అంతర్జాతీయ గుర్తింపే లక్ష్యం
కొవ్వూరు రూరల్: ‘ప్రస్తుతం తెలుగు సినిమాలకు సరైన గుర్తింపు రావడం లేదు.. ఒక్క సినిమాకైనా అంతర్జాతీయ గుర్తింపు తేవాలన్నదే నా లక్ష్యం’ అని అంటున్నారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. బందిపోటు చిత్ర షూటింగ్‌లో భాగంగా మంగళవారం కుమారదేవం వచ్చిన ఆయన కొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు.
మీరు దర్శకత్వంలో ఎక్కడ శిక్షణ పొందారు
నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. 1998-2000లో కెనడాలో చదువుకునే రోజుల్లో అక్కడ యార్క్ యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ (ఫిల్మ్ మేకింగ్)లో శిక్షణ పొందాను. ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ, ఎంఫిల్ చేశాను.
ఎన్ని చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు, మీకు ఎవరు ఆదర్శం
ఇప్పటి వరకు ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించాను. బందిపోటు ఆరో చిత్రం. అంతర్జాతీయ దర్శకుడు సత్యజిత్‌రే, పాతతరం దర్శకులు అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, దివాకర్ బెన్ను, కేవీ రెడ్డి, ప్రస్తుత దర్శకులు రామ్‌గోపాలవర్మ, మణిరత్నం అంటే ఇష్టం.
చిత్ర సీమలో మీ ధ్యేయం
తెలుగు సినిమాలను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనేది నా ధ్యేయం. మంచి కథలతో సినిమాలు తీసి గుర్తింపు పొందాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను.
బందిపోటు చిత్ర కథాంశం ఏంటి
పరిపూర్ణమైన కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం నడుస్తుంది. ఇప్పటి వరకు హీరో అల్లరి నరేష్ ఏ చిత్రంలో చూపని విధంగా ఓ స్పష్టమైన కథానాయకుడిగా ఇందులో కనిపించనున్నారు.
మీ కుటుంబ నేపథ్యం
నాన్న శ్రీకాంత్‌శర్మ తెలుగు పండితులు. కొవ్వూరు సంస్కృత పాఠశాలలో ఎంఏ వరకు చదివారు. తల్లి జానకీబాల రచయిత. అక్క కిరణ్మయి సినీ పరిశ్రమలోనే డాక్యుమెంటరీ విభాగంలో పనిచేస్తున్నారు. భార్య ఉమ, ఇద్దరు పిల్లలు నీలిమ, ని శాంత్. అమ్మ పుట్టిన ఊరు తణుకు. నాన్నది రామచంద్రపురం.
గోదావరి తీరం ఎలా ఉంది
గోదావరి ప్రాంతం అంటే నాకు ఇష్టం. ఇక్కడ సంస్కృతి, ప్రజల సహకారం బాగుంటుంది. ఇటీవల దొమ్మేరులో స్థానికులు అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇచ్చారు.
చిన్ని సినిమాలే చేస్తారా... పెద్ద సినిమాలు కూడానా
కథాపరంగా నటీనటులను ఎంపిక చేస్తుంటాం. పెద్ద హీరోలతో చేయడానికి కథ దొరికినప్పుడు వారితో దర్శకత్వం చేయడానికి ప్రయత్నిస్తాను. సైఫ్ ఆలీఖాన్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, రవిజేత వంటి విభిన్న పాత్రలు పోషించగలిగిన వారితో సినిమాలు చేయాలని ఉంది.
మీకు తృప్తినిచ్చిన మీ సినిమా?
గ్రహణం, అష్టాచమ్మా చిత్రాలు సంతృప్తినిచ్చాయి. అంతకుముందు ఆ తరువాత సినిమాలోని ప్రేమకథలో నా వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయి.