‘బందిపోటు’... ఓ గొప్ప అనుభవం! | sampoornesh babu gives a special interview with sakshi | Sakshi
Sakshi News home page

‘బందిపోటు’... ఓ గొప్ప అనుభవం!

Published Fri, Feb 20 2015 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

‘బందిపోటు’... ఓ గొప్ప అనుభవం!

‘బందిపోటు’... ఓ గొప్ప అనుభవం!

ఒక్క సినిమాతోనే బర్నింగ్ స్టార్ అనిపించుకున్నారు సంపూర్ణేశ్‌బాబు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈవీవీ సినిమా పతాకంపై రాజేశ్ ఈదర నిర్మించిన ‘బందిపోటు’లో సంపూర్ణేశ్‌బాబు ముఖ్య పాత్ర పోషించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తన కెరీర్‌లో మంచి మలుపని సంపూ ఆనందం వెలిబుచ్చారు. ‘సాక్షి’తో సంపూర్ణేశ్‌బాబు ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు...
 
‘‘నరేశ్ పక్కన అదీ ఈవీవీ గారి సంస్థలో నటించడం చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ‘బందిపోటు’లో నటించడం ఓ గొప్ప అనుభవం. సెట్‌లో గడిపిన ప్రతీ క్షణాన్నీ నేను ఆస్వాదించాను. ఈ సినిమా వల్ల ‘అల్లరి’ నరేశ్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, సయాజీ షిండే తదితర గొప్ప నటులతో కలిసి తెరను పంచుకొనే అవకాశం కలిగింది. వీళ్లందరితో కలిసి నటించాలని తెలిసి మొదట్లో కాస్త టెన్షన్ పడ్డాను. కానీ సెట్‌లోకి అడుగుపెట్టగానే వాతావారణం అంతా మారి పోయింది. అందరూ చాలా సరదాగా... ఆద్యంతం నవ్వుతూ, నవ్విస్తూ నన్ను కలుపుకొన్నారు. ఆర్యన్ రాజేశ్ గారికి, ‘అల్లరి’ నరేశ్ గారికి నేనంటే చాలా ఇష్టం. వాళ్లు నన్నెంత బాగా చూసుకున్నారో మాటల్లో చెప్పలేను. ఆర్యన్ రాజేశ్ గారి ప్రత్యేకమైన ఆసక్తి వల్లే నేను ఈ సినిమాలో నటించాను.’’
 
టైమింగ్ తెలిసింది!
‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు తెల్లబ్బాయ్. చిన్న పిల్లల మనస్తత్వం అన్నమాట. ఎదుటివారి ఎత్తుల్ని, పైఎత్తుల్ని, లాజిక్కుల్ని పసిగట్టలేక పోతుంటాను. అందుకే ‘నీ తెల్లటి మనసుకు తెలియలేదురా తెల్లబ్బాయ్’ అని డైలాగ్ చెబుతాడు అల్లరి నరేశ్. ఆయనకి స్నేహితుడిగా సినిమా మొత్తం కనిపిస్తాను. నరేశ్‌తో కలిసి చేసిన ఈ సినిమా ప్రయాణం నా జీవితాంతం గుర్తుండి పోతుంది.  కామెడీ టైమింగ్ అంటే ఏంటో ఆయన నుంచి బాగా తెలుసుకున్నాను. ఆయనతో కలిసి మళ్లీ మళ్లీ నటించాలని ఉంది.’’
 
ఇంట్రడక్షన్ మిస్ కావద్దు!

‘‘సినిమాలో సన్నివేశాలన్నీ ఒకెత్తయితే... నా ఇంట్రడక్షన్ మరో ఎత్తు. గురువుగారు మోహనకృష్ణ ఇంద్రగంటి అద్భుతమైన ఇంట్రడక్షన్‌తో నన్ను తెరపై చూపించారు. అందుకే ఆ సన్నివేశాలను అస్సలు మిస్ కావద్దని చెబుతున్నా. సడన్ స్టార్, బర్నింగ్ స్టార్ కలిస్తే థియేటర్ నవ్వులతో మార్మోగిపోవాల్సిందే అని ఈ సినిమా నిరూపించింది.’’
 
రాజమౌళి గారిని అడుగుతా..!
‘‘ ‘బందిపోటు’ ఆడియో వేడుకలో రాజమౌళి గారిని కలిశాను. ‘బాహుబలి’ విడుదలయ్యాక రాజమౌళిగారిని కలిసి.. ‘తదుపరి మీరు చేయ బోయే సినిమాలో కనీసం రెండు నిమిషాలైనా కనిపించాలనుంది’ అని అడుగుతా. ప్రస్తుతం ‘కొబ్బరిమట్ట’, ‘సింగం 123’ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నా. వాటితో పాటు ఇంకో మూడు చిత్రాల్లోనూ సోలోగా నటించడానికి ఒప్పుకొన్నా.’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement