘సాక్షి’ తో చెప్పిన ముచ్చట్లివీ... అల్లరి నరేశ్: ‘అష్టాచమ్మా’ చూసినప్పట్నుంచీ ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా చేయాలనే ఆలోచన ఉండేది. ఆయన సినిమాల్లో కథనం, వ్యంగ్యం నాకు బాగా నచ్చుతాయి. అయితే ఆయన క్లాస్ డెరైక్టర్, నేనేమో మాస్. మరి మేమిద్దరం కలిసి సినిమా చేస్తే క్లాసూ, మాసూ రెండూ కలిసినంత కథ కావాలి. ‘బందిపోటు’లో ఆ రెండూ ఉన్నాయి. ఇందులో నేను క్లాస్‌గానే కనిపిస్తాను కానీ, చేసే పనులు మాత్రం యమా మాస్‌గా ఉంటాయి. దొంగలపైనే కన్నేసి వాళ్లను మాత్రమే దోచుకొనే కుర్రాడి పాత్ర అన్నమాట. ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్నీ ఆస్వాదిస్తూ హాయిగా నవ్వుకుంటారు. ఇదివరకటిలా స్కూఫ్లతో కూడిన కామెడీ కాకుండా, ఇందులో సన్నివేశాల నుంచే వినోదం పుడుతుంటుంది. యాభై సినిమాలకు చేరువవుతున్న నా ప్రయాణంలో నేను చేసిన ఒక భిన్నమైన చిత్రమిది. క్లాస్ డెరైక్టర్ అయిన ఇంద్రగంటిగారు నా కోసం కొంచెం మాస్‌గా మారారు. నేను ఆయన కోసం కొంచెం క్లాస్‌గా మారాను. అందుకే అటు క్లాస్, ఇటు మాస్ అందరినీ అలరించేలా ఉంటుందీ సినిమా. మా నాన్నగారు స్థాపించిన ‘ఈవీవీ సినిమా’ సంస్థ పునఃప్రారంభం ఇలాంటి క్లీన్ ఎంటర్టైనర్తో కావడం చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా ఈ సంస్థ పేరు నిలబెట్టే సినిమా అవుతుంది. ఆర్యన్ రాజేశ్: నరేశ్ సినిమాకు వచ్చినవాళ్లు నవ్వుకోవాల్సిందే. అయితే ఇటీవల తను చేసిన సినిమాల్లో రొటీన్ కామెడీనే ఎక్కువ. స్కూఫ్లపైనే ఆధారపడినట్టు అనిపించేది. అందుకే ఎలాగైనా నరేశ్ నుంచి ఓ కొత్త రకమైన చిత్రం రావాలి, తను ప్రేక్షకుల్ని కొత్తగా నవ్వించాలి, అదెలా? అని ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన కథే ‘బందిపోటు’. రాజేంద్రప్రసాద్ గారి సినిమాల్లో ఎలాగైతే సన్నివేశాల నుంచి కామెడీ పుడుతుందో ఆ రకమైన కథ కథనాలతో తెరకెక్కిన చిత్రమే ఇది. ఉన్నవాళ్లను దోచి... లేనివాళ్లకు పంచి పెట్టే రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నరేశ్ కనిపిస్తాడు. అలాగని సినిమా సీరియస్‌గా ఉండదు. ఎత్తులు, పైఎత్తులతో చాలా సరదాగా సాగుతుంది. సంపూ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా చిత్రాన్ని తీశారు మోహనకృష్ణ ఇంద్రగంటి. నాన్నగారు స్థాపించిన సంస్థ నుంచి ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్న సంతృప్తి ఉంది. ఇక నుంచి ఈవీవీ సినిమా సంస్థలో వరుసగా సినిమాలు నిర్మించబోతున్నాం. -
అల్లరి నరేశ్‌తో ఇంత సడన్‌గా సినిమా చేస్తాననుకోలేదు : ఈషా
పదహారణాల తెలుగు కథానాయిక ఈషా. ‘అంతకుముందు ఆ తరువాత’ చిత్రంతో తెలుగు తెరపై తళుక్కుమన్న ఈషా తన రెండో సినిమాగా ‘అల్లరి’ నరేశ్‌తో ‘బందిపోటు’లో చేసింది. ఇందులో నరేశ్ ‘బందిపోటు’గా కనిపిస్తే, ఆమె ‘బందిపోటి’గా క నిపిస్తుందట. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాజేశ్ ఈదర నిర్మించిన ‘బందిపోటు’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పాత్ర పరిధి మేరకు కాస్త గ్లామర్‌గా కనిపిస్తానంటున్న ఈషా ‘సాక్షి’తో చెప్పిన ముచ్చట్లు... ఎవరి మనసులో ఏముందో ఇట్టే పట్టేస్తా.... సినిమాలో నా పేరు జాహ్నవి. చాలా స్వతంత్ర భావాలున్న అమ్మాయిని. ఎవరి మనసులో ఏముందో ఇట్టే కనిపెట్టేస్తాను. నరేశ్ దొంగల్ని దోచుకుంటుంటే, నేను ఆయన మనసును దోచుకునే ‘బందిపోటి’ని. చాలా సరదా పాత్ర. కెరీర్ ప్రారంభంలోనే ఇంత మంచి పాత్ర దొరకడం నా అదృష్టం. చాలా ఆనందంగా ఉంది ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమా తరువాత చాలా కథలు విన్నాను. ఆ పాత్రలకు నేను సరిపోనేమో అనిపించింది. అందుకే అంగీకరించలేదు. కొన్నాళ్ల తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ గారే మళ్లీ పిలిచి నాకీ అవకాశం ఇచ్చారు. జాహ్నవి పాత్రకు నేనే సరిపోతానని చెప్పారు. నేషనల్ అవార్డు విన్నింగ్ డెరైక్టర్ అయిన ఇంద్రగంటి దర్శకత్వంలో మళ్లీ నటించడం చాలా ఆనందంగా ఉంది. తొలుత టెన్షన్ పడ్డా... అల్లరి నరేశ్‌తో, పైగా ఈవీవీ బ్యానర్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. సడన్ స్టార్‌తో ఇంత సడన్‌గా కలిసి నటిస్తాననుకోలేదు. ఆయన సినిమా అనేసరికి తొలుత చాలా టెన్షన్ పడ్డా. యాభై సినిమాల హీరోనన్న ఫీలింగ్ ఆయనకెప్పుడూ లేదు. దర్శకుడి నుంచి లైట్‌బాయ్ వరకు అందరినీ సమానంగా చూసేవారు. దాంతో ఆ కంగారంతా పోయింది. ఆయనతో నటించడం చాలా సౌకర్యంగా అనిపించింది. నరేశ్‌కి చాలా ఫాలోయింగ్ ఉంది. మా ఇంట్లోవాళ్లు ఆయన సినిమాలు తెగ చూస్తారు. త్వరలో తమిళంలో దినేశ్ హీరోగా కార్తీక్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నా. -
హ్యాట్రిక్ సాధిస్తా..
రాజమండ్రి సిటీ / బోట్‌క్లబ్ (కాకినాడ) :తాను నటించిన ‘బందిపోటు’ విజయంతో హ్యాట్రిక్ సాధిస్తానని హీరో అల్లరి నరేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 20న విడుదల కానున్న ‘బందిపోటు’ చిత్రబృందం శనివారం ‘దండయాత్ర’ పేరుతో రాజమండ్రి, కాకినాడల్లో హల్చల్ చేశారు. రాజమండ్రిలోని కళామందిర్ షోరూమ్‌లో శ్రీకారం చుట్టిన ఈ ప్రచారయాత్రలో నరేష్‌తో పాటు హీరోయిన ఈషా, నిర్మాత ఆర్యన్ రాజేష్ పాల్గొన్నారు. నరేష్ ‘అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు’ అని చెప్పారు. కుటుంబ సమేతంగా చూడతగిన ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. యాంకర్స్ రవి, లాస్యల ఛలోక్తులతో నవ్వులు పూయించారు. బందిపోటు బృందం అల్లరి నరేష్ మాస్క్‌లు ధరించి అసలైన అల్లరి నరేష్‌ను గుర్తించిన కొనుగోలుదారులకు బహుమతులు అందజేస్తామంటూ చిన్న పోటీ నిర్వహించారు. గుర్తించిన ఇద్దరికి నరేష్ చేతుల మీదుగా బహుమతులందజేశారు. చిత్ర నిర్మాత,హీరో ఆర్యన్ రాజేష్ పుట్టిన రోజు పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. కేక్‌ను సోదరులైన నరేష్, రాజేష్‌లు పరస్పరం తినిపించుకున్నారు. ‘అష్టాచెమ్మా’ హీరో అవసరాల శ్రీనివాస్, దర్శకుడు మోహన్‌కృష్ణ, సంగీత దర్శకుడు కళ్యాణ్ పాల్గొన్నారు. ‘బందిపోటు’ చిత్రీకరణ జిల్లాలోనే ఎక్కువ.. ‘బందిపోటు’ సినిమాను చాలా వరకూ జిల్లాలోనే చిత్రీకరించామని, జిల్లాలో ఎన్నో అందాలున్నాయని హీరో అల్లరి నరేష్ అన్నారు. కాకినాడలోని శ్రీనికేతన్, కళామందిర్ షాపింగ్ మహల్లో చిత్ర బృందం శనివారం ప్రేక్షకులను కలుసుకొంది. ఈ సందర్భంగా నరేష్ విలేకరులతో మాట్లాడుతూ ఈ సినిమా కొత్త రకం కామెడీతో అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. తన 50వ చిత్రం కోసం మంచి కథను వెతుకుతున్నట్టు చెప్పారు. టీమిండియా వరల్డ్‌కప్ మళ్లీ గెలుస్తుందని, ఆదివారం పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో మనదే విజయమని అన్నారు. నటుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ తాను కాకినాడ ఆశ్రమ పాఠశాల్లో చదువుకున్నానని, ఈ నగరమంటే ఎంతో ఇష్టమన్నారు. ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ తన తండ్రి స్థాపించిన ఇవివి బ్యానర్లో ఈ చిత్రం తీశామని, ఈ బ్యానర్‌పై ఇతర హీరోలతోనూ సినిమాలు తీస్తామని చెప్పారు. హీరోయిన్ ఈషా మాట్లాడుతూ సినిమాను విజయవంతం చేయాలని కోరారు. దర్శకుడు మోహన్‌కృష్ణ మాట్లాడుతూ సినిమా తప్పక విజయం సాధిస్తుందన్నారు. -
హృదయాలను కొల్లగొట్టాలి : సీతారామశాస్త్రి
‘‘ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తడానికి శక్తివంచన లేకుండా శ్రమించిన పని రాక్షసుడు ఈవీవీ. ఎన్నో మంచి సినిమాలు అందించాడు. ఇప్పుడాయన కుమారులు ఈవీవీ సినిమా పతాకంపై మళ్లీ సినిమాలు నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ ‘బందిపోటు’ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాలని కోరుకుంటున్నాను’’ అని ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ‘అల్లరి’ నరేశ్, ఈష జంటగా ఈవీవీ సినిమా పతాకంపై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాజేశ్ ఈదర నిర్మించిన చిత్రం ‘బందిపోటు’. కల్యాణ్ కోడూరి స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రాజమౌళి ఆడియో సీడీని ఆవిష్కరించి కీరవాణికి ఇచ్చారు. సినిమా విజయం సాధిస్తే ఆకాశానికి ఎత్తేస్తారనీ, పరాజయంపాలైతే ఎత్తి కుదేస్తారనీ, దేనికీ పొంగిపోకూడదని, కుంగిపోకూడదని వీవీగారు అన్న మాటలు తనకెప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని రాజమౌళి చెప్పారు. ఈవీవీకీ, తనకూ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని కృష్ణారెడ్డి అన్నారు. ఈవీవీ సంస్థ మళ్లీ చిత్రాలు నిర్మించడం, అది కూడా తన దర్శకత్వంలో రూపొందిన చిత్రంతో ఆరంభం కావడం ఆనందంగా ఉందని ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పారు. ‘‘మా నాన్నగారు మమ్మల్ని హీరోలుగా నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డారో ఈ సంస్థను నిలబెట్టడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడతాం’’ అని నరేశ్ అన్నారు. ఈ వేడుకలో నటులు రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శ్రీకాంత్, చలపతిరావు, నాని, సందీప్ కిషన్, నిర్మాతలు డి. సురేశ్‌బాబు, దామోదరప్రసాద్, దర్శకులు భీమినేని శ్రీనివాసరావు, హరీశ్ శంకర్, జి. నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘బందిపోటు’ ఆడియో రిలీజ్
-
నవ్వులతో దోచుకుంటాం
‘‘నరేశ్‌తో ఓ వినూత్న కథాంశంతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అలాంటి కథ కుదరడంతో ఈ ఏడాది మా కాంబినేషన్ కుదిరింది. నరేశ్‌తో నేను తీయాలనుకున్నదానికంటే గొప్ప సినిమా తీశానన్న సంతృప్తి లభించింది. అర్థవంతంగా, ఆరోగ్యకరంగా ఉన్న వినోదంతో సాగే చిత్రం ఇది’’ అని ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పారు. ‘అల్లరి’ నరేశ్, ఈష జంటగా ఈవీవీ సినిమా పతాకంపై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రాజేశ్ ఈదర నిర్మించిన చిత్రం ‘బందిపోటు’. ‘దొంగల్ని దోచుకో’ అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 17తో పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ - ‘‘ఈవీవీ బేనర్ మీద నాన్నగారు ఎన్నో హిట్ చిత్రాలు తీశారు. మళ్లీ ఈ చిత్రంతో మా బేనర్‌పై సినిమాలు తీయడం ఆరంభించాం. ఇకనుంచి ఏడాదికి రెండు లేక మూడు చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాం. ‘బందిపోటు’ని వచ్చే జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నాం. ఆరంభం నుంచి చివరి వరకు వినోదాత్మకంగా సాగే చిత్రం ఇది’’ అన్నారు. రాజేశ్ ఈదర మాట్లాడుతూ- ‘‘ఇంద్రగంటి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. తొలిసారి బయటి దర్శకుడితో చేసిన ఈ సినిమా మా సంస్థ పేరు నిలబెడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఇందులో తనది మంచి పాత్ర అని ఈష చెప్పారు. -
అంతర్జాతీయ గుర్తింపే లక్ష్యం
కొవ్వూరు రూరల్: ‘ప్రస్తుతం తెలుగు సినిమాలకు సరైన గుర్తింపు రావడం లేదు.. ఒక్క సినిమాకైనా అంతర్జాతీయ గుర్తింపు తేవాలన్నదే నా లక్ష్యం’ అని అంటున్నారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. బందిపోటు చిత్ర షూటింగ్లో భాగంగా మంగళవారం కుమారదేవం వచ్చిన ఆయన కొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు. మీరు దర్శకత్వంలో ఎక్కడ శిక్షణ పొందారు నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. 1998-2000లో కెనడాలో చదువుకునే రోజుల్లో అక్కడ యార్క్ యూనివర్సిటీలో ఎంఎఫ్ఏ (ఫిల్మ్ మేకింగ్)లో శిక్షణ పొందాను. ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ, ఎంఫిల్ చేశాను. ఎన్ని చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు, మీకు ఎవరు ఆదర్శం ఇప్పటి వరకు ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించాను. బందిపోటు ఆరో చిత్రం. అంతర్జాతీయ దర్శకుడు సత్యజిత్‌రే, పాతతరం దర్శకులు అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, దివాకర్ బెన్ను, కేవీ రెడ్డి, ప్రస్తుత దర్శకులు రామ్‌గోపాలవర్మ, మణిరత్నం అంటే ఇష్టం. చిత్ర సీమలో మీ ధ్యేయం తెలుగు సినిమాలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనేది నా ధ్యేయం. మంచి కథలతో సినిమాలు తీసి గుర్తింపు పొందాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను. బందిపోటు చిత్ర కథాంశం ఏంటి పరిపూర్ణమైన కామెడీ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రం నడుస్తుంది. ఇప్పటి వరకు హీరో అల్లరి నరేష్ ఏ చిత్రంలో చూపని విధంగా ఓ స్పష్టమైన కథానాయకుడిగా ఇందులో కనిపించనున్నారు. మీ కుటుంబ నేపథ్యం నాన్న శ్రీకాంత్‌శర్మ తెలుగు పండితులు. కొవ్వూరు సంస్కృత పాఠశాలలో ఎంఏ వరకు చదివారు. తల్లి జానకీబాల రచయిత. అక్క కిరణ్మయి సినీ పరిశ్రమలోనే డాక్యుమెంటరీ విభాగంలో పనిచేస్తున్నారు. భార్య ఉమ, ఇద్దరు పిల్లలు నీలిమ, ని శాంత్. అమ్మ పుట్టిన ఊరు తణుకు. నాన్నది రామచంద్రపురం. గోదావరి తీరం ఎలా ఉంది గోదావరి ప్రాంతం అంటే నాకు ఇష్టం. ఇక్కడ సంస్కృతి, ప్రజల సహకారం బాగుంటుంది. ఇటీవల దొమ్మేరులో స్థానికులు అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇచ్చారు. చిన్ని సినిమాలే చేస్తారా... పెద్ద సినిమాలు కూడానా కథాపరంగా నటీనటులను ఎంపిక చేస్తుంటాం. పెద్ద హీరోలతో చేయడానికి కథ దొరికినప్పుడు వారితో దర్శకత్వం చేయడానికి ప్రయత్నిస్తాను. సైఫ్ ఆలీఖాన్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, రవిజేత వంటి విభిన్న పాత్రలు పోషించగలిగిన వారితో సినిమాలు చేయాలని ఉంది. మీకు తృప్తినిచ్చిన మీ సినిమా? గ్రహణం, అష్టాచమ్మా చిత్రాలు సంతృప్తినిచ్చాయి. అంతకుముందు ఆ తరువాత సినిమాలోని ప్రేమకథలో నా వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయి. -
అవును...2017లో మెగాఫోన్ పడతా
చాలామంది నటీనటులు నటనే కాదు, ఇతర శాఖలపై మక్కువ చూపటం సాధారణ విషయమే. 24 కళల్లో తమకు నచ్చిన శాఖను ఎంచుకుంటున్నారు. అందులో దర్శకత్వం శాఖ అంటే అందరికీ మోజే... అవకాశం దొరికితే తమ సత్తా చాటేందుకు మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా హీరో అల్లరి నరేష్ దర్శకత్వంపై మోజు పడ్డాడు. త్వరలో మెగా ఫోన్ పడతానని చెబుతున్నాడు. తనకు నటన కన్నా దర్శకత్వం అంటేనే ఇష్టమని తెలిపాడు. నటన, దర్శకత్వం ఒకేసారి చేయడమనేది కొంచెం కష్టమైన పని అని.... 2017లో దర్శకత్వం చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అల్లరి నరేష్ తన మనసులోని మాట చెప్పాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మోరులో 'బందిపోటు' చిత్రం షూటింగ్ లో పాల్గొన్న అల్లరోడితో చిట్ చాట్..... అన్నయ్య రాజేష్, నేను నిర్మాతలుగా మా బ్యానర్లో బందిపోటు తొలి సినిమాగా నిర్మిస్తున్నాం. ఈవీవీ బ్యానర్‌పై వచ్చే సినిమాలను చూసిన జనం మంచి సినిమా వచ్చింది అనుకులేలా ఉండాలన్నదే మా ధ్యేయం. ఇకపై ఏడాదికి ఒక సినిమా సొంత బ్యానర్లో, మిగిలినవి ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహించిన బ్యానర్లలో నటిస్తా. * బందిపోటు సినిమా కథాంశం ఏంటి ఒక్కమాటలో చెప్పాలంటే హీరో పేరు విశ్వా ఘరానా దొంగ. ప్రజలను దోచుకునే దొంగలను తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి దోచుకుంటుంటాడు. * ఇప్పటికీ ఎన్ని సినిమాల్లో నటించారు బందిపోటు నా 48వ సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మాతగా సాయికిశోర్ దర్శకత్వంలో ఓ సినిమా త్వరలో ప్రారంభించనున్నారు. వచ్చేఏడాది జనవరిలో నా 50వ సినిమాలో నటించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రముఖ నటి రాధ కుమార్తె కార్తీక, మోనాల్‌గజ్జర్ హీరోయిన్లగా సిరి సినిమా బ్యానర్‌పై నూతన దర్శకుడు చిన్నికృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం షూటింగ్లో ఉంది. * లడ్డూబాబు సినిమాపై మీ అభిప్రాయం తెలుగు పరిశ్రమలో ప్రయోగాత్మకంగా నిర్మించిన చిత్రం ఇది. అయితే కొంత నిరాశను మిగిల్చిన మాట వాస్తవం. ఈ సినిమా షూటింగ్ సమయంలో రోజూ నా శరీరంపై 38 కిలోల బరువున్న మేకప్ వేసేవారు. మేకప్ ఉన్నంతకాలం చాలా కష్టంగా ఉండేది. దీనికోసం నెల రోజులపాటు లండన్‌లో ఉండి మేకప్ గురించి తెలుసుకున్నా. తెలుగులో మొదట త్రీడీ సినిమాలో నటించానన్న తృప్తి మిగిలింది. *దర్శకత్వం చేసే ఆలోచన ఉందా నాకు నటన కన్నా దర్శకత్వం అంటేనే ఇష్టం. నటన, దర్శకత్వం ఒకేసారి చేయడమనేది కొంచెం కష్టం. 2017లో దర్శకత్వం చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నాను. * ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా ప్రేమ వివాహమైతే ఇప్పటికే జరిగిపోయి ఉండేది. పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటాను. బహుశా వచ్చే ఏడాది నా పెళ్లి ఉండొచ్చు. -
వినోదంగా దోచేస్తాడు!
అల్లరి నరేశ్ ‘బందిపోటు’గా మారారు. అయితే... ఆయన చేసేది వినోదంతో కూడిన దోపిడి. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ ‘బందిపోటు’కు నిర్దేశకుడు. ఈవీవీ సినిమా పతాకంపై ఆర్యన్ రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ఈవీవీ సత్యనారాయణ జయంతి సందర్భంగా ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి డి.సురేశ్‌బాబు కెమెరా స్విచాన్ చేయగా, డి.రామానాయుడు క్లాప్ ఇచ్చారు. ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ -‘‘సినిమాపై నాకు అభిమానం పెరగడానికి, సినీరంగం వైపు నా అడుగులు పడటానికి కారణం ఈవీవీ సత్యనారాయణ. ఇప్పుడు ఆయన సంస్థ నిర్మించే చిత్రానికి నేను దర్శకుణ్ణి కావడం గర్వంగా ఉంది. ఇది చక్కని వినోదంతో కూడిన కథ. ఇందులో వ్యంగ్యాస్త్రాలు కానీ, పేరడీలు కానీ ఉండవు’’ అని చెప్పారు. ‘‘ఇంద్రగంటి సినిమా అనగానే ఇదేదో ప్రయోగమని అందరూ భావిస్తున్నారు. అయితే ఇది అలాంటి సినిమా కాదు... పూర్తి వినోదాత్మక చిత్రం. ఈ సినిమాకు అన్నయ్య రాజేశ్ నిర్మాత. ఇక నుంచి మా సంస్థలో బయట హీరోలతోనూ సినిమాలు చేస్తాం. అందుకని అన్నయ్య నిర్మాణానికే అంకితమవుతారని అనుకోవద్దు. మంచి పాత్రలు దొరికితే... విలన్‌గా కనిపించడానికి కూడా అన్నయ్య రెడీగా ఉన్నారు. త్వరలో ఆయన్ను తెరపై విలన్‌గా చూడొచ్చు’’అని తెలిపారు అల్లరి నరేశ్. ఆర్యన్ రాజేశ్ మాట్లాడుతూ -‘‘మా సంస్థ నిర్మించే సినిమా నాన్న గౌరవం పెంచేలా ఉండాలి. అందుకే మంచి కథ కోసం ఇన్నాళ్లూ ఎదురుచూశాం. జూలై తొలివారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం. బాలీవుడ్ యశ్‌రాజ్ సంస్థ స్థాయిలో ‘ఈవీవీ సినిమా’ను నిలబెట్టాలనేది మా ధ్యేం. ఇక నుంచి టీవీ సీరియల్స్ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం’’ అని చెప్పారు. కథానాయిక ఈషా, సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరి, కెమెరామేన్ పీజీ విందా మాట్లాడారు. -
అల్లరి నరేష్ బంధిపోటు మూవీ ప్రారంభం
-
ఇంద్రగంటి దర్శకత్వంలో ‘బందిపోటు’గా....
‘అల్లరి’ నరేశ్ త్వరలో బందిపోటుగా కనపడబోతున్నారు. ‘గ్రహణం’, ‘అష్టాచెమ్మా’, అంతకుముందు-ఆ తర్వాత’ చిత్రాలతో సృజనాత్మక దర్శకుడనిపించుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే కథ సిద్ధమైంది. టైటిల్‌గా ‘బందిపోటు’ ఖరారైంది. ఈ బందిపోటు ఏ తరహా నేపథ్యమనేది ప్రస్తుతం సస్పెన్స్. కథానాయిక, ఇతర తారల ఎంపిక జరుగుతోంది. ఏప్రిల్ నుంచి చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. -
‘బందిపోటు సినిమాకు 50 ఏళ్లు
సుందర్‌లాల్ నహతా అంటే ఆ రోజుల్లో ఫేమస్ ఫైనాన్షియర్, ప్రొడ్యూసర్. అందరూ సేఠ్‌గారని పిలిచేవారు. ఫైనాన్స్ సంగతి పక్కనపెడితే, ఆయన చాలా మంచి సినిమాలు తీస్తుండేవారు. డూండీ భాగస్వామ్యంలో రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై ‘శాంతినివాసం’ (1961), ‘ఖైదీ కన్నయ్య’ (1962), ‘రక్త సంబంధం’ (1962)లాంటి సినిమాలు తీశారు. ఈసారి కాంతారావు, రాజనాలను పెట్టి బి.విఠలాచార్య దర్శకత్వంలో బ్రహ్మాండమైన జానపదం తీయాలనుకున్నారు. కథ రాసే బాధ్యతను త్రిపురనేని మహారథికి అప్పగించారు. మహారథి అప్పటికి డబ్బింగ్ సినిమాల కింగ్. డెరైక్ట్ సినిమాకి రాయడం మాత్రం ఇదే ప్రథమం. డూండీకి కుటుంబ మిత్రుడాయన. మహారథి కథ తయారీలో పడ్డారు. ఫ్రెంచ్ విప్లవ యోథుడు స్కార్లెట్ పిప్పర్సన్ జీవితగాథతో పాటు ఇంకొన్ని కథలను మహారథికి రిఫరెన్స్‌గా ఇచ్చారు దర్శకనిర్మాతలు. కథ సిద్ధమైంది. సుందర్‌లాల్ నహతా కథ విని ‘అద్భుతం... అమోఘం’ అన్నారు. కథ విన్నాక నహతా ఆలోచన కూడా మారింది. దీనికి ఎన్టీఆర్ యాప్ట్ అనుకున్నారు. అనుకోవడమే తరువాయి ఎన్టీఆర్‌తో మాట్లాడి కాల్షీట్లు తీసేసుకున్నారు. విఠలాచార్య డైరక్షన్లో ఎన్టీఆర్ చేయడం కూడా అదే ప్రథమం. అలా ‘బందిపోటు’ తెరకెక్కింది. చకచకా షూటింగ్ అయిపోయింది. విఠలాచార్య వర్కింగ్ స్టయిల్, బడ్జెట్ కంట్రోల్ ఇత్యాది పద్ధతులు ఎన్టీఆర్‌ని ఆకట్టుకున్నాయి. అప్పటివరకూ ఎన్టీఆర్ చాలా జానపదాలు చేసినా ఆయనకే ఏదో కొత్త తరహాగా అనిపించింది. 1963 ఆగస్టు 15న ‘బందిపోటు’ విడుదలైనప్పుడు ప్రేక్షకులూ అదే ఫీలయ్యారు. సర్వసాధారణంగా జానపదాలంటే మాయలూ మంత్రాల హంగామా ఎక్కువ ఉంటుంది. ఇందులో ఎక్కువగా మానవ సంబంధాల నేపథ్యాన్ని అనుసరించారు. అందుకే ఈ కొత్త తరహా జానపదాన్ని చూసి ప్రేక్షకుల గుండెలు ఝల్లుమన్నాయి. ఎన్టీఆర్‌ని మాస్ జనం ఎలా చూడాలనుకుంటారో అంతకన్నా ఎక్కువగానే విఠలాచార్య చూపించారు. ఎన్టీఆర్ తిప్పిన కత్తి కన్నా, ఆయన పాత్ర తీరుతెన్నులే పదునుగా అనిపించాయి. ఇక పాటలైతే సూపర్బ్. ముఖ్యంగా ‘ఊహలు గుసగుసలాడె’, ‘వగలరాణివి నీవె’ పాటలైతే ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఘంటసాల సంగీతానికి, గాత్రానికి హేట్సాఫ్ చెప్పాల్సిందే. మహారథి డైలాగ్స్‌కైతే ప్రేక్షకులు సాహో అన్నారు. ఇందులో కృష్ణకుమారి కథానాయిక. అప్పటికే ఎన్టీఆర్, కృష్ణకుమారి జోడీకి యమా క్రేజ్. వీరి కలయికలో ఇది ఏడో సినిమా. విలన్‌గా రాజనాల అదరగొట్టేశారు. రేలంగి, గిరిజల కామెడీ, గుమ్మడి, నాగయ్య, మిక్కిలినేని, రమణారెడ్డిల నటన ఈ సినిమాకు వన్నెలద్దాయి. కథ విషయానికొస్తే - ఓ చందమామ కథలాగానే అనిపిస్తుంది. రాజుగారి బావమరిది రాజ్యంలో అరాచకం సృష్టించడం, దానిని ముసుగు మనిషి వేషంలో కథానాయకుడు ఎదిరించడం, రాజుని బావమరిది బంధించడం, చివరకు కథానాయకుడు రాజుని రక్షించడం... క్లుప్తంగా ఇదీ కథ. దీనికి ఎన్ని హంగులు అద్దాలో అన్నీ అద్దారు విఠలాచార్య. అసలు అద్భుత రసాన్ని వెండితెరపై ఆయన ఉపయోగించినట్టుగా ఇంకెవరూ వాడలేదేమో. అందుకేనేమో కొన్ని కొన్ని హాలీవుడ్ సినిమాలను ప్రపంచమంతా అద్భుతం అని కీర్తించినా, మన తెలుగువాళ్లకు మాత్రం ‘ఇందులో గొప్పేం ఉంది. ఇవన్నీ మనమెప్పుడో విఠలాచార్య సినిమాలో చూసేశాం కదా’ అనిపించేది. ఎన్టీఆర్‌తో చాలామంది దర్శకులు వండర్స్ సృష్టించినా, బి.విఠలాచార్యతో మాత్రం ఎన్టీఆర్‌ది ఓ స్పెషల్ కాంబినేషనే అని చెప్పుకోవాలి. తెలుగు ప్రేక్షకులు బాగా మెచ్చిన హీరో - డెరైక్టర్ కాంబినేషన్‌ల్లో ముందు వరుసలో ఎన్టీఆర్-విఠలాచార్య కాంబినేషన్ కూడా నిలుస్తుంది. ఈ ఇద్దరూ కలిసి మొత్తం 14 సినిమాలు చేశారు. అందులో 11 హిట్లు ఉన్నాయంటే మాటలా మరి! సరిగ్గా ‘బందిపోటు’ విడుదల సమయానికే తెలుగు తెరపై ‘కలర్ ట్రెండ్’ మొదలైంది. అందుకే ఇందులో పతాక సన్నివేశాల్ని రంగుల్లో తెరకెక్కించారు. 5 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుందీ సినిమా. ‘బందిపోటు’ విడుదలై నేటికి 50 ఏళ్లు. ఎప్పటికీ మరిచిపోలేని జానపదం ఇది.